ఏపీలో అడ్డగోలుగా ఇసుక దోపిడీ

ఏపీలో అడ్డగోలుగా ఇసుక దోపిడీ జరుగుతోందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు, మాజీ కేంద్ర మంత్రి దగ్గుబాటి పురందేశ్వరి ఆరోపించారు. ఇసుకను అక్రమంగా తరలించడం ద్వారా వస్తున్న సొమ్ము తాడేపల్లి ప్యాల్‌సకు చేరుతోందని అంటూ ఆమెనిప్పులు చెరిగారు. ఇసుకను అడ్డంపెట్టుకుని రూ. వందల కోట్లు దోచుకుంటున్నారని విమర్శించారు. 

నిబంధనలు పాటించకుండా, ఎలాంటి అనుమతులు లేకుండానే ఇసుకను ఇష్టానుసారంగా తవ్వేస్తున్నారని ఆమె మండిపడ్డారు. దీనికి వైసీపీ ప్రభుత్వం సమాధానం చెప్పితీరాలని పురందేశ్వరి డిమాండ్‌ చేశారు. శనివారం ఆమె తూర్పుగోదావరి జిల్లా కడియం మండలంలోని బుర్రిలంకలో ఉన్న ఇసుక ర్యాంపును జనసేన నాయకులతో కలిసి పరిశీలించారు. స్థానికుల నుంచి వివరాలు అడిగి తెలుసుకున్నారు. 

అనంతరం మీడియాతో మాట్లాడుతూ అధికార పార్టీ నాయకులు జేబులు నింపుకోడానికి ఇసుక మాఫియాగా ఏర్పడ్డారని పేర్కొంటూ ఈ డబ్బు ఎక్కడకు వెళుతోందో ప్రభుత్వం సమాధానం చెప్పాలని ఆమె నిలదీశారు. దశాబ్దాలుగా ఇలాంటి ఇసుక దందా చూడలేదని స్థానికులు తెలిపారు. ఇసుక దోపిడీపై ఎవరికైనా చెబితే చంపేస్తాం, కాల్చిపారేస్తాం అని బెదిరిస్తున్నారని వాపోతున్నారు. 

వైసీపీ సర్కార్ ప్రజా వ్యతిరేక విధానాలు, అవినీతిపై మాట్లాడితే వ్యక్తిగత దూషణలకు దిగుతున్నారని పురందేశ్వరి ఆగ్రహం వ్యక్తం చేశారు. అవినీతిపై రుజువులతో మాట్లాడితే సమాధానం చెప్పలేక వ్యక్తిగత విమర్శలు చేస్తున్నారని ఆమె ధ్వజమెత్తారు. మే నెలకే జేపీ కంపెనీకి అనుమతి పూర్తైందని, కానీ ఇంకా యథేచ్చగా ఇసుక తవ్వకాలు కొనసాగుతున్నాయని ఆమె పెర్కోన్నారు. 

రూ.48 కోట్లకు ఇక్కడ ఇసుక అక్రమ తవ్వకాలు జరిపేందుకు ఒప్పందం జరిగిందని ఆమె ఆరోపించారు.   గత ప్రభుత్వంలో లారీ ఇసుక రూ.15 వేలకు లభించగా, ప్రస్తుత వైసీపీ ప్రభుత్వంలో రూ.40 వేలకు చేరడంతో సామాన్యుడికి ఇసుక అందని ద్రాక్షగా మారిందని ఆమె ధ్వజమెత్తారు.

10 టన్నుల అనుమతి ఉన్న లారీలో 30 నుంచి 40 టన్నులు తరలిపోతుందని ఆమె విమర్శించారు. ఇసుక రవాణా బిల్లును చూపిస్తూ ‘‘ఈ బిల్లు ఎవరు ఇచ్చారు? మైనింగ్‌ ఏడీ, జిల్లా కలెక్టర్‌ సంతకం లేకుండా బిల్లా?’’ అని నిలదీశారు. అక్రమ డ్రెడ్జింగ్‌ కారణంగా బోట్‌మెన్‌ సొసైటీ కుటుంబాలు రోడ్డున పడ్డాయని ఆందోళన వ్యక్తంచేశారు.

ఏపీలో ఇసుక సరఫరా దోచుకో, దాచుకో అనే తీరుగా మారిందని పురందేశ్వరి ఆగ్రహం వ్యక్తం చేశారు. జేపీ సంస్థ ముసుగులో ఇసుక దందా కొనసాగుతోందని విమర్శించారు. నదీ గర్భంలో యంత్రాలతో తవ్వకాలు చేపట్టవద్దని గ్రీన్ ట్రైబ్యునల్ ఆదేశాలను వైసీపీ ప్రభుత్వం తుంగలో తొక్కిందని ఆమె ఆరోపించారు.

హోంమంత్రి అనుచరుడిది వైసిపి నేతల హత్య!

రాష్ట్ర హోంమంత్రి తానేటి వనిత నియోజకవర్గంలో వైసీపీ ప్లెక్సీ చింపాడని వేధించడంతో ఒక దళిత యువకుడు బొంతా మహేంద్  పురుగుల మందు తాగి చనిపోయాడని పురందేశ్వరి ఆవేదన వ్యక్తం చేశారు. ‘‘నా ఎస్సీ, నా ఎస్టీ, నా బీసీ అని చెప్పుకొనే సీఎం జగన్‌ ఆ కుటుంబానికి ఏం న్యాయం చేశారు?’’ అని ఆమె ప్రశ్నించారు. ఇది వైసిపి నాయకుల హత్య అని ఆమె స్పష్టం చేశారు.

‘‘హోంమంత్రి అనుచరుడిగా చెబుతున్న బొంతా మహేంద్రకు ఏ విధమైన న్యాయం చేస్తారో ప్రభుత్వం చెప్పాలి. ఈ ఘటనను జాతీయ ఎస్సీ కమిషన్‌ దృష్టికి తీసుకువెళతాం. ఈ ఘటనలో దళిత ఎస్‌ఐను సస్పెండ్‌ చేశారు. మరి వైసీపీ నాయకుల మాటేంటి?” అని ఆమె ప్రశ్నించారు.  సామాజిక న్యాయం పేరుతో వైసీపీ చేస్తున్న బస్సుయాత్ర ఆర్భాటం మాత్రమేనని విమర్శించారు. ప్రధాని మోదీ చేస్తున్న మేలును, రాష్ట్రంలో జరుగుతున్న అవినీతిని ప్రజల్లోకి తీసుకెళ్లాలని పార్టీ నేతలకు ఆమె పిలుపునిచ్చారు.