
* ఏడాదికి 4 గ్యాస్ సిలిండర్లు ఉచితం, పెట్రోల్, డీజిల్ వ్యాట్ తగ్గింపు
* కేంద్ర పథకాల అమలు కోసం ప్రత్యేక మంత్రిత్వ శాఖ
ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీని బీజేపీ నెరవేర్చిందని, ప్రతి హామీని అమలు చేస్తుందని పేర్కొన్న కేంద్ర హోంమంత్రి, బీజేపీ సీనియర్ నేత అమిత్ షా బీజేపీ ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేశారు. “మన మోదీ గ్యారెంటీ బీజేపీ భరోసా” పేరుతో మేనిఫెస్టోను ప్రకటించారు.
మేనిఫెస్టో విడుదల అనంతరం ఆయన మాట్లాడుతూ ట్రిపుల్ తలాక్, ఆర్టికల్ 370, రామమందిరానికి సంబంధించిన అన్ని హామీలను నెరవేర్చామని హామీ ఇచ్చారు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటైనా రాష్ట్రం ఏదీ సాధించలేకపోయిందని విచారం వ్యక్తం చేశారు. బీఆర్‌ఎస్ అధినేత కుటుంబ అవినీతి కారణంగా మిగులు తెలంగాణ రాష్ట్రం అప్పుల రాష్ట్రంగా మారిందని, ప్రజా ప్రభుత్వం కుటుంబ పాలనగా మారిందని ధ్వజమెత్తారు.
కాళేశ్వరం ప్రాజెక్ట్ రూపంలో నిధులన్నీ కేసీఆర్ కు చేరాయని చెబుతూ సొంత రాష్ట్రంలో నిధులు, నీళ్లు, నియామకాలు కల్పించాలన్న లక్ష్యాల్లో ఏ ఒక్కటీ నెరవేరలేదని స్పష్టం చేశారు. ఈరోజు విడుదల చేసిన మేనిఫెస్టో అనేది నరేంద్రమోదీ హామీ అని ఆయన ప్రజలకు భరోసా ఇచ్చారు. బీజేపీ ఏం చెబితే అది చేస్తుందని, బీజేపీ అధికారంలోకి వస్తే బీసీని ముఖ్యమంత్రి చేస్తామని అమిత్ షా పేర్కొన్నారు.
మతం పేరుతో ఇస్తున్న రిజర్వేషన్లను తొలగించి బీసీలు, ఎస్సీలు, ఎస్టీలకు ఇస్తామని మేనిఫెస్టోలో తెలిపారు. ఇక ఎన్నికల మేనిఫెస్టోలో కేంద్ర పథకాల అమలు కోసం ప్రత్యేక మంత్రిత్వ శాఖను బీజేపీ ప్రతిపాదించింది. సంక్షేమ గల్ఫ్ కార్మికుల కోసం ప్రత్యేక ఏజెన్సీని ఏర్పాటు చేస్తామని, అన్ని అవినీతి ఆరోపణలపై రిటైర్ అయిన సుప్రీంకోర్టు న్యాయమూర్తి విచారణ జరిపిస్తామని, ప్రతి 6 నెలలకు రిక్రూట్‌మెంట్ నోటిఫికేషన్ జారీ చేస్తామని హామీ ఇచ్చింది.
పెట్రోలు, డీజిల్‌పై వ్యాట్‌ను తగ్గిస్తామని, కుటుంబానికి రూ. 10 లక్షల ఆరోగ్య బీమా ఉంటుందని మేనిఫెస్టోలో పేర్కొన్నారు. సెప్టెంబర్ 17న హైదరాబాద్ విముక్తి పొందిన రోజును అధికారికంగా జరుపుకుంటామని, మ్యూజియం, స్మారక చిహ్నం ఏర్పాటు చేస్తామని అమిత్ షా చెప్పారు. కేంద్రంలో రాష్ట్రంలో ఒకే ప్రభుత్వం ఉంటే పథకాలు చక్కగా అమలు అవుతాయని అమిత్ షా పేర్కొన్నారు.
తెలంగాణ రాష్ట్రానికి కేంద్రం 2.15 లక్షల కోట్లు ఇచ్చిందని, తెలంగాణకు పసుపు బోర్డు, గిరిజన వర్సిటీని ప్రధాన నరేంద్ర మోదీ ఇప్పటికే ప్రకటించారని ఆయన గుర్తుచేశారు. కరోనా సమయంలో దేశమంతా ఉచితంగా రేషన్ ఇచ్చామని గుర్తు చేశారు.
బీజేపీ మేనిఫెస్టోలో కీలక హామీలు
- ఉజ్వల పథకం లబ్దిదారులకు ఏడాదికి 4 గ్యాస్ సిలిండర్లు ఉచితం
- స్వయం సహాయక బృందాలకు 1 శాతం వడ్డీకే రుణాలు
- డిగ్రీ, ప్రొఫెషనల్ కోర్సుల విద్యార్థినులకు ఉచితంగా ల్యాప్ టాప్ లు
- నవజాతి బాలికపై ఎఫ్డీ(21 ఏళ్లకు రూ.2 లక్షలు)
- మహిళా రైతుల కోసం మహిళా రైతు కార్పొరేషన్
- మహిళలకు 10 లక్షల ఉద్యోగాలు
- యూపీఎస్సీ తరహాలో ప్రతి 6 నెలలకు ఒకసారి టీఎస్పీఎస్సీ ద్వారా ఉద్యోగాల నోటిఫికేషన్లు
- అన్ని ప్రభుత్వ ఉద్యోగాలను 6 నెలల్లో భర్తీ
- ప్రైవేటు ఆసుపత్రుల్లోనూ ఏడాదికి రూ.10 లక్షల వరకూ ఉచిత ఆరోగ్య కవరేజీ
- ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాలకు ఏడాది ఒకసారి ఉచిత వైద్య పరీక్షలు
- జిల్లా స్థాయిలో మల్లీ స్పెషాలిటీ ఆసుపత్రులు ఏర్పాటు
- ధరణి స్థానంలో మీ భూమి యాప్
- గల్ఫ్ బాధితుల కోసం నోడల్ ఏజెన్సీ
- కేంద్ర ప్రభుత్వ పథకాల అమలుకు ప్రత్యేక మంత్రిత్వ శాఖ
- బీఆర్ఎస్ ప్రభుత్వ కుంభకోణాలపై విచారణకు కమిటీ ఏర్పాటు
- ఎస్సీ ఉపవర్గీకరణ
- బీసీ అభ్యర్థిని సీఎం చేస్తాం
- పెట్రోల్, డీజిల్ వ్యాట్ తగ్గింపు
- ఆసక్తిగల రైతులకు ఉచితంగా దేశీ ఆవులు.
- రాజ్యాంగ విరుద్ధమైన మత ఆధారిత రిజర్వేషన్ల తొలగింపు.
- కొత్త రేషన్ కార్డులు.
- ఎరువుల సబ్సిడీతో పాటు రూ.2500 ఇన్‌పుట్ సహాయం.
- వరికి రూ.3100 గరిష్ట మద్దతు దర
- నిజామాబాద్‌ను పసుపు నగరంగా అభివృద్ధి.
- ప్రతి మండలంలో నోడల్ పాఠశాలలు.
- ప్రైవేట్ స్కూల్ ఫీజు నియంత్రణ.
- రాష్ట్రంలోని గ్రామాలలో అర్హులైన పేదలందరికీ ఇళ్ల పట్టాల పంపిణి.
- ప్రతి ఏటా సెప్టెంబర్ 17న హైదరాబాద్ లిబరేషన్ డే
- ఆగస్ట్ 27న రజాకార్లతో పోరాడిన అమరుల స్మృతి దినం
- తెలంగాణ ఉద్యమాన్ని డాక్యుమెంటనేషన్ చేసి మ్యూజియం, మెమోరియల్.
- ఓబీసీలకు రిజర్వేషన్లు పెంపు.
- ఎస్సీలకు జనాభా ఆధారంగా రిజర్వేషన్ల పెంపు.
- రామ్ మందిర్, కాశీ లకు ఉచిత యాత్ర.
More Stories
పాత బస్తీలో హైడ్రా కూల్చివేతలు చేయగలరా?
భారత్ లో ఓటింగ్‌ను పెంచేందుకు అమెరికా నిధులు?
కేసీఆర్ బాటలోనే నడుస్తున్న రేవంత్ రెడ్డి