బిజెపి అధికారంలోకి వస్తే అయోధ్యలో ‘ఉచిత దర్శనం’

తెలంగాణలో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వస్తే అయోధ్యలో కొత్తగా నిర్మించిన రామమందిరానికి ‘ఉచిత దర్శనం’ కల్పిస్తామని కేంద్ర హోంమంత్రి అమిత్ షా శనివారం హామీ ఇచ్చారు. గద్వాల్‌లో జరిగిన ఎన్నికల ర్యాలీలో ప్రజలనుద్దేశించి ఆయన మాట్లాడుతూ అయోధ్యకు ఉచితంగా దర్శనం కోసం పంపిస్తామని హామీ ఇచ్చి బీజేపీని అధికారంలోకి తీసుకురావాలని కోరారు. 

రామ మందిర నిర్మాణాన్ని కాంగ్రెస్ 70 ఏళ్లుగా జాప్యం చేసిందని ఆరోపించిన ఆయన.. ప్రధాని నరేంద్ర మోదీ  శంకుస్థాపన చేయడమే కాకుండా జనవరి 22న ప్రారంభోత్సవం కూడా చేస్తారని తెలిపారు.  బిజెపి అధికారంలోకి వస్తే తెలంగాణాలో వెనుకబడిన తరగతుల (బీసీ) నాయకుడిని ముఖ్యమంత్రిని చేస్తానని పునరుద్ఘాటించారు. 

రాష్ట్ర జనాభాలో బిసిలు 52 శాతం ఉండగా, 135 బిసి వర్గాలు ఉన్నా బిసి ముఖ్యమంత్రి లేడని విస్మయం వ్యక్తం చేశారు. బిసిలకు టికెట్లు ఇవ్వడంలో బిఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌లు రెండూ అన్యాయం చేశాయని ఆరోపించారు. బీసీలకు అత్యధిక టికెట్లు ఇచ్చింది బిజెపియేనని తెలిపారు. నరేంద్ర మోదీ రూపంలో భారత్‌కు తొలి బిసి ప్రధానిని ఇచ్చింది బిజెపి అని గుర్తు చేశారు. 

మోదీ ప్రభుత్వంలో బిసిలకు చెందిన 27 మంది మంత్రులు ఉన్నారని పేర్కొంటూ బిఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌లు రెండూ బిసిలకు వ్యతిరేకమని అమిత్‌ షా ధ్వజమెత్తారు. బిసిల సంక్షేమానికి బీజేపీ మాత్రమే భరోసా ఇస్తుందని స్పష్టం చేశారు. తెలంగాణలో వచ్చే ఎన్నికలు ఐదేళ్ల తెలంగాణ భవిష్యత్తును నిర్ణయిస్తాయని కేంద్ర హోంమంత్రి వెల్లడించారు.

బీఆర్ఎస్ కు వీఆర్ఎస్ ఇచ్చే సమయం వచ్చిందని చెబుతూ జోగులాంబ ఆలయ అభివృద్ధి కోసం రూ.100 కోట్లు ఇస్తామని కేసీఆర్ మోసం చేశారని, ఆలయ అభివృద్ధికి ప్రధాని మోదీ రూ. 70 కోట్లు ఇస్తే వాటిని కూడా ఖర్చు చేయలేదని మండిపడ్డారు. సీఎం కేసీఆర్ అబద్ధపు ప్రచారాలతో ప్రజలను మోసం చేశారని విమర్శించారు.

బీఆర్ఎస్ ప్రభుత్వం గుర్రంగడ్డ, గట్టు రిజర్వాయర్ ను ఎందుకు నిర్మించలేదని అమిత్ షా ప్రశ్నించారు. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు ఇంకా ఎందుకు పూర్తి కాలేదని నిలదేశారు . గద్వాలలో 300 పడకల ఆసుపత్రిని నిర్మిస్తామన్న కేసీఆర్  ఎందుకు నిర్మించలేదని ప్రశ్నించారు.  గద్వాలలో చేనేత కార్మికుల కోసం హ్యాండ్లూమ్‌ వీవర్స్‌ పార్కు ఏర్పాటు చేస్తామన్నారని, అది కూడా ఏర్పాటు చేయలేదని పేర్కొన్నారు. 

డబుల్‌ బెడ్‌ రూమ్‌ ఇళ్లు ఇస్తామని ప్రజలను కేసీఆర్ మోసం చేశారని అమిత్ షా ధ్వజమెత్తారు. బీఆర్ఎస్ కారు స్టీరింగ్‌ ఎంఐఎం ఒవైసీ చేతిలోనే ఉందని అమిత్ షా మరోసారి విమర్శించారు. బీఆర్ఎస్, కాంగ్రెస్‌, మజ్లిస్‌ 2జీ, 3జీ, 4జీ పార్టీలని ఎద్దేవా చేశారు. టీఎస్పీఎస్సీ పేపర్ల లీకేజీతో తెలంగాణ యువత జీవితాలతో ఆడుకున్నారని మండిపడ్డారు. 

బీజేపీకి అధికారమిస్తే ఐదేళ్లలో 2.5 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని అమిత్ షా హామీ ఇచ్చారు. రాష్ట్రంలో అధికారంలోకి రాగానే తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహిస్తామని వెల్లడించారు. బీజేపీకి అవకాశం ఇస్తే తెలంగాణను అభివృద్ధి చేసి చూపిస్తామని భరోసా ఇచ్చారు.

 నవంబర్ 30న జరగబోయే ఎన్నికలు రాష్ట్ర భవిష్యత్ ను నిర్ణయించేవని చెబుతూ  బీసీ నేత సీఎం కావాలంటే బీజేపీకి ఓటు వేయాలని అభ్యర్థించారు. బీసీలకు కాంగ్రెస్, బీఆర్ఎస్ వ్యతిరేక పార్టీలని చెబుతూ ఈ రెండూ పార్టీలు బీసీలకు అన్యాయం చేశారని, అనుకున్నంత స్థాయిలో టికెట్లు కూడా ఇవ్వలేదని విమర్శించారు.