మంగళహారతిలో పైసలు.. మంత్రి సత్యవతిపై కేసు

ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందిన స్త్రీ, శిశు, గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ పై కేసు నమోదు అయింది. ఎన్నికల కోడ్ నిబంధనలు ఉల్లంఘించిన నేపథ్యంలో మహబూబాబాద్ జిల్లా గూడూరు పోలీసులు వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. 
 
గూడూరు మండలంలోని కొంగరగిద్దె గ్రామంలో గురువారం సాయంత్రం మహబూబాబాద్ బీఆర్ఎస్ అభ్యర్థి శంకర్ నాయక్ తో కలిసి ప్రచారం నిర్వహించారు. ఈ క్రమంలో స్థానిక మహిళలు మంగళ హారతి పట్టి మంత్రి సత్యవతి రాథోడ్ కు స్వాగతం పలికారు. హారతి పట్టిన మహిళలతో మాట్లాడిన మంత్రి సత్యవతి రాథోడ్, తనకు హారతి పట్టినందుకు గాను సంతోషం వ్యక్తం చేస్తూ వారి పళ్లెంలో నాలుగు వేల రూపాయలను వేశారు. ఇక ఇప్పుడు ఇదే వివాదాస్పదంగా మారింది.
 
కాగా విషయం గమనించిన కొందరు వ్యక్తులు ఎలక్షన్ అధికారులకు ఫిర్యాదు చేశారు. అనంతరం రంగంలోకి దిగిన ఎన్నికల అధికారులు వీడియో ఫుటేజ్ ఆధారంగా విచారణ జరిపారు. మంగళ హారతి లో డబ్బులు పెట్టినట్టు తేలడంతో మంత్రి సత్యవతి రాథోడ్ పై ఎన్నికల నిబంధనలు ఉల్లంఘించినట్లు 171-–ఇ, 171–-హెచ్ ఐపీసీ తదితర సెక్షన్ల కింద శుక్రవారం కేసు నమోదు చేశారు.

నవంబర్ 3వ తేదీ నుంచి ఎలక్షన్ కోడ్ అమలులో ఉన్నా వివిధ పార్టీల నాయకులు పెద్దగా లెక్క చేయడం లేదు. ఓటర్లకు దగ్గరయ్యేందుకు అభ్యర్థులు ఏదో రకంగా ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. కొద్దిరోజుల కిందటి వరకు వర్ధన్నపేట నియోజకవర్గంలో ఎమ్మెల్యే అరూరి రమేశ్ ఫొటోలతో ఉన్న టిఫిన్ బాక్స్ బ్యాగులు, చీరలు, ఇతర వస్తువులు ఎన్నికల అధికారులకు పట్టుబడిన విషయం తెలిసిందే. 

తాజాగా గురువారం పరకాల నియోజకవర్గంలో ఓ ఎమ్మెల్సీకి సంబంధించిన స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో కుట్టుమిషన్లు తీసుకెళ్తుండగా.. దానిపైనా కేసు నమోదైంది. ఇదిలాఉంటే ఎన్నికల పోటీ చేసే వివిధ పార్టీల అభ్యర్థులు, నాయకుల అక్రమాలు, కోడ్‌ ఉల్లంఘనలపై నేరుగా ఫిర్యాదు చేసేందుకు కేంద్ర ఎన్నికల సంఘం సీ-విజిల్‌ యాప్‌ను అందుబాటులోకి తెచ్చిన విషయం తెలిసిందే. 

ఈ యాప్ తో పాటు టోల్ ఫ్రీ నెంబర్లు కూడా ఏర్పాటు చేసింది. కాగా ఎక్కడికక్కడ ఉల్లంఘనలు పెరిగిపోతుండగా.. జిల్లాలో ఇప్పటివరకు వివిధ రూపాల్లో అధికారులకు 1,393 ఫిర్యాదులు అందాయి. అందులో ఎన్నికల కోడ్ ఉల్లంఘనకు సంబంధించి1950 నెంబర్కు అత్యధికంగా 1,181 ఫిర్యాదులు వచ్చాయి.  1800 425 1816 టోల్ ఫ్రీ నెంబర్కు 69, సీ విజిల్ యాప్ లో 76, ఇతరత్రా ఇంకో 67 కంప్లైంట్స్ ఆఫీసర్లకు అందాయి. 

కాగా మొత్తం 1,393 ఫిర్యాదుల్లో దాదాపుగా అన్ని క్లియర్ చేశామని, కేవలం ఒకే ఒక ఫిర్యాదుపై విచారణ జరుగుతోందని అధికారులు చెబుతున్నారు. ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘిస్తే ప్రజాప్రాతినిధ్య చట్టం–1951 ప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరిస్తున్నారు. ఎక్కడ ఎన్నికల కోడ్ ఉల్లంఘించినా స్వేచ్ఛగా ఫిర్యాదు చేయాలని సూచిస్తున్నారు.