కర్ణాటక అసెంబ్లీలో ప్రతిపక్ష నాయకుడిగా అశోక్

భారతీయ జనతా పార్టీ కర్నాటక అసెంబ్లీలో ప్రతిపక్ష నాయకుడిగా మాజీ ఉపముఖ్యమంత్రి, సీనియర్ నేత ఆర్ అశోక్‌ను శుక్రవారం నియమించింది. బిజెపి లెజిస్లేచర్ పార్టీ సమావేశం అనంతరం అశోక్‌ను ప్రతిపక్ష నాయకుడిగా నియమిస్తున్నట్లు పార్టీ ప్రకటించింది. ఈ పదవికి సునీల్ కుమార్, అశ్వత్థ నారాయణ, అరగ జ్ఞానేంద్ర పేర్లు వినిపించినప్పటికీ చివరికి అశోక్‌ను ఎన్నుకున్నారు. 
 
కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు జరిగి ఆరునెలలు కావస్తున్నప్పటికీ అసెంబ్లీలో ప్రతిపక్ష నాయకుడిని ప్రకటించకపోవడంపై బిజెపిపై కాంగ్రెస్ పార్టీ విమర్శలు గుప్పిస్తూ వస్తోంది. గత మేలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించగా, బిజెపి ఘోరపరాజయం పాలయిన విషయం తెలిసిందే. డిసెంబర్ 4నుంచి బెలగావిలో కర్నాటక శాసన సభ శీతాకాల సమావేశాలు ప్రారంభమవుతున్న నేపథ్యంలో ప్రతిపక్ష నేతను ఎంపిక చేస్తూ బిజెపి నిర్ణయం తీసుకుంది. 
 
గత జులైలో అసెంబ్లీ సమావేశాలు ప్రతిపక్ష నేత లేకుండానే జరిగాయి. ఏడు సార్లు ఎమ్యెల్యేగా ఎన్నికైన అశోక్ రాష్ట్రంలో ప్రధానమైన సామజిక వారాలలో ఒకటైన వక్కలింగ సామాజికవర్గంకు చెందిన వారు. మాజీ ముఖ్యమంత్రి బిఎస్ యడ్డ్యూరప్పకు సన్నిహితుడిగా పేరొందారు. యడ్డ్యూరప్ప కుమారుడు బి వై విజయేంద్రను రాష్త్ర బీజేపీకి అధ్యక్షునిగా నియమించిన వారం రోజులకే ప్రతిపక్ష నాయకుడి ఎంపిక జరిగింది.
 
బిజెపి శాసనసభా పక్ష సమావేశంలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, బిజెపి ప్రధాన కార్యదర్శి దుశ్యంత్ కుమార్ గౌతమ్ పార్టీ కేంద్ర పరిశీలకులుగా పాల్గొని ఎమ్యెల్యేల అభిప్రాయం సేకరించారు. మాజీ ముఖ్యమంత్రి యడ్డ్యూరప్ప, బసవరాజ్ బొమ్మై తదితరులు పాల్గొన్నారు.
ఐదుగురు ముఖ్యమంత్రుల మంత్రివర్గాలలో పనిచేసిన అశోక్ గతంలో హోమ్, రెవిన్యూ, మునిసిపల్ పరిపాలన, రవాణా, వైద్య ఆరోగ్యం వంటి కీలక మంత్రిత్వ శాఖలను నిర్వహించారు.
 
గత మేలో జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో 230 మంది సభ్యులలో కాంగ్రెస్ 135 మంది గెలుపొందగా, బీజేపీకి 66, జేడీఎస్ 19 మంది గెలుపొందారు. ఇతరులను కలుపుకు పోవడంతో మంచి నైపుణ్యం గల నేతగా పేరున్న అశోక్ శాసనసభా పక్ష సమావేశంకు ముందే ఎవ్వరు ప్రతిపక్ష నాయకుడిగా ఎన్నికైనా అందరం కలిసి పనిచేస్తామని చెప్పారు. 
 
2024 లోక్ సభ ఎన్నికలలో రాష్ట్రంలోని మొత్తం 28 స్థానాలను గెల్చుకోవడం ద్వారా నరేంద్ర మోదీ మరోసారి ప్రధానిగా ఎన్నికయ్యేటట్లు చూడటమే తమందరి లక్ష్యమని స్పష్టం చేశారు. “బిజెపికి ఇప్పుడు అసెంల్బ్యలో 66 మంది సభ్యులే ఉండవచ్చు. కానీ మిత్రపక్షంగా చేరిన జేడీఎస్ సభ్యులు 19 మందితో కలిసి 85 మందిమి. ఇదేమీ తక్కువ బలం కాదు” అని పార్టీ శాసనసభాపక్ష నేతగా ఎన్నికైన తర్వాత చెప్పారు. 
 
తాను, అశోక్ కలిసి రాష్ట్రంలోని అవినీతి కాంగ్రెస్ ప్రభుత్వంకు వ్యతిరేకంగా పోరాడి రాష్ట్రంలో ప్రధాని మోదీకి బలం చేకూర్చేవిధంగా పనిచేస్తామని రాష్త్ర బిజెపి అధ్యక్షుడు విజయేంద్ర తెలిపారు.