మధ్యప్రదేశ్‌లో 76.22 శాతం, చత్తీస్‌గఢ్‌లో 70.50% శాతం పోలింగ్

ఉత్తరాది రాష్ట్రాలైన మధ్యప్రదేశ్,  ఛత్తీస్‌గఢ్‌లలో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ చెదురుమదురు ఘటనల మధ్య దాదాపు ప్రశాంతంగా ముగిసింది. మధ్యప్రదేశ్ లో 230 సీట్లకు ఒకేసారి శుక్రవారం పోలింగ్ నిర్వహించారు. పోలింగ్‌ సమయం ముగిసేటప్పటికి 76.22 శాతం ఓట్లు పోలయ్యాయి. అలాగే చత్తీస్‌గఢ్‌లోని 70 సీట్లలో రెండో దశ పోలింగ్ జరగగా 70.50% శాతం పోలింగ్‌ నమోదైంది.
 
ఇరు రాష్ట్రాల్లోనూ ఉదయం మందకొడిగా ప్రారంభమైన పోలింగ్ ఆ తర్వాత వేగం పుంజుకుంది. చివర్లో ఓటర్లు భారీగా పోలింగ్ కేంద్రాలకు తరలిరావడంతో పోలింగ్ శాతాలు భారీగా నమోదయింది.  నక్సల్ ప్రభావిత ప్రాంతాలు ఉండటంతో ఇరు రాష్ట్రాల్లోనూ పోలింగ్ సమయాల్లో మార్పులు చేశారు.  మధ్యప్రదేశ్ లోని నక్సల్ ప్రభావిత ప్రాంతాల్లో పోలింగ్ ను ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకే నిర్వహించారు. మిగతా ప్రాంతాల్లో మాత్రం ఉదయ 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకూ నిర్వహించారు.
 
రాజనగర్ నియోజకవర్గంలోని చ్ఛత్రపూర్ లో  రెండు వర్గాల మధ్య జరిగిన ఘర్షణలతో ఓ కాంగ్రెస్ కౌన్సిలర్ సల్మాన్ ఖాన్  మృతిచెందారు. దీంతో రెండు వర్గాలు పరస్పరం రాళ్లు రువ్వుకోవడంతో కొందరికి గాయాలయ్యాయి. పోలీసులు సకాలంలో ఘటనా స్థలానికి చేరుకుని ఇరు వర్గాలను చెదరగొట్టారు. 
 
ఇండోర్ జిల్లా మొహోవా ప్రాంతంలో రెండు వర్గాల మధ్య ఘర్షణల్లో అయిదుగురు గాయపడ్డారు. అలాగే కేంద్రమంత్రి నరేంద్ర సింగ్ తోమార్ పోటీ చేస్తున్న మోరేనా జిల్లాలోని దిమాని నియోజకవర్గంలో జరిగిన ఘర్షణలో ఇద్దరు గాయపడ్డారు. ఈ చిన్నపాటి ఘర్షణలు మినహా మిగతా అన్ని చోట్ల పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది.
చత్తీస్‌గఢ్‌ లో నక్సల్ ప్రభావిత ప్రాంతాల్లో ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకూ పోలింగ్ నిర్వహించారు. నక్సల్ ప్రభావిత ప్రాంతాల్లో మాత్రం ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం వరకూ పోలింగ్ జరిగింది.
 
కాగా చత్తీస్‌గఢ్‌లోని గరియాబండ్ జిల్ల్లాలో నక్సల్స్ అమర్చిన మందుపతరకు ఐటిబిపి జవాను బలి అయ్యారు. పోలింగ్ సిబ్బందికి ఎస్కార్గ్ వెళ్లిన భద్రతా జవాన్లు పోలింగ్ ముగిసిన తర్వాత తిరిగి వస్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. నక్సల్స్ ప్రభావిత ప్రాంతమైన ఈ జిల్లాలోని బింద్రానవగఢ్ నియోజకవర్గంలోని తొమ్మిది పోలింగ్ కేంద్రాల్లో మధ్యాహ్నం 3 గంటలకే పోలింగ్ ముగిసింది.
 
ఛత్తీ్‌సగఢ్‌లోని రాయ్‌పూర్‌-ఉత్తరం నియోజకవర్గంలో.. అన్ని బూత్‌లలో మహిళా సిబ్బంది విధులు నిర్వహించడం గమనార్హం..! దేశంలోనే ఇలా ఓ అసెంబ్లీ సెగ్మెంట్‌లోని అన్ని బూత్‌లలో మహిళా సిబ్బంది సేవలందించడం ఇదే మొదటిసారి అని అధికారులు తెలిపారు. రాయ్‌పూర్‌-ఉత్తరంలోని 201 పోలింగ్‌ బూత్‌లలో ప్రిసైడింగ్‌ అధికారి మొదలు.. పోలింగ్‌ సిబ్బంది దాకా అంతా మహిళలే ఉండేలా 1,010 మందిని నియమించామని, వారిలో 804 మంది విధుల్లో పాల్గొనగా.. మిగతా వారు బ్యాకప్‌ సిబ్బంది అని వివరించారు.