ధరణి పేరుతో తెలంగాణాలో భారీ భూ కుంభకోణం

ధరణి పేరుతో తెలంగాణాలో భారీ భూ కుంభకోణం జరిగిందని, కేసీఆర్ ప్రభుత్వం అతిపెద్ద `భూదొంగ’ అని మాజీ కేంద్ర మంత్రి, తెలంగాణ బిజెపి ఎన్నికల ఇన్ ఛార్జ్ ప్రకాష్ జవదేకర్ ఆరోపించారు. కేసీఆర్ ప్రభుత్వం ధరణిని సర్వరోగ నివారిణిగా ప్రచారం చేసుకుంటుండగా లక్షలాది మంది రైతులు తమ భూములను దీని కారణంగా కోల్పోయారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.
 
గ్రామాలలో భూ రికార్డులను నిర్వహించాల్సిన విఆర్ఓ వ్యవస్థ లేకుండా చేసి, గ్రామాలలోని భూ రికార్డులను ప్రభుత్వం తీసేసుకొని అవి ఎవ్వరికీ అందుబాటులో లేకుండా చేశారని ఆయన విమర్శించారు. ధరణిలో రెవిన్యూ రికార్డులను మార్చివేసి పట్టాదార్, పోసిషన్ స్థానంలో బినామీ, అక్రమ చొరబాటుదారులు అంటూ పేర్లు మార్చారని ఆయన తెలిపారు.
 
రాష్ట్రంలో బిజెపి అధికారంలోకి రాగానే ధరణి కుంభకోణంపై పూర్తిస్థాయిలో విచారణ జరుపుతామని జవదేకర్ ప్రకటించారు. భూ యజమానులకు న్యాయం చేస్తామని ఆయన భరోసా ఇచ్చారు. ధరణి కారణంగా భూమి కోల్పోయిన వారందరూ బీజేపీకి ఫిర్యాదులు చేయాలని ఆయన కోరారు.
dharanicomplaints.bjp@gmail.comకు వివరాలు పంపించడం గాని, 9391936262,  7330861919, 9281113099, 9281113031 మొబైల్ నంబర్లకు గాని ఫిర్యాదులు పంపాలని ఆయన కోరారు.
 
ఎన్ఐసి  రూపొందించిన ప్రామాణిక సాఫ్ట్ వేర్ ను కేంద్ర ప్రభుత్వం అన్ని రాష్ట్రాలకు అందుబాటులోకి తీసుకు వచ్చిందని, దాని సహాయంతో రాష్త్ర ప్రభుత్వాలే భూ రికార్డులను ప్రస్తుత పరిస్థితులకు అనువుగా అప్ డేట్ చేసుకొనే సౌలభ్యం ఉందని జవదేకర్ చెప్పారు.  ఈ రికార్డులను ఆధునీకరించి పక్రియను తెలంగాణ ప్రభుత్వం మొదట్లో టిసిఎస్ కు అప్పగించగా, మొదటి మూడు నెలలు పద్ధతి ప్రకారం చేశారని, అయితే నిబంధనలు విరుద్ధంగా చేయమని ప్రభుత్వం నుండి వత్తిడులు పెరగడంతో వారు ఆ పక్రియ నుండి తప్పుకున్నారని ఆయన గుర్తు చేశారు.
 
టిసిఎస్  ఈ పక్రియ నుండి తప్పుకున్న తర్వాత ఐఎల్ఎఫ్ఎస్ అనే మరో కోపానికి అప్పగించారని, ఆ కంపెనీ దివాళా తీసిన తర్వాత కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన సాఫ్ట్ వేర్ ను టెర్రాసిఐఎస్ అనే మరో కంపెనీకు రాష్త్ర ప్రభుత్వం అప్పగించగా, ఆ కంపెనీ మనుగడ ప్రశ్నార్థకంగా మారిందని ఆయన వివరించారు.  వాస్తవమైన భూ రికార్డులను పూర్తిగా గందరగోళంగా చేసిన తర్వాత కేంద్ర ప్రభుత్వం రూపొందించిన నిబంధనలను బేతఖర్ చేస్తూ కొత్త నిబంధనలు రూపొందించారని ఆయన చెప్పారు. దీంతో భారీ ఎత్తున భూ రికార్డులు తారుమారైనట్లు ఆరోపణలు వచ్చాయని మాజీ కేంద్ర మంత్రి పేర్కొన్నారు.
 
వ్యవసాయ భూములు, ప్రైవేట్ భూములు, ప్రభుత్వ భూములు, దేవాలయ భూములు, ఈడీ సీజ్ చేసిన భూములు, చెరువులు, కాందిశీకులు భూములు, పరిశ్రమల భూములు, భూదాన్ భూములు, మాజీ సైనికుల భూములు, స్వతంత్ర సమరయోధుల భూములు … ఈ విధంగా పెద్ద మొత్తంలో అవకతవకలు జరిగాయని ఆయన ఆరోపించారు.
 
ఓ విదేశీ కంపెనీ రూపిందించిన డిజిటల్ యాప్ డిజిటల్ ప్రాపర్టీ పత్రాలను పొందిన్నట్లు విశ్వసనీయ సమాచారంతో తెలుస్తుందని జవదేకర్ వెల్లడించారు.  ఓ ప్రభుత్వ డేటాను ఓ విదేశీ కంపెనీ ఏ విధంగా మైనింగ్ (పరిశీలన) చేయగలిగింది జవదేకర్ ప్రశ్నించారు. వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్ ను ప్రస్తుతం రెవిన్యూ  శాఖ పక్రియ నుంచి తొలగించి భూ రికార్డులోకి చేర్చారని, ప్రస్తుతం ఉన్న కార్డ్ సాఫ్ట్ వేర్ కు బదులుగా ధరణికి ఓ కొత్త సాఫ్ట్ వేర్ ను అభివృద్ధి చేశారని ఆయన వివరించారు. 
 
వాస్తవాలను పరిగణలోకి తీసుకోకుండా, గ్రామసభలను జరపకుండా  భూరికార్డుల ధ్రువీకరణ వ్యవస్థను తారుమారు చేయడంతో చాలా సర్వే నంబర్లు కనిపించడం లేదని ఆయన తెలిపారు. ఇటువంటి సమస్యలను పరిష్కరించే వ్యవస్థను ఏర్పాటు చేయడంలో కేసీఆర్ ప్రభుత్వం విఫలమైనదని ఆయన విమర్శించారు. 10 నుంచి 15 లక్షల వరకు పట్టాలు లేని ఖాతాలను ఉన్నాయని, లక్షల ఎకరాలు ప్రొహిబిషన్ కింద చూపిస్తున్నారని జవదేకర్ ధ్వజమెత్తారు.