డీప్ ఫేక్ వీడియోలతో వ్యవస్థకు పెను ముప్పు

డీప్ ఫేక్ వీడియోలతో వ్యవస్థకు పెను ముప్పు

ఇటీవల కాలంలో సోషల్ మీడియాలో డీప్ఫేక్ వీడియోలు విస్తృతంగా దర్శనమిస్తున్నాయి. ప్రధానంగా సినీ తారల అభ్యంతరకర దృశ్యాలతో ఉన్న డీప్ ఫేక్ వీడియోలు కలకలం రేపుతున్నాయి. వేరొకరి ముఖాల స్థానంలో రష్మిక మందన్న, కాజోల్ వంటి తారల ముఖాలను మార్ఫింగ్ చేసి రూపొందిస్తున్న ఈ వీడియోలు నిజమైనవే అని భ్రమించేలా ఉంటున్నాయి. 

అంతెందుకు, ప్రధాని నరేంద్ర మోదీ  ఓ పాట పాడినట్టు డీప్ ఫేక్ వీడియో రూపొందించడం ఇదెంతటి తీవ్రమైన సమస్యో చెబుతోంది. ఇలాంటి వీడియోలపై సర్వత్ర ఆందోళనలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో ప్రధాని మోదీ స్పందిస్తూ డీప్ ఫేక్ వీడియోలు మన వ్యవస్థకు పెను ముప్పుగా పరిణమిస్తున్నాయని, సమాజంలో గందరగోళానికి దారితీస్తున్నాయని ఆందోళన వెలిబుచ్చారు.

“ఇటీవల తెలిసిన వాళ్లు నాకు ఓ వైరల్ వీడియో పంపించారు. అందులో నేను పాట పాడుతున్నట్టుగా ఉంది. ఏఐ సాంకేతిక పరిజ్ఞానాన్ని ఈ విధంగా దుర్వినియోగం చేస్తూ డీప్ ఫేక్ వీడియోలు రూపొందిస్తున్నారు. ఇది సమస్యాత్మకమైన అంశం. డీప్ ఫేక్ వీడియోల పట్ల అప్రమత్తంగా ఉండాలి” అని హెచ్చరించారు. 

శుక్రవారం వాయిస్ ఆఫ్ గ్లోబల్ సౌత్ సమ్మిట్‌ తొలి సెషన్ ను ఉద్దేశించి వర్చువల్ గా ప్రసంగిస్తూ ఈ తరహా వీడియోలపై మీడియా, పాత్రికేయులు ప్రజలకు అవగాహన కల్పించేందుకు ప్రయత్నించాలని పిలుపిచ్చారు. కొత్త పుంతలు తొక్కుతున్న టెక్నాలజీతో ఎదురయ్యే సవాళ్లను ఎదుర్కోవడంపై ప్రజలను సన్నద్ధం చేయాలని ఆయన సూచించారు. 

అంతేకాదు, వైరల్ అవుతున్న డీప్ ఫేక్ వీడియోలను గుర్తించి, వాటిని ఫ్లాగ్ చేసి హెచ్చరికలు జారీ చేయాలని చాట్ జీపీటీ బృందాన్ని కోరినట్టు మోదీ  వెల్లడించారు. ఢిల్లీలోని బిజెపి ప్రధాన కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో మోడీ ఈ వ్యాఖ్యలు చేశారు.

“డీప్ ఫేక్ చాలా పెద్ద సమస్య. డీప్ ఫేక్ వీడియో లపై చాట్ జీపీటీ టీమ్ కూడా తమ కంటెంట్ లో యూజర్లను అప్రమత్తులను చేసే సూచన చేయాలి’’ అని ప్రధాని మోదీ సూచించారు. ‘‘గ్లోబల్ నార్త్, గ్లోబల్ సౌత్ మధ్య అంతరాన్ని న్యూ టెక్నాలజీ పెంచకూడదని భారతదేశం విశ్వాసం. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ను, సాంకేతికతను బాధ్యతాయుతంగా ఉపయోగించాలి. ఇందుకోసం ప్రపంచ దేశాలన్నీ ఏకం కావడానికి ఇదే సరైన సమయం” అని తెలిపారు. 

దీన్ని మరింత ప్రోత్సహించడానికి, వచ్చే నెలలో, భారతదేశం ఆర్టిఫిసిఏఐ గ్లోబల్ పార్టనర్‌షిప్ సమ్మిట్‌ ను నిర్వహిస్తుందని ప్రధాని చెప్పారు.  న్యూఢిల్లీ జి20 డిక్లరేషన్‌లో కూడా గ్లోబల్ సౌత్ అంశం కూడా చేర్చిన విషయాన్ని ఈ సందర్భంగా ప్రధాని మోదీ గుర్తు చేశారు. దేశవ్యాప్తంగా గత సంవత్సరం జరిగిన జి20 సమావేశాలలో గ్లోబల్ సౌత్ ప్రాధాన్యతను భారత్ వివరించిందని ప్రధాని మోదీ తెలిపారు. 

“గత సంవత్సరం డిసెంబర్‌లో, భారతదేశం జి20 అధ్యక్ష పదవిని అంగీకరించినప్పుడు, గ్లోబల్ సౌత్ వాయిస్‌ని పెంచడం మా బాధ్యతగా తీసుకున్నాము. జి20 ని సమ్మిళిత, మానవీయ కేంద్రంగా మార్చడం మా ప్రాధాన్యతగా భావించాం. అందులో భాగంగానే ఈ సంవత్సరం జనవరిలో మొదటిసారిగా వాయిస్ ఆఫ్ గ్లోబల్ సౌత్ సమ్మిట్‌ను నిర్వహించాం” అని ప్రధాని మోదీ వివరించారు.

ఇజ్రాయిల్- హ‌మాస్ యుద్ధం.. చ‌ర్చ‌ల‌తోనే ప‌రిష్కారం

ఇజ్రాయిల్‌-హ‌మాస్ యుద్ధంలో మృతిచెందిన పౌరుల కుటుంబాల‌కు ప్ర‌ధాని మోదీ సంతాపం తెలిపారు. ప‌శ్చిమాసియాలో జ‌రుగుతున్న హింస‌కు అంతం ప‌ల‌కాలంటే ఐక్య‌త‌, స‌హ‌కారం అవ‌స‌రం అని ఆయ‌న తెలిపారు. ఉగ్ర‌వాదానికి, హింస‌కు భార‌త్ వ్య‌తిరేకంగా ఉంద‌ని స్పష్టం చేస్తూ అక్టోబ‌ర్ 7వ తేదీన ఇజ్రాయిల్‌పై హ‌మాస్ చేసిన దాడి కూడా ఆయ‌న ఖండించారు.
 
యుద్ధం వేళ స‌మ‌య‌మ‌నం పాటిలంచాల‌ని, స‌మ‌స్య‌ను ప‌రిష్క‌రించేందుకు చ‌ర్చ‌లు చేప‌ట్టాల‌ని ప్ర‌ధాని మోదీ సూచించారు. ప‌శ్చిమాసియా ప్రాంతం నుంచి కొత్త స‌వాళ్లు ఎదుర‌వుతున్నాయ‌ని చెబుతూ పాల‌స్తీనా అధ్య‌క్షుడు అబ్బాస్‌తో చ‌ర్చించిన త‌ర్వాత ఆ దేశానికి మాన‌వ సాయాన్ని పంపించామ‌ని ఆయ‌న వెల్ల‌డించారు.