పాక్ కు మద్దతుపై చైనాకు భారత్ చురకలు 

పాక్ కు మద్దతుపై చైనాకు భారత్ చురకలు 

గతేడాది పహల్గామ్ ఉగ్రదాడికి ప్రతిస్పందనగా భారత్ చేపట్టిన ‘ ఆపరేషన్ సిందూర్ ’ సమయంలో పాకిస్థాన్‌కు చైనా మద్దతు ఇచ్చిందనే నివేదికల గురించి తాజాగా కేంద్ర ప్రభుత్వం స్పందిస్తూ ఇది తమకు ముందే తెలుసని నివేదికలను  ధ్రువీకరించింది. అంతేకాదు, ఈ విషయంలో చైనా ఆత్మపరిశీలన చేసుకోవాలని సూచించింది. 

కేంద్ర విదేశాంగ శాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్  మాట్లాడుతూ  “గతంలో మాకు తెలిసిన విషయాలను ధ్రువీకరించే నివేదికలను మేము చూశాం. పహల్గామ్ ఉగ్రదాడులకు ప్రతీకారంగా చేపట్టిన ‘ఆపరేషన్ సిందూర్’ అనేది అత్యంత ఖచ్చితమైన, లక్షిత ప్రతిస్పందన. పాకిస్థాన్ గడ్డపై వారి అండదండలతో నడుస్తున్న ప్రభుత్వ ప్రేరేపిత ఉగ్రవాద మౌలిక సౌకర్యాలను ధ్వంసం చేయడమే దీని లక్ష్యం. బాధ్యతాయుత దేశాలుగా చెప్పుకునేవాళ్లు ఉగ్రమూకల స్థావరాలను కాపాడటం వల్ల వారి ప్రతిష్ఠపై ఎలాంటి ప్రభావం పడుతుందో ఆలోచించుకోవాలి’’ అని హితవు చెప్పారు. 

గతేడాది ఆపరేషన్ సిందూర్ సమయంలో తాము పాకిస్థాన్‌కు సాంకేతిక సహాయం అందించినట్లు చైనా తొలిసారిగా అంగీకరించింది. పాక్ వాయుసేన వినియోగించే చైనా తయారీ జె-10సిఈ యుద్ధ విమానాల పనితీరును మెరుగుపరచడానికి తమ ఇంజనీర్లు సహకరించినట్లు చైనా అధికారిక మీడియా వెల్లడించింది.  అధునాతన యుద్ధ విమానాలు, మానవరహిత వైమానిక వాహనాల రూపకల్పనలో కీలక పాత్ర పోషించే చైనా ఏవియేషన్ ఇండస్ట్రీ కార్పొరేషన్ (ఏవిఐసి)కు చెందిన చెంగ్డూ ఎయిర్‌క్రాఫ్ట్ డిజైన్ అండ్ రిసెర్చ్ ఇన్‌స్టిట్యూట్‌ ఇంజనీర్ జాంగ్ హెంగ్‌ ఇంటర్వ్యూను ఆ దేశ అధికారిక టెలివిజన్ సీసీటీవీ గురువారం ప్రసారం చేసింది. 

గతేడాది భారత్‌తో జరిగిన ఘర్షణల్లో పాకిస్థాన్‌కు చైనా సాంకేతిక సహాయం అందించినట్టు సీసీటీవీని ఉటంకిస్తూ సౌత్ చైనా మార్నింగ్ పోస్ట్ నివేదించింది. పాకిస్థాన్ వైమానిక దళం, ఏవిఐసి అనుబంధ సంస్థ తయారుచేసిన జె-10సీఈ జెట్‌లను ఉపయోగించింది. ‘‘క్షేత్రస్థాయి మద్దతుతో మరింత మెరుగ్గా పనిచేయాలనే తపన, తమ ఆయుధాల పూర్తి పోరాట సామర్థ్యాన్ని నిర్ధారించుకోవడమే లక్ష్యంగా తమ బృందాన్ని నడిపించిందని జాంగ్ హెంగ్ చెప్పారు.

పాకిస్థాన్ సైనిక పరికరాలలో అత్యధికంగా 81 శాతం చైనాకు చెందినవేనని, తన సైనిక సాంకేతికతలను పరీక్షించడానికి ఇస్లామాబాద్‌ను బీజింగ్ ఒక లైవ్ ల్యాబ్ లాగా వాడుకుంటోందని గతేడాది జులైలో భారత సైన్యం పేర్కొంది.  స్టాక్‌హోమ్ ఇంటర్నేషనల్ పీస్ రిసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ (సిప్రి) ప్రకారం 2015 నుంచి చైనా పాకిస్థాన్‌కు 8.2 బిలియన్ డాలర్ల విలువైన ఆయుధాలను విక్రయించింది. 2020- 2024 మధ్య ప్రపంచంలో నాల్గో అతిపెద్ద ఆయుధ ఎగుమతిదారుగా చైనా నిలిచింది. ఈ ఎగుమతులలో దాదాపు మూడింట రెండొంతులు లేదా 63 శాతం పాకిస్థాన్‌కే ఎగుమతి అయ్యాయి. దీంతో చైనాకు పాక్ అతిపెద్ద ఆయుధ వినియోగదారుగా మారింది.