సువేందు అధికారి వ్యక్తిగత సహాయకుడు చంద్రనాథ్ రథ్ హత్యకు సంబంధించిన దర్యాప్తును సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సిబిఐ)కి అప్పగించారు. పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం చేసిన సిఫార్సు మేరకు, ఈ దర్యాప్తును పశ్చిమ బెంగాల్ పోలీసుల నుండి సిబిఐకి బదిలీ చేశారు. సిబిఐ తెలిపిన వివరాల ప్రకారం, ఈ కేసును విచారించేందుకు డిఐజి హోదా కలిగిన అధికారి పంకజ్ కుమార్ సింగ్, నేతృత్వంలో ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) ఏర్పాటు చేశారు.
మరోవంక, టిఎంసికి చెందిన మాజీ మంత్రి సుజిత్ బోస్‌ను ఈడీ అరెస్ట్ చేసింది. పురపాలక నియామకాల కుంభకోణం కేసులో భాగంగా కోల్‌కతాలో సోమవారం రాత్రి ఆయనను అరెస్ట్ చేసినట్లు అధికారులు వెల్లడించారు. సౌత్ దమ్‌దమ్ మున్సిపాలిటీలో డబ్బులు తీసుకుని దాదాపు 150 మందికి అక్రమంగా ఉద్యోగాలు ఇప్పించారన్నది సుజిత్ బోస్‌పై ఉన్న ప్రధాన ఆరోపణ. ఉద్యోగాల కోసం తీసుకున్న డబ్బుకు బదులుగా ఆయన ఫ్లాట్లు, భారీ నగదు రూపంలో అక్రమ ఆస్తులు కూడబెట్టినట్లు ఆధారాలు లభించాయని ఈడీ అధికారులు తెలిపారు. సోమవారం ఉదయం తన కుమారుడితో కలిసి విచారణకు హాజరైన సుజిత్ బోస్‌ను విచారణకు పూర్తిగా సహకరించకపోవడం, పొంతనలేని సమాధానాలు ఇవ్వడం వల్లే అరెస్ట్ చేసినట్లు ఈడీ ప్రకటించింది.
మరోవంక, టీఎంసీ సెకండ్ ఇన్ కమాండ్, ఎంపీ అభిషేక్ బెనర్జీకి గత దశాబ్ద కాలంగా అందుతున్న ‘జెడ్-ప్లస్’ కేటగిరీ భద్రతను ప్రభుత్వం పూర్తిగా తొలగిస్తూ సోమవారం అధికారిక ఉత్తర్వులు వెలువడ్డాయి. ఆయన రక్షణ కోసం కేటాయించిన భారీ భద్రతా బృందాన్ని వెనక్కి పిలిచారు. కాన్వాయ్‌లో ముందుండే ప్రత్యేక పైలట్ వాహన సదుపాయాన్ని రద్దు చేశారు. గత 10 ఏళ్లుగా అనుభవిస్తున్న అత్యున్నత స్థాయి భద్రతా ప్రోటోకాల్ ఇకపై వర్తించదు.
”నిజమైన ప్రాణహాని లేనప్పుడు రాజకీయ నాయకులకు అనవసరమైన భద్రతా ఏర్పాట్లు చేయాల్సిన అవసరం లేదు. కేవలం హోదా ప్రదర్శన కోసం ప్రభుత్వ ఖజానాపై భారం వేయడం సమంజసం కాదు” అని ముఖ్యమంత్రి ఓ సమీక్షా సమావేశంలో స్పష్టం చేశారు.

More Stories
పాక్ కు మద్దతుపై చైనాకు భారత్ చురకలు
సనాతన ధర్మంపై ఉదయనిధి వ్యాఖ్యలపై బిజెపి మండిపాటు
ప్రధానిని `దేశ ద్రోహి’ అన్నారని ఎస్పీ ఎంపీపై కేసు!