కాంగ్రెస్ అంటేనే అవినీతికి పర్యాయపదంగా మారిపోయింది. కర్ణాటకలో ఆరు నెలల క్రితమే అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్రమైన అవినీతి ఆరోపణలను ఆ పార్టీ వారే చేస్తున్నారు. ఇప్పుడు అక్కడ వైఎస్టీ జోరుగా వసూలు చేస్తున్నట్టు ఆరోపణలు చెలరేగుతున్నాయి. వైఎస్టీ అంటే యతీంద్ర సిద్ధరామయ్య ట్యాక్స్.
అధికారాన్ని అడ్డం పెట్టుకొని తండ్రి, ముఖ్యమంత్రి సిద్దరామయ్య ఒకవైపు, కొడుకు యతీంద్ర ఇంకోవైపు వసూళ్లకు తెగబడ్డారని ప్రతిపక్షాలు దుమ్మెత్తిపోస్తున్నాయి. అధికారుల బదిలీ నుంచి కాంట్రాక్టర్ల వద్ద కమీషన్ల వరకు ఎక్కడా వదలకుండా వసూళ్ల పర్వం కొనసాగుతున్నదని సమాచారం.
తండ్రీ కొడుకుల దోపిడీ ఇలా ఉంటే మరోవంక ఉపముఖ్యమంత్రి డీకే శివకుమార్ తానే ప్రభుత్వం అన్నట్లు తనవంతుగా శక్తివంచన లేకుండా దోచుకొంటున్నారని ఆ రాష్ట్ర కాంట్రాక్టర్లే దుమ్మెత్తిపోస్తున్నారు. ప్రతి కాంట్రాక్టులోనూ డీకేఎస్ ఏకంగా 50 శాతం కమీషన్ వసూలు చేస్తున్నట్టు ఆరోపణలు గుప్పుమన్నాయి.
కర్ణాటకలో పేరుకు ముఖ్యమంత్రి సిద్దరామయ్య. కానీ రాజకీయ వ్యవహారాలు అన్ని డీకే శివకుమార్ చూస్తుంటారు. ఎప్పుడు ముఖ్యమంత్రి కుర్చీ తన సొంతం అవుతుందా అని ఎదురు చూస్తుంటారు. మరోవంక, ప్రభుత్వంలో ఏ వ్యవహారం జరగాలన్నా ముఖ్యమంత్రి కుమారుడు యతీంద్ర చూడాల్సిందే.
యతీంద్రకు పార్టీలో గాని, ప్రభుత్వంలో గాని ఎటువంటి హోదా లేదు. ఎప్పుడు ఏ స్థాయిలో కూడా ఓ ప్రజాప్రతినిధిగా పనిచేసిన అనుభవం లేదు. కానీ తానే అసలు ముఖ్యమంత్రి అన్నట్లు వ్యవహరిస్తున్నాడు. కర్ణాటక ప్రభుత్వంలో చిన్న ఫైల్ కదలాలన్నా యతీంద్ర అనుమతి కావాలట.
ఏ అధికారి ఎక్కడికి, ఎప్పుడు బదిలీ కావాలి? ఎవరికి ఏ పదవి ఇవ్వాలి? అనేవి మొత్తం ఈయనే డిసైడ్ చేస్తాడట. ఒకరకంగా యతీంద్ర షాడో సీఎం అని జోరుగా ప్రచారం జరుగుతున్నది. దాన్ని నిజం చేస్తూ బహిరంగంగానే యతీంద్ర ఏకంగా తన తండ్రికె ఆదేశాలిస్తున్న వీడియో ఒకటి బైటపడి ఇప్పుడు ఆ రాష్ట్రంలో కలకలం రేపుతోంది.
తాను చెప్పిన అధికారులను మాత్రమే బదిలీచేయాలని సీఎం సిద్ధరామయ్యకు యతీంద్ర ఫోన్ చేసి చెప్పడం చూస్తుంటే అక్కడ అసలు అధికారం ఎవరి చేతులో ఉందొ, ఎంతగా అవినీతి వరద పారుతుందో అంటూ బీజేపీ, జేడీఎస్ దుమ్మెత్తిపోస్తున్నాయి.
యతీంద్ర ఇటీవల తన తండ్రికి ఫోన్‌చేశాడు: ‘హలో అప్ప (నాన్న).. వివేకానంద ఎక్కడి నుంచి వచ్చాడు? నేను ఆ పేరు ఇవ్వలేదు. ఫోన్ మహదేవకు ఇవ్వు.. నేను ఇచ్చింది ఐదు పేర్లే..(కొద్ది క్షణాల తర్వాత) మహదేవ.. నువ్వు వేరేది (లిస్టు) ఎందుకు ఇచ్చావు? అది నీకు ఎవరిచ్చారు? ఏది ఏమైనా నేనిచ్చిన నలుగురు ఐదుగురి పని మాత్రమే కావాలి.. అంతే!’ అని హుకుం జారీచేశారు. యతీంద్రతో మాట్లాడిన మహదేవ అనే వ్యక్తి సీఎం సిద్ధరామయ్యకు ఓఎస్డీగా పనిచేస్తున్నారు.
కర్ణాటకకు ఇప్పుడు ఎవరు ముఖ్యమంత్రి? అని జేడీఎస్ అధినేత, మాజీ సీఎం కుమారస్వామి ప్రశ్నించారు. యతీంద్ర వీడియో అంశాన్ని అంత తేలిగ్గా వదిలిపెట్టే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. ‘రాష్ర్టానికి సీఎం ఎవరు? సీఎం సిద్ధరామయ్య తన కుమారుడికి ఫోన్ చేసి తాను ఏం చేయాలో అడుగుతారా?’ అని ప్రశ్నించారు.
ఏ విధమైన అధికారం లేని యతీంద్ర సీఎంకు ఫోన్‌చేసి ఆదేశాలు జారీచేయటమేంటని బీజేపీ ధ్వజమెత్తింది. తనయుడి నిర్వాకం ప్రపంచం ముందు కనిపిస్తున్నా సీఎం సిద్ధరామయ్య మాత్రం తననుతాను సమర్థించుకొనేందుకు ప్రయత్నించారు. తన కుమారుడు ఫోన్ చేసింది కార్పొరేట్ సోషల్ రెస్పాన్స్‌బిలిటీ (సీఎస్‌ఆర్) గురించి మాట్లాడటానికేనని, అధికారుల బదిలీల గురించి కాదని చెప్పుకొచ్చారు.
మరోవంక, కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే కుమారుడు ప్రియాంక్ ఖర్గే నిర్వహిస్తున్న ఐటీ శాఖలో అయితే అవినీతికి అంతులేకుండా పోతుంది. ఐటీ శాఖ పరిధిలోని కర్ణాటక స్టేట్ ఎలక్ట్రానిక్స్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్(కేఈవోఎన్‌ఐసీఎస్)లో అవినీతి రాజ్యమేలుతున్నదని చిరువ్యాపారులు ఏకంగా ధర్నాలకు దిగారు.
రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడగానే సంగప్ప అనే ఐఏఎస్ అధికారిని ఏరికోరి తీసుకొచ్చి ఈ సంస్థకు మేనేజింగ్ డైరెక్టర్‌గా నియమించారు. ఆయన అప్పటికే అనేక అవినీతి ఆరోపణలతో సస్పెండ్ అయ్యాడు. అలాంటి వ్యక్తిని తీసుకొచ్చి ఎండీగా పెట్టడంతో కమీషన్ల దందా ఆకాశాన్ని తాకింది.
ఈ సంస్థ పరిధిలో పనిచేసే చిరు వ్యాపారులు సమర్పించే బిల్లుల మొత్తంలో 10-12 శాతం కమీషన్ ఇవ్వందే ఫైల్‌పై సంతకం పెట్టే ప్రసక్తే లేదని సంగప్ప తెగేసి చెప్తున్నాడని వ్యాపారులు కొద్ది రోజుల క్రితం ధర్నాకు దిగారు. తాను ఈ పోస్టు కొనుక్కొనేందుకు భారీ మొత్తంలో ముట్టజెప్పానని, మరి ఆ డబ్బును రాబట్టుకోవాలి కదా? అని అంటున్నారని కియానిక్స్ వెండార్స్ అసోసియేషన్ అధ్యక్షుడు వసంత్ బంగేరా ఆరోపించారు.
More Stories
రూ. 1 లక్ష కోట్లతో ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖా గుప్తా తొలి బడ్జెట్
నాపై సెటైర్లు వేయడానికి కమ్రా సుపారి తీసుకున్నట్లుంది
కెనడా ఎన్నికల్లో భారత్ జోక్యం చేసుకునే అవకాశం!