వాతావరణ మార్పు లక్ష్యాల్లో దారి తప్పుతున్న ప్రపంచం

గ్లోబల్‌ వార్మింగ్‌ను 1.5 డిగ్రీల సెల్సియస్‌కి పరిమితం చేసి, వినాశకరమైన వాతావరణ ప్రభావాలను నివారించాలన్న ఒప్పందాలు, నిబద్ధతల నుంచి ప్రపంచం పక్కకు మళ్ళుతోందని ఐక్యరాజ్య సమితి హెచ్చరించింది. తాజాగా కాలుష్య ఉద్గారాలను తగ్గిస్తామంటూ చేసిన ప్రతినల ప్రభావాన్ని తాజా అంచనాలు, సమీక్షలను బట్టి చూసినట్లైతే దశాబ్ద కాలంలో కేవలం స్వల్ప స్థాయిలోనే తగ్గినట్లు తెలుస్తోందని పేర్కొంది. 

అందరూ ఎంతగానో ఆశలు పెట్టుకున్న వాతావరణ చర్చలు మరికొద్ది వారాల్లో జరగబోతున్న నేపథ్యంలో ఐక్యరాజ్యసమితి వాతావరణ మార్పుల సంస్థ ఈ నివేదిక విడుదల చేసింది. కాలుష్య కారక వాయువులను తగ్గించడానికి అత్యవసర ప్రాతిపదికన చర్యలు చేపట్టడంలో ప్రపంచ దేశాలు విఫలమయ్యాయని పేర్కొంది. 

దాదాపు 200 దేశాలు ఇచ్చిన హామీలు, చేసిన ప్రతినలు చూసినట్లైతే 2030 కర్బన ఉద్గారాలు 2019 స్థాయి కన్నా కేవలం 2శాతమే తగ్గనున్నాయి. గ్లోబల్‌ వార్మింగ్‌ను 1.5 డిగ్రీలకు పరిమితం చేయాలన్న పారిస్‌ ఒప్పందం లక్ష్యానికి ఇది చాలా తక్కువని ఐక్యరాజ్య సమితికి చెందిన ఐపిసిసి వాతావరణ ప్యానెల్‌ పేర్కొంది.

 ‘ఒక డిగ్రీలో అతి స్వల్ప భాగం కూడా ఇక్కడ ఆలోచించాల్సిన అంశమే, కానీ మనందరమూ చాలా తీవ్రంగా దారి తప్పుతున్నాం. దాన్ని మార్చేందుకు కాప్‌ 28 మనకు గల అవకాశం’ అని ఐక్యరాజ్య సమితి క్లైమేట్‌ ఛేంజ్‌ చీఫ్‌ సైమన్‌ స్టీల్‌ వ్యాఖ్యానించారు.  పెరుగుతున్న వరదలు, వేడిగాలులు, తుపానులతో ప్రపంచం ఇప్పటికే ధ్వంసమవుతోందని, అందువల్ల ఈ నెలాఖరులో దుబాయి లో  జరిగే వాతావరణ చర్చల్లో స్పష్టమైన కీలక మలుపును సాధించాలని ఆయన కోరారు.