ఉగ్ర‌వాదంపై పోరుకు రిషీ సునాక్‌ మద్దతు


* ఉత్తర కొరియా ఆయుధాలు ప్రయోగించిన హమాస్!

పాల‌స్తీనా ఉగ్ర సంస్ధ హ‌మాస్ దాడులు, ఇజ్రాయెల్ ప్ర‌తిదాడుల‌తో అట్టుడుకుతున్న ఇజ్రాయెల్‌లో బ్రిట‌న్ ప్ర‌ధాని రిషీ సునాక్ గురువారం అడుగుపెట్టారు. హ‌మాస్‌తో యుద్ధం చేస్తున్న ఇజ్రాయెల్‌కు తాము పూర్తి బాస‌ట‌గా నిలుస్తామ‌ని ఈ సంద‌ర్భంగా రిషీ సునాక్ భ‌రోసా ఇచ్చారు. ఉగ్ర‌వాదమ‌నే దుష్ట‌శ‌క్తితో పోరాడుతున్న మీకు సంఘీభావం తెలుపుతున్నామ‌ని పేర్కొన్నారు.

ఇజ్రాయెల్‌లో యుద్ధ వాతావ‌ర‌ణం, హ‌మాస్ దాడుల గురించి ఇజ్రాయెల్ ప్ర‌ధాని బెంజ‌మిన్ నెతన్యాహు, అధ్య‌క్షుడు ఇసాక్ హెర్జోగ్‌తో రిషీ సునాక్ సంప్ర‌దింపులు జ‌రుపుతారు. కాగా, హమాస్‌ తీవ్రవాద దాడులను ఎదుర్కొంటున్న ఇజ్రాయెల్‌లో బుధవారం అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌  పర్యటించిన విషయం తెలిసిందే.

ఈ సందర్భంగా బైడెన్‌ ఇజ్రాయెల్‌ ప్రధాని నెతన్యాహు, అధ్యక్షుడితో సమావేశమయ్యారు. యుద్ధ పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. యుద్ధం నేపథ్యంలో తర్వాత చేపట్టాల్సిన చర్యలపైనా చర్చించినట్లు సంబంధిత వర్గాలు వెల్లడించాయి.

ఇలా ఉండగా, ఇజ్రాయెల్‌పై అక్టోబ‌ర్ 7న మెరుపు దాడుల‌కు దిగిన హ‌మాస్ ఫైట‌ర్లు ఉత్త‌ర కొరియా ఆయుధాల‌తో విరుచుకుపడ్డార‌నేందుకు ఆధారాలు ల‌భ్య‌మ‌య్యాయ‌ని చెబుతున్నారు. ఓ మిలిటెంట్ వీడియోతో పాటు ఇజ్రాయెల్ స్వాధీనం చేసుకున్న ఆయుధాలు ఇదే విష‌యం వెల్ల‌డించాయి. కాగా, తాము మిలిటెంట్ గ్రూప్ హ‌మాస్‌కు ఆయుధాలు విక్ర‌యించ‌లేద‌ని ఉత్త‌ర కొరియా చెబుతోంది.

యుద్ధక్షేత్రంలో వాడిన ఉత్త‌ర కొరియా ఆయుధాలకు సంబంధించిన‌ వీడియోను విశ్లేషించిన ఇద్ద‌రు నిపుణులు హ‌మాస్ ఎఫ్‌-7 రాకెట్ గ్ర‌నేడ్‌తో పాటు, షోల్డ‌ర్ ఫైర్డ్ వెప‌న్స్‌ను వాడిన‌ట్టు పేర్కొంటున్నారు. ఆంక్షలతో కొట్టుమిట్టాడుతున్న ఉత్తర కొరియా తన ఆయుధ కార్యక్రమాలకు నిధులు సమకూర్చే మార్గంగా అక్రమ ఆయుధాల రవాణా సాగిస్తోంద‌నేందుకు ఈ ఆధారాలు సంకేతాలు పంపుతున్నాయి.

అత్యంత వేగంగా రీలోడ్ చేసే వెసులుబాటు ఉండ‌టంతో రాకెట్ గ్ర‌నేడ్ లాంఛ‌ర్లు గొరిల్లా ద‌ళాల‌కు విలువైన ఆయుధాలుగా మారుతున్నాయి. ఎఫ్‌-7ను సిరియా, ఇరాక్, లెబ‌నాన్‌, గాజా స్ట్రిప్‌లో వాడుతున్నార‌ని క‌న్స‌ల్టెన్సీ ఆర్మామెంట్ రీసెర్చ్ స‌ర్వీసెస్ డైరెక్ట‌ర్‌గా ప‌నిచేసే ఆయుధ నిపుణులు ఎన్ఆర్ జెంజెన్ జోన్స్ చెప్పుకొచ్చారు.

కాగా, పాల‌స్తీనా పౌరుల స్వేచ్ఛా, స్వాతంత్ర్యానికి బాస‌టగా నిలిచిన అమెరికా ఉపాధ్య‌క్షురాలు క‌మ‌లా హ్యారిస్ పాల‌స్తీనియ‌న్ల హ‌క్కుల‌కు ఉగ్ర సంస్ధ హ‌మాస్ ప్రాతినిధ్యం వ‌హించ‌ద‌ని స్ప‌ష్టం చేశారు. ఇజ్రాయెలీలు, పాల‌స్తీనియ‌న్లు స‌మాన‌స్దాయిలో భద్ర‌త‌, శ్రేయ‌స్సు ఉండాల‌ని  ఆమె ఆకాంక్షించారు. గౌర‌వంతో స్వేచ్ఛ‌గా జీవ‌నం సాగించేందుకు పాల‌స్తీనా ప్ర‌జ‌ల హ‌క్కుకు తాను మ‌ద్ద‌తిస్తాన‌ని, వారి ఆకాంక్ష‌ల‌కు హ‌మాస్ అద్దం ప‌ట్ట‌ద‌ని ఆమె పేర్కొన్నారు.