హైదరాబాద్ లో ఆదివారం భారీ వర్షం

హైదరాబాద్ మహా నగరంలో ఆదివారం తెల్లవారుజామున భారీ వర్షం కురిసింది. అర్ధరాత్రి తర్వాత చినుకులతో మొదలై ఉదయం 6 గంటల నుంచి గంటన్నర పాటు దంచి కొట్టింది. దీంతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. అమీర్‌పేట, మైత్రీవనం, మయూర్‌ మార్గ్‌తో పాటు పలు ప్రాంతాల్లో ప్రధాన రహదారులపై భారీగా వరద నిలిచిపోవడంతో ఉదయం బయటకు వచ్చిన వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు.

పలు భవనాల్లో సెల్లార్లలోకి, నార్సింగ్‌ మున్సిపాలిటీ బాలాజీనగర్‌ కాలనీలో పలు ఇళ్లల్లోకి వరద నీరు చేరింది. మణికొండ మున్సిపాలిటీ పరిధిలోని పందెంవాగు ఉధృతంగా ప్రవహిస్తుండడంతో రాకపోకలు నిలిచిపోయాయి. తెల్లవారుజామున కురిసిన వర్షంతో వాతావరణం మారడంతో నగరవాసులు ఊపిరిపీల్చుకున్నారు. 
ఆదివారం సెలవురోజు కావడంతో ఉదయం వేళ ట్రాఫిక్‌ సమస్యలు తలెత్తలేదు. ఆరు నుంచి 7.30 వరకు కురిసిన భారీ వర్షంతో రహదారులు చెరువులను తలపించాయి. బోరబండలో అత్యధికంగా 8.8 సెం.మీ వర్షపాతం నమోదైంది. రోడ్లపై నిలిచిన నీటిని బయటకు పంపించేందుకు జీహెచ్‌ఎంసీ డీఆర్‌ఎఫ్‌ సిబ్బంది చర్యలు చేపట్టారు.సీజన్‌ ప్రారంభమైన తర్వాత జూన్‌లో రెండు సార్లు, జూలైలో నాలుగు సార్లు మాత్రమే గ్రేటర్‌లో భారీ వర్షాలు నమోదయ్యాయి. రెండు వారాలుగా రెండు, మూడు సార్లు తేలికపాటి జల్లులు మినహా ఎక్కడా భారీ వర్షాలు లేవు. దీంతో నగరంలో పొడి వాతావరణం ఏర్పడి వేడి పెరిగింది. 

బంగాళాఖాతంలో ఆదివారం ఏర్పడిన ఆవర్తన ప్రభావంతో వచ్చే 48 గంటల్లో అల్పపీడనం ఏర్పడే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ తెలిపింది. అల్పపీడన ప్రభావంతో వచ్చే మూడు రోజులపాటు పలు జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు వర్షాలు కురిసే సూచనలున్నాయని హైదాబాద్‌ వాతావరణశాఖ తెలిపింది.  మరో మూడు రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా మోస్తరు నుంచి అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశముంటుందని బేగంపేట వాతావరణశాఖ అధికారులు తెలిపారు.

ఇలా ఉండగా, ఈశాన్య బంగాళాఖాతం, ఉత్తర తమిళనాడు, ఉత్తర కర్ణాటకల్లో వేర్వేరుగా ఉపరితల ఆవర్తనాలు వ్యాపించడంతో తెలుగు రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తాయని ఐఎండి ప్రకటించింది. విదర్భ నుంచి దక్షిణ కర్ణాటక వరకు ఉపరితల ద్రోణి విస్తరించింది.  వీటి ప్రభావంతో కోస్తా, రాయల సీమల్లో పలుచోట్ల ఆదివారం వర్షాలు కురిశాయి. ఉత్తర కోస్తాలో అక్కడక్కడా భారీవర్షాలు పడ్డాయి. రానున్న రెండు రోజుల్లో కోస్తా, రాయలసీమల్లో అనేకచోట్ల వర్షాలు పడతాయని వాతావరణ శాఖ తెలిపింది.
 
ఈశాన్య బంగాళాఖాతం పరిసరాల్లో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. ఇది సముద్ర మట్టానికి 5.8 కి.మీ. ఎత్తువరకు విస్తరించి ఉంది. దీని ప్రభావంతో మంగళవారం వాయవ్య బంగాళాఖాతంలో పశ్చిమ మధ్య బంగాళాఖాతానికి ఆనుకుని అల్పపీడనం ఏర్పడుతుందని వాతావరణ శాఖ అంచనా వేసింది.