కార్మికుల కోసం సొరంగానికి నిట్టనిలువుగా డ్రిల్లింగ్‌

ఉత్తరాఖండ్‌ ఉత్తర్‌కాశీలో గత 15 రోజులుగా చిక్కుకుని ఉన్న 41 మంది కార్మికులను రక్షించడానికి ఆదివారం మరో ప్రయత్నానికి అధికారులు శ్రీకారం చుట్టారు. 86 మీటర్ల అడుగున ఉన్న కార్మికులను రక్షించడానికి కొండపై నిలువుగా డ్రిల్లింగ్‌ చేసే పనిని ప్రారంభించారు. 15 మీటర్లు డ్రిల్లింగ్‌ చేశామని, ఇప్పటివరకు ఎలాంటి అవాంతరాలు ఎదురు కాలేదని ఎన్‌హెచ్‌ఐడీసీఎల్‌ ఎండీ మహమూద్‌ అహ్మద్‌ తెలిపారు. 
 
ఈ నిట్టనిలువు డ్రిల్లింగ్‌కు ఎలాంటి ఇబ్బందులు ఎదురుకాకుంటే సుమారు వంద గంటల సమయంలో కార్మికులున్న ప్రదేశానికి చేరుకుంటామని చెప్పారు. కాగా, కొండకు సమాంతరంగా అమెరికాకు చెందిన ఆగర్‌ మిషన్‌ ద్వారా చేపట్టిన డ్రిల్లింగ్‌లో రెండు రోజుల క్రితం బ్లేడ్‌ ఇనుప రేకులలో ఇరుక్కుపోవడంతో ఆ బ్లేడ్‌లను వెలికితీయడానికి హైదరాబాద్‌ నుంచి రప్పించిన ప్లాస్మా లేజర్‌ కట్టర్‌ ఆదివారం అక్కడికి చేరుకుంది. 
 
దీంతో దాని సహాయంతో పనులు చేపట్టారు. ఇరుక్కుపోయిన షాఫ్ట్‌, ఆగర్‌ ఫిన్‌లను దీని సహాయంతో కట్‌ చేసి వెలికి తీస్తారు. ఈ ఆపరేషన్‌లో భారత సైన్యం రంగప్రవేశం చేసింది. సొరంగంలో ఇరుక్కు పోయిన అమెరికన్ ఆగర్ యంత్రం భాగాన్ని తొలగించే పనుల్లో సైన్యం నిమగ్నమైంది. ఇందుకోసం ఆర్మీ తమ పరికరాలను కొండపైకి తరలించారు.
 
800 ఎంఎం ఇనుప పైపును డ్రిల్లింగ్‌చేసి ఇన్‌సర్ట్ చేస్తున్న ఆగర్ మిషన్ బ్లేడ్లు శనివారం శిథిలాల్లో చిక్కుకున్నాయి. దీంతో బ్లేడ్లు పూర్తిగా ధ్వంసమయ్యాయి.ఫలితంగా సొరంగానికి కొండపైనుంచి తవ్వకాలు జరిపి బాధితులను చేరుకునే మార్గాన్ని ఏర్పాటు చేస్తున్నారు. సొరంగంలో చిక్కుకుపోయిన ఆగర్ యంత్రం భాగాన్ని తొలగించేందుకు హైదరాబాద్‌నుంచి ప్లాస్మా కట్టర్‌ను విమానంలో తీసుకువచ్చారు.
 
మొత్తం 47 మీటర్ల ఆగర్ యంత్రం భాగాన్ని తొలగించాల్సి ఉండగా, ఆదివారం రాత్రికి 8.15 మీటర్లు మాత్రమే మిగిలి ఉంది. సహాయ చర్యలలో డిఆర్డిఓ, సైనిక ఇంజినీర్లు కూడా పాల్గొంటున్నారు.  క్రిస్మస్ నాటికల్లా కార్మికులను బైటికి తీసుకు రాగలమన్న విశ్వాసాన్ని అంతర్జాతీయ టన్నెల్ డ్రిల్లింగ్ నిపుణుడు డిక్స్ వ్యక్తం చేశారు. 
అయితే ఈ నెల 26నుంచి 28 దాకా ఈ ప్రాంతంలో వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ విభాగం హెచ్చరించడం డ్రిల్లింగ్ నిర్వహిస్తున్న వారిలో ఆందోళన కలిగిస్తోంది. కానీ 29నుంచి వాతావరణం ప్రశాంతంగా ఉంటుందని చెప్పడం ఊరట కలిగించే అంశం.
కాగా గత 15 రోజులుగా సొరంగంలో చిక్కుపడిన కార్మికలుకు పైపు మార్గం ద్వారా ఆహారం, మందులు, ఇతర అత్యవసరాలను పంపిస్తున్నారు. అప్పుడప్పుడు వారితో కుటుంబ సభ్యులు, అధికారులు కూడా మాట్లాడుతూ, వారిని ఉల్లాసంగా ఉంచేందుకు ప్రయత్నిస్తున్నారు.