అద్భుత చరిత్ర సృష్టించిన కింగ్ కోహ్లీ

భారత స్టార్ బ్యాట్స్‌మెన్ విరాట్ కోహ్లీ అనన్య సామాన్యమైన ఘనత సాధించాడు.  వాంఖడే వేదికగా మరో అద్భుతం సాకారమైంది. 2011 ప్రపంచకప్‌ను టీమిండియా సగర్వంగా అందుకున్న చోటే క్రికెట్ చరిత్రలోనే ఎవరికీ సాధ్యం కాని రికార్డు కింగ్ కోహ్లి వశమైంది. వన్డే క్రికెట్‌ చరిత్రలోనే 50 సెంచరీలు చేసిన తొలి ప్లేయర్‍‌గా విరాట్ కోహ్లీ నూతన చరిత్ర సృష్టించాడు. 
 
న్యూజిలాండ్‌తో జరిగిన సెమీఫైనల్‌లో సూపర్ ఇన్నింగ్స్ ఆడిన విరాట్ కోహ్ సచిన్ రికార్డును అధిగమించాడు. ఇదే టోర్నీలో సౌతాఫ్రికాతో జరిగిన మ్యాచ్‌లో సెంచరీ కొట్టి సచిన్ అత్యధిక సెంచరీల రికార్డును సమం చేసిన కోహ్ల కివీస్‌తో జరిగిన కీలకపోరులో సెంచరీతో మెరిశాడు. ఎవరికీ సాధ్యం కాదనుకున్న క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ (49 వన్డే శతకాలు) వన్డే సెంచరీల రికార్డును కోహ్లీ బద్దలుకొట్టాడు. 
 
వన్డేల్లో 50 శతకాలు చేసిన తొలి బ్యాటర్‌గా రికార్డులకెక్కాడు కింగ్ కోహ్లీ. ముంబై వేదికగా బుధవారం న్యూజిలాండ్‍తో జరుగుతున్న వన్డే ప్రపంచకప్ 2023 సెమీఫైనల్‍లో విరాట్ కోహ్లీ ఈ అద్భుత ఘనత సాధించాడు.  క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ 452 వన్డే ఇన్నింగ్స్‌లో 49 సెంచరీలు చేస్తే, విరాట్ కోహ్లీ 279 ఇన్నింగ్స్‌లోనే 50 వన్డే శతకాలు పూర్తి చేసుకున్నాడు.

ఈ సెమీస్ మ్యాచ్‍లో 106 బంతుల్లో శతకానికి చేరుకున్నాడు విరాట్ కోహ్లీ. 50 వన్డే సెంచరీలు చేసిన తొలి ఆటగాడిగా రికార్డు సృష్టించాడు. సెంచరీకి చేరాక తన మార్క్ సంబరాలు చేసుకున్నాడు. గాల్లోకి సింహంలా జంప్ చేసి విజయనాదం చేశాడు.   కోహ్లీ రికార్డుతో వన్డేల్లో అత్యధిక సెంచరీలు కొట్టిన ఆటగాళ్ల జాబితాలో సచిన్ రెండవ స్థానంలో నిచాడు. రోహిత్ శర్మ(31), రికీ పాంటింగ్ (30), సనత్ జయసూర్య (28) వరుస స్థానాల్లో ఉన్నారు.

కాగా సచిన్ టెండూల్కర్ చూస్తుండగానే కోహ్లీ రికార్డు బద్ధలు కొట్టడం గమనార్హం. మైదానంలో ఉన్న సచిన్ నిలబడి మరీ చప్పట్లతో కోహ్లీని అభినందించాడు. ఇక కోహ్లీ కూడా సచిన్‌కి గౌరవంగా తలవంచి నమస్కరించాడు. కోహ్లీ సతీమణి అనుష్క శర్మ కూడా సంతోషాన్ని వ్యక్తం చేసింది. కాగా ఈ మ్యాచ్‌లో కోహ్లీ పలు రికార్డులు బద్ధలు కొట్టాడు. ఒక వరల్డ్ కప్‌లో అత్యధిక పరుగులు కొట్టిన ఆటగాళ్ల జాబితాలో సచిన్ రికార్డును కోహ్లీ చెరిపివేశాడు.

2003 వరల్డ్ కప్‌లో సచిన్ 673 పరుగులు కొట్టగా దానిని కోహ్లీ ఈ వరల్డ్ కప్‌లో అధిగమించాడు. పైగా, టీ20, ఐపీఎల్‌లోనూ అలాంటివే రెండు రికార్డులను తన పేరిట కోహ్లీ లిఖించుకున్నాడు. 2014 టీ20 వరల్డ్‌కప్‌లో 319 పరుగులు నమోదు చేసి ఈ ఫార్మాట్‌లో సింగిల్ ఎడిషన్‌లో అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్‌గా నిలిచాడు. ఇక ఐపీఎల్ విషయానికొస్తే 2016లో 16 మ్యాచ్‌ల్లో 973 పరుగులతో ఊచకోత కోశాడు.

న్యూజిలాండ్‌తో సెమీస్‌లో విరాట్ కోహ్లి రెండో బంతికే అవుటయ్యే ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. టిమ్ సౌథీ వేసిన బంతి కోహ్లి ప్యాడ్లకు తాకగా.. కివీస్ డీఆర్ఎస్ తీసుకుంది. అయితే రీప్లేలో బంతి తొలుత బ్యాట్‌కు తాకినట్లు స్పష్టమైంది. దీంతో సున్నాకే వెనుదిరిగే ప్రమాదం నుంచి బయటపడిన కోహ్లి.. ఆ తర్వాత సాధికారికంగా బ్యాటింగ్ చేశాడు.

ఈ మ్యాచ్‌కు ముందు వరకూ మూడు సెమీఫైనల్స్ ఆడిన కోహ్లి మూడు మ్యా్చ్‌లలోనూ సింగిల్ డిజిట్‌కే పరిమితమయ్యాడు. ఇవాళ్లి మ్యాచ్‌లో సెంచరీ కొట్టిన కోహ్లి.. ప్రపంచకప్ నాకౌట్ మ్యాచ్‌లలో ఆడలేననే విమర్శలకు చెక్ పెట్టాడు.ఈ మ్యాచ్‌లో 113 బాల్స్ ఆడిన కోహ్లి 9 ఫోర్లు, 2 సిక్సర్ల సాయంతో 117 పరుగుల చేసి పెవిలియన్ చేరాడు.