తమిళనాడు సముద్రతీర జిల్లాల్లో భారీగా వర్షం

ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పవాయుపీడనం కారణంగా తమిళనాడు సముద్రతీర జిల్లాల్లో భారీగా వర్షం కురిసింది. చెన్నైలోనూ మంగళవారం సాయంత్రం వరకు కురిసిన వర్షంతో చెన్నై నగరం తడిసి ముద్దయింది. పలు లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. దీంతో స్వస్థలాలకు వెళ్లి నగరానికి తిరిగొచ్చిన ప్రయాణికులు, వ్యాపారులు, ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. 

ఈశాన్య రుతపవనాలు చురుగ్గా ఉండడంతో పాటూ బంగాళాఖాతంలో అల్పపీడనం వాయుగుండంగా మారే అవకాశముందని స్థానిక వాతావరణ పరిశోధన కేంద్రం అధికారులు ప్రకటించారు. అంతేగాక రాష్ట్రానికి ఆరెంజ్‌ అలెర్ట్‌ ప్రకటించారు. చెన్నై సహా ఉత్తరాది జిల్లాల్లో రాబోవు మూడు రోజుల్లో పలు ప్రాంతాల్లో కుండపోతగా, మరికొన్ని ప్రాంతాల్లో భారీగా వర్షాలు కురుస్తాయని హెచ్చరించారు జాలర్లు చేపలవేటకు వెళ్లొద్దని సూచించారు. 

కాగా ఈనెల 15న బుధవారం చెన్నై జిల్లాలోని పాఠశాలలకు సెలవు ప్రకటించారు. రాష్ట్రంలో ఈశాన్య రుతువపనాల వల్ల, బంగాళాఖాతంలో ఏర్పడే వాయుగుండాల వల్ల రాష్ట్రంలో యేడాది మొత్తం కురిసే వర్షంలో యాభైశాతం వర్షాలు కురుస్తాయి. ఈ యేడాది ఈశాన్య రుతుపవనాలు గత అక్టోబరు 21న ప్రారంభమయ్యాయి. 

తొలి రెండు వారాల్లో ఆశించినంతగా వర్షాలు కురవలేదు. దక్షిణాది జిల్లాల్లో మాత్రం చెదురుముదురు వర్షాలు కురిశాయి. ప్రత్యేకించి కన్నియాకుమారి జిల్లాలో భారీ వర్షం కురిసింది. అటుపిమ్మట బంగాళాఖాతంపై ఏర్పడిన ఉపరితల ఆవర్తనం, పెనుగాలుల కారణంగా ఓ మోస్తరుగా వర్షాలు కురిశాయి. 

ఈ నేపథ్యంలో మంగళవారం ఉదయం ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పవాయుపీడనం ఏర్పడింది. ఈ అల్పపీడనం పడమటిదిశగా ఈశాన్య దిశగా కదులుతూ గురువారం ఉదయం వాయుగుండంగా మారుతుందని వాతావరణ పరిశోధన కేంద్రం అధికారులు ప్రకటించారు. ఈ వాయుగుండం ఒడిశా వైపు తీరం దాటే అవకాశాలు ఉండటం వల్ల రాష్ట్రంలో చెన్నై సహా ఉత్తరాది జిల్లాల్లో భారీగా వర్షాలు కురుస్తాయని తెలిపారు.

ఇదిలావుండగా మంగళవారం నాగపట్టినం జిల్లాలో భారీ వర్షం కురిసింది. రంగంలోకి దిగిన అధికారులు.. ఆయా ప్రాంతాలకు చెందిన ప్రజల్ని సురక్షిత ప్రాంతాలకు తరలించారు.  భారీ వర్షాలు కురిసే అవకాశముండడంతో ముందస్తు జాగ్రత్త చర్యలు చేపట్టాలని రాష్ట్ర రెవెన్యూ విభాగం 27 జిల్లాల కలెక్టర్లకు ఉత్తర్వులు జారీ చేసింది. రెవెన్యూ శాఖ ప్రధానాధికారి ఎస్‌కే ప్రభాకర్‌ ఈ మేరకు ఆదేశాలు జారీ చేశారు.

వర్ష బాధితులను ఆదుకునేందుకు సముద్రతీర జిల్లాల్లో 4917 సహాయక శిబిరాలను సిద్ధం చేశామని, 121 తుఫాను షెల్టర్లను ఏర్పాటు చేస్తున్నామని రాష్ట్ర రెవెన్యూ, విపత్తుల నిర్వహణ శాఖల మంత్రి కేకేఎస్‌ఎస్‌ఆర్‌ రామచంద్రన్‌ తెలిపారు. భారీగా వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ చేసిన హెచ్చరికతో ప్రభుత్వ యంత్రంగా ముందస్తు జాగ్రత్త చర్యలను ఇప్పటికే ప్రారంభించిందని చెప్పారు. 

27 జిల్లాలకు చెందిన కలెక్టర్లకు ప్రాణ నష్టం జరగకుండా ముందస్తు జాగ్రత్త చర్యలు చేపట్టమని తగిన ఆదేశాలిచ్చామని తెలిపారు. జిల్లా కలెక్టర్లు ఆయా రెవెన్యూ డివిజన్లలోని జలాశయాలు, చెరువులు, వాగులు, వంకలను ఎప్పటికప్పుడు పరిశీలించాలని, వరద పరిస్థితులు ఏర్పడే అవకాశాలుంటే ప్రజలను తక్షణమే సురక్షిత ప్రాంతాలకు తరలించి, సహాయక శిబిరాల్లో బస కల్పించాలని ఉత్తర్వు జారీ చేసినట్లు చెప్పారు.

మెరీనా బీచ్‌ ఎళిలగమ్‌ భవన సముదాయంలోని వర్ష, వరద బాధితుల సహాయం కోసం రెవెన్యూ, విపత్తు నివారణ, నిర్వహణ శాఖల ఆధ్వర్యంలో ఏర్పాటైన కంట్రోల్‌ రూంను మంగళవారం సాయంత్రం సీఎం స్టాలిన్‌ పరిశీలించారు. వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా 21 జిల్లాలకు చెందిన కలెక్టర్లతో ఆయన మాట్లాడారు. వర్షపాతం, బాధిత ప్రాంతాలు, చేపడుతున్న సహాయక చర్యలపై సీఎం ఆరా తీశారు. అనంతరం తాగునీటి, విద్యుత్‌ శాఖల ఉన్నతాధికారులతో సమీక్షించారు.