
ఉత్తరాఖండ్‌లోని ఉత్తరకాశీలో నిర్మాణం దశలో ఉన్న ఓ టెన్నెల్ అనూహ్యంగా కూలిపోయి టెన్నెల్ లోపల దాదాపు 36 మంది కార్మికులు చిక్కుకున్నట్టు తెలుస్తోంది. ఛార్ ధామ్ రోడ్డు ప్రాజెక్ట్‌లో భాగంగా గత కొంతకాలంగా ఈ టన్నెల్‌ను నిర్మిస్తున్నారు. ఉత్తరకాశీలోని సిల్యారా- దండోల్గావ్ను ఈ టన్నెల్ కనెక్ట్ చేస్తుంది.
ఈ మొత్తం ప్రాజెక్ట్ అందుబాటులోకి వస్తే ఉత్తరకాశి నుంచి యమునోత్రి దూరం 26 కి.మీలు తగ్గుతుంది. కాగా ఆదివారం తెల్లవారుజామున 4 గంటల సమయంలో సిల్క్యారాలో నిర్మాణం దశలో ఉన్న టన్నెల్ కూలింది. ఘటనపై సమాచారం అందుకున్న వెంటనే ఘటనాస్థలానికి పరుగులు తీశారు అధికారులు. సహాయక చర్యలను ముమ్మరం చేశారు.
“సిల్క్యారా టన్నెల్ స్టార్టింగ్ పాయింట్‌కు 200 మీటర్ల దూరంలో ఘటన చోటుచేసుకుంది. హెచ్ఐడీసీఎల్ ఈ టన్నెల్‌ని నిర్మిస్తోంది. సంస్థ ప్రకారం లోపల దాదాపు 36మంది చిక్కుకున్నారు” అని ఉత్తరకాశి ఎస్పీ యాదువన్షి తెలిపారు. పోలీసులు, ఎన్‌డీఆర్ఎఫ్- ఎస్‌డీఆర్‌ఎఫ్ బృందాలు ఘటనాస్థలంలో సహాయక చర్యలు చేపట్టాయని, లోపల చిక్కుకున్న వారిని సురక్షితంగా బయటకు తీసుకొస్తామని ఆయన చెప్పారు.
తాజా ఘటనపై ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ సింగ్ ధామి స్పందిస్తూ “టన్నెల్ కూలిన ఘటన విషయం నాకు తెలిసింది. అధికారులతో మాట్లాడాను. లోపల చిక్కుకున్న వారిని, సురక్షితంగా బయటకు తీసుకొస్తామని అధికారులు చెప్పారు,” అని తెలిపారు. ఎన్‌డీఆర్ఎఫ్, ఎస్‌డీఆర్‌ఎఫ్ సహాయక చర్యలు చేపట్టాయని, ప్రతి ఒక్కరూ సురక్షితంగా బయటపడాలని భగవంతుని ప్రార్థిస్తున్నామని చెప్పారు.
More Stories
భద్రతా దళాల కాల్పుల్లో ముగ్గురు మావోయిస్టులు మృతి
దేశంలో ర్యాగింగ్ మరణాల సంఖ్య 2020- 2024లో 51
ఈ నెల 29న సూర్యగ్రహణం