పాక్ జైలు నుంచి విడుదలైన 80 మంది భారతీయ మత్స్యకారులు

భారత్‌కు చెందిన 80 మంది మత్స్యకారులు పాకిస్థాన్ జైలు నుంచి విడుదలయ్యారు. దీపావళి రోజున వారి కుటుంబాలను కలుసుకున్నారు. గుజరాత్‌కు చెందిన 80 మంది మత్స్యకారులను కరాచీలోని జైలు నుంచి గురువారం విడుదల చేశారు. 

మరునాడు పంజాబ్‌లోని అట్టారీ-వాఘా సరిహద్దులో భారత్‌ అధికారులకు వారిని అప్పగించారు. అనంతరం వారంతా రైలులో ప్రయాణించి గుజరాత్‌లోని వడోదరకు ఆదివారం చేరుకున్నారు. అక్కడి నుంచి బస్సులో తమ సొంతూర్లకు వెళ్లారు. మూడేళ్లుగా పాక్‌ జైలులో ఉన్న వీరు దీపావళి పండుగ రోజున తమ కుటుంబాలను కలుసుకున్నారు.

కాగా, 2020లో గుజరాత్‌లోని సముద్ర తీరంలో చేపల వేటకు వెళ్లిన వందలాది మత్స్యకారులను పాకిస్థాన్‌కు చెందిన మెరైన్‌ దళాలు పట్టుకున్నాయి. సుమారు మూడేళ్లుగా కరాచీలోని జైళ్లలో ఉంచారు. ఇందులో 80 మందిని విడుదల చేశారు. 

వీరిలో 59 మంది గుజరాత్‌లోని గిర్ సోమనాథ్ జిల్లాకు చెందిన వారు. 15 మంది ద్వారక, ఇద్దరు జామ్‌నగర్‌, ఒకరు అమ్రేలీ నివాసితులు. మరో ముగ్గురు కేంద్ర పాలిత ప్రాంతమైన డయ్యూకు చెందినవారని అధికారులు తెలిపారు. ఇంకా సుమారు 200 మంది భారత మత్స్యకారులు పాకిస్థాన్‌ జైళ్లల్లో మగ్గుతున్నట్లు వెల్లడించారు.