ఢిల్లీలో మరింత తీవ్రంగా వాయు కలుష్యం

ఢిల్లీ వాయు కాలుష్యం మరింత తీవ్రమైంది. దీపావళి పండుగ సందర్భంగా ఢిల్లీ వాసులు పోటీపడి పటాకులు కాల్చడంతో పాటు నగరంలో వాహనాల రద్దీ పెరగడం, పంజాబ్‌లో పంట వ్యర్థాల కాల్చివేత కారణంగా ఢిల్లీలో గత కొన్ని రోజులుగా వాతావరణం కాలుష్యం పెరుగుతూ వస్తున్నది. 

ఈ నేపథ్యంలో దీపావళి పండుగనాడు పటాకులు కాలిస్తే కాలుష్యం మరింత తీవ్రమవుతుందనే ఉద్దేశంతో సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీచేసింది. పండుగరోజు ఢిల్లీ నగరంలో పటాకులు కాల్చడంపై నిషేధం విధించింది. అయితే, సుప్రీంకోర్టు నిషేధాజ్ఞలను ఢిల్లీ వాసులు భేఖాతర్‌ చేశారు. దీపావళి రోజు రాత్రి యథేచ్ఛగా పోటీపడి పటాకులు కాల్చారు.

 దాంతో సోమవారం ఉదయం ఢిల్లీ, నోయిడా, గురుగ్రామ్, చుట్టు పక్కల ప్రాంతాల్లో ఎయిర్ పొల్యూషన్ ప్రమాదకర స్థాయికి చేరుకుంది. నగరంలో ఎయిర్‌ క్వాలిటీ ఇండెక్స్‌ (ఏక్యూఐ) సగటు 286కు చేరింది. ఢిల్లీ యూనివర్సిటీ, ఐఐటీ ఢిల్లీ, ఎయిర్‌పోర్టు ప్రాంతాల్లో ఏక్యూఐ 300 దాటింది. ఇతర ప్రాంతాల్లో కొంత తక్కువగా ఉన్నది. 50 మీటర్ల దూరం కూడా కనిపించక వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.

ఆదివారం రాత్రి పటాకులు కాల్చడంతో సోమవారం ఉదయం ఢిల్లీలోని పలు ప్రాంతాలపై దట్టమైన విషపూరిత పొగమంచు కమ్మింది. పండుగరోజైన ఆదివారం ఉదయం 202గా ఉన్న ఢిల్లీ యావరేజ్‌ ఏక్యూఐ, సోమవారం ఉదయం 286కు పెరిగింది. రహదారులపై కమ్ముకున్న దుమ్ముధూళి కారణంగా విజుబిలీటీ బాగా తగ్గిపోయింది. 50 మీటర్ల దూరం కూడా కనిపించక వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.