ఢిల్లీ చుట్టూ పంట వ్యర్థాల దహనాన్ని వెంటనే ఆపండి

కాలుష్యానికి ప్రధాన కారణంగా ఉన్న పంట వ్యర్థాల దహనాన్ని వెంటనే ఆపాలని ఢిల్లీ పొరుగు రాష్ర్టాలైన పంజాబ్‌, హర్యానా, ఉత్తరప్రదేశ్‌, రాజస్థాన్‌ ప్రభుత్వాలను జస్టిస్‌ ఎస్కే కౌల్‌, జస్టిస్‌ సుధాంశ్‌ ధులియాతో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం ఆదేశించింది. ‘వెంటనే ఇది ఆగాలి. అందుకు మీరు ఏం చేస్తారో మాకు తెలియదు. పంట వ్యర్థాల దహనాన్ని ఆపడం మీ విధి’ అని పేర్కొన్నది.
 
దేశ రాజధాని ఢిల్లీ-ఎన్సీఆర్‌ పరిధిలో రోజురోజుకు పెరిగిపోతున్న వాయు కాలుష్యంపై సుప్రీంకోర్టు మంగళవారం తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. క్షీణిస్తున్న గాలి నాణ్యత ప్రజల ఆరోగ్యాన్ని ఖూనీ చేస్తున్నదని ఆవేదన వ్యక్తం చేసింది. కాలుష్యంపై ప్రభుత్వాలు ఒకరిపై ఒకరు నిందలు వేసుకోవడంపై తీవ్ర అసహనం వ్యక్తం చేసిన సర్వోన్నత న్యాయస్థానం అన్ని సమయాల్లో రాజకీయ యుద్ధం ఉండకూదని సూచించింది.
 
‘ఈ పంట వ్యర్థాల దహనం ఆగడం లేదు. దీన్ని ఆపేందుకు రాష్ట్ర ప్రభుత్వాలు ఏం చర్యలు తీసుకొన్నాయి’ అని ప్రశ్నించింది. కాలుష్యం కారణంగా ప్రజలు చనిపోనివ్వకూడదని అభిప్రాయపడింది. ఏండ్లుగా కాలుష్య సమస్య ఉన్నప్పటికీ, ఇప్పటి వరకు పరిష్కారాన్ని గుర్తించలేదని ప్రభుత్వాల తీరుపై అసహనం వ్యక్తం చేసింది. 
 
విచారణ సందర్భంగా ఢిల్లీ ప్రభుత్వానికి కూడా సుప్రీంకోర్టు పలు కీలకమైన సూచనలు చేసింది. మున్సిపాలిటీ పరిధిలో ఘన వ్యర్ధాలను బహిరంగంగా తగులబెట్టడాన్ని నియంత్రించాలని సూచించింది. కాగా ఢిల్లీలో కాలుష్యాన్ని అరికట్టేందుకు, భారీగా కలుషితమైన ప్రాంతాల్లో డస్ట్ సప్రెసెంట్ పౌడర్‌తో కూడిన నీటిని విస్తృతంగా స్ప్రే చేస్తున్నారు. 
 
నిర్మాణాలు, పలు కూల్చివేతలపై నిషేధాన్ని విధించారు. వీటిని పకడ్బందీగా అమలు చేయడానికి ఢిల్లీ పౌర సంఘం 1,100 కంటే ఎక్కువ మంది అధికారులతో కూడిన 517 నిఘా బృందాలను ఏర్పాటుచేసింది. అలాగే కాలుష్య స్థాయిలను అరికట్టడానికి, చర్యలను అమలు చేయడానికి పౌర సంఘం ప్రతి 12 జోన్‌లకు రూ.20 లక్షలు కేటాయించినట్లు ఢిల్లీ మేయర్ షెల్లీ ఒబెరాయ్ తెలిపారు.
 
ఇలా ఉండగా, పంట వ్యర్థాల దహనం ఒక్కటే ఢిల్లీలో ఈ ఏడాది కాలుష్య పెరుగుదలకు కారణం కాదని తాజా నివేదిక పేర్కొన్నది. స్థానికంగా వాహనాల నుంచి వెలువడే ఉద్గారాలు వంటి స్థానిక అంశాలు ఇప్పటికే ఢిల్లీ గాలిని విషపూరితం చేశాయని సెంటర్‌ ఫర్‌ సైన్స్‌ అండ్‌ ఎన్విరాన్‌మెంట్‌ (సీఎస్‌ఈ) తెలిపింది. 
ఈ ఏడాది పంట వ్యర్థాల దహనం గతం కంటే తగ్గిందని, ఢిల్లీ పీఎం 2.5 స్థాయిల్లో ఇది దాదాపు 25 శాతంగా మాత్రమే ఉన్నదని సీఎస్‌ఈ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ అనుమిత రాయ్‌ పేర్కొన్నారు.
కాలుష్యానికి తోడు పెద్ద ఎత్తున పొగమంచు నగరాన్ని కమ్మేస్తున్నది. దీంతో జనం తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ఢిల్లీలోని పలు నగరాల్లో గాలి నాణ్యత భారీగా పడిపోయింది. పంజాబీ బాగ్‌లో గాలి నాణ్యత సూచీ 460కి చేరింది. ఆనంద్‌ విహార్‌లో 452, ఆర్‌కేపురంలో 433గా నమోదైందని సెంట్రల్‌ పొల్యూషన్‌ కంట్రోల్‌ బోర్డ్‌ పేర్కొంది.  ఢిల్లీ అంతట గాలి నాణ్యత అధ్వానంగా కొనసాగుతుందని పేర్కొంది. 
 
నోయిడా, ఘజియాబాద్, గురుగ్రామ్, ఫరీదాబాద్‌లలో కూడా బుధవారం ఉదయం 6 గంటల సమయంలో గాలీ నాణ్యత తీవ్రంగా క్షీణించింది. గత రాత్రి 10 గంటల సమయంలో ఢిల్లీలోని ఆనంద్ విహార్‌లో గాలి నాణ్యత సూచిక ఏకంగా 999ని తాకడం తీవ్ర ఆందోళనను కల్గిస్తోంది. దీపావళికి ముందే పరిస్థితి ఈ స్థాయిలో ఉంటే తర్వాత మరింత దారుణంగా తయారయ్యే అవకాశాలున్నాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. కాలుష్యం నేపథ్యంలో ఢిల్లీతో పాటు నేషనల్‌ క్యాపిటల్‌ రీజియన్‌ పరిధిలోని గౌతమ్‌బుద్ధానగర్‌, ఘజియాబాద్‌లో ఉన్నత పాఠశాలలను మూసివేశారు. రాబోయే ఆరు రోజుల పాటు ఢిల్లీలో వాతావరణం మరింత అధ్వాన్నస్థాయికి చేరుకుంటుందని అంచనా. ఉష్ణోగ్రతలు పడిపోయే అవకాశం ఉందని, దాంతో కాలుష్యం స్థాయి మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. 

అయితే, నవంబర్‌ 10న ఢిల్లీలో తేలికపాటి వర్షం కురిసే అవకాశం ఉందని ప్రాంతీయ వాతావరణ కేంద్రం పేర్కొంది. 13వ తేదీ వరకు ఉదయం వేళల్లో పొగమంచు పేరుకుపోతుందని పేర్కొంది.