బిజెపి ఎంఎల్‌ఎ ఈటల రాజేందర్ గజ్వేల్‌కు రావడంతో సిఎం కెసిఆర్‌కు నిద్ర పట్టడంలేదని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి జి. కిషన్ రెడ్డి ఎద్దేవా చేశారు. ఈటల రాజేందర్ గజ్వేల్ నామినేషన్ వేసిన సందర్భంగా మంగళవారం గజ్వేల్ లో జరిగిన భారీ ర్యాలీని ఉద్దేశించి ప్రసంగిస్తూ గజ్వేల్‌లో గెలుస్తాననే నమ్మకం కెసిఆర్‌కు లేదని, గజ్వేల్‌లో ఓటమి భయంతో కెసిఆర్ కామారెడ్డిలోనూ పోటీ చేస్తున్నారని స్పష్టం చేశారు.
గజ్వేల్ ఆర్డీఓ కార్యాలయంలో ఈటల రాజేందర్ నామినేషన్ దాఖలు అనంతరం కిషన్ రెడ్డి మాట్లాడుతూ కెసిఆర్ కుటుంబం చేతిలో తెలంగాణ బందీగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజలను కెసిఆర్ తన బానిసలుగా మార్చుకున్నారని దుయ్యబట్టారు. బిజెపి అధికారంలోకి రాగానే తెలంగాణాలో బిసి నేతను ముఖ్యమంత్రిగా చేస్తామని కిషన్ రెడ్డి ప్రకటించారు.
స్వరాష్ట్రంలో ప్రజలను కేసీఆర్ బానిసలుగా మార్చారని కేంద్ర మంత్రి మండిపడ్డారు. బీఆర్ఎస్ కు ఓటేస్తే కేసీఆర్ కుటుంబానికి వేసినట్లేనని హెచ్చరించారు. భారతీయ జనతా పార్టీకి వేస్తే భవిష్యత్ తరాల అభివృద్ధికి ఓటేసినట్లవుతుందని స్పష్టం చేశారు. డబ్బుతో గజ్వేల్ ప్రజల ఓట్లను కొనుగోలు చేయాలని కేసీఆర్ చూస్తున్నారని ఆరోపించారు.
గజ్వేల్‌లో 30 వేల కుటుంబాల భూములను లాక్కున్న కర్కోటకుడు కేసీఆర్ అని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో మాఫియా విలయతాండవం చేస్తోందని చెబుతూ రాష్ట్ర ప్రజలు మార్పు కోరుకుంటున్నారని, దీనికి నాంది గజ్వేల్‌లో జరగాలని గజ్వేల్ ప్రజలు కోరుకుంటున్నారని కేంద్ర మంత్రి చెప్పారు. ‘‘మీరు వేసే ఓటు కేసీఆర్ కుటుంబానికి వేస్తారా? మీ కుటుంబాలకు వేస్తారా? బీజేపీకి ఓటు వేస్తే మీ పిల్లల భవిష్యత్తుకు వేసినట్లు’’ అని తెలిపారు. కాళేశ్వరం నీళ్ళు కేసీఆర్ ఫామ్ హౌస్‌కు వస్తున్నాయని, కానీ గజ్వేల్ ప్రజలు అంగట్లో పశువులు అనుకుంటున్నారని విమర్శించారు.
డబ్బులిస్తే ఓట్లు వేస్తారని అనుకుంటున్నారని, కానీ గజ్వేల్ ప్రజలు పులి పిల్లలు అని హెచ్చరించారు. లక్షల కోట్ల రూపాయలు వెదజల్లి ఎన్నికల్లో గెలవాలనుకుంటున్నారని ఆయన విమర్శించారు. కేసీఆర్ ఇచ్చిన హామీలను నెరవేర్చలేదని పేర్కొంటూ డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లు ఇవ్వకపోగా, ఉన్నవాటినీ ధ్వంసం చేశారని ధ్వజమెత్తారు కిషన్ రెడ్డి.
కుటుంబ పాలన పోవాలంటే బీజేపీతోనే సాధ్యమని చెప్పారు. గజ్వేల్ తోపాటు కామారెడ్డిలోనూ భారతీయ జనతా పార్టీ గెలవబోతోందని జోస్యం చెప్పారు. రాష్ట్రంలో నరేంద్ర మోదీ పాలన వస్తుందని.. బడుగు బలహీన వర్గాల పాలన రాబోతోందని కేంద్ర మంత్రి ఆశాభావం వ్యక్తం చేశారు. గజ్వేల్ లో తాను గెలిస్తే తెలంగాణ ఆత్మగౌరవం నిలబడుతుందని గజ్వేల్ బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ తెలిపారు. కెసిఆర్ ఆహంకారాన్ని గజ్వేల్ ప్రజలు ఓట్ల ద్వారా అణిచివేయాలని పిలుపు ఇచ్చారు. ఆనాడు తెలంగాణ ఉద్యమంలో ఈ నియోజకవర్గం నుంచే బీఆర్‌ఎస్ లో చేరినట్లు గుర్తు చేశారు.
గజ్వేల్‌కు కేసీఆర్ పరాయి వ్యక్తి అని, తాను కాదని మాజీ మంత్రి స్పష్టం చేశారు. రాక్షస పాలన పోవాలంటే గజ్వేల్ రమ్మని ఇక్కడి ప్రజలు కోరారని తెలిపారు. గజ్వేల్ రమ్మని ఇక్కడి ప్రజలు హుజూరాబాద్ ఉప ఎన్నికల సమయంలో కోరారని చెప్పారు. ఢిల్లీకి రాజైనా తల్లికి కొడుకే అంటూ ప్రధాని మోదీ సొంత నియోజకవర్గమైన వారణాసి నెలనెలా వెళ్లి అక్కడి ప్రజల బాగోగులు పట్టించుకుంటారని గుర్తు చేశారు. కానీ కేసీఆర్ మాత్రం గజ్వేల్ ను ఎప్పుడు పట్టించుకో లేదని ధ్వజమెత్తారు. గజ్వేల్ ప్రజలను ఎన్నడూ కూడా కేసీఆర్ కలవరని పేర్కొన్నారు.
More Stories
రాయలసీమ లిఫ్ట్‌కు పర్యావరణ అనుమతి నిరాకరణ
ఉస్మానియాలో ఆందోళనలను నిషేధిస్తూ ఆదేశాలు
తెలంగాణ కులగణన విశ్లేషణలో ఫ్రాన్స్ ఆర్థికవేత్త?