బిసి నేతను తెలంగాణ ముఖ్యమంత్రిగా చేస్తాం

తెలంగాణలో బీసీ నేతను ముఖ్యమంత్రిగా బీజేపీ చేస్తుందని ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించారు. హైదరాబాద్ లోని ఎల్బీ స్టేడియంలో తెలంగాణ ఎన్నికల సందర్భంగా బిజెపి జరిపిన బిసి ఆత్మగౌరవ సభలో మాట్లాడుతూ ఇక్కడనే పదేళ్ల క్రితం తాను ప్రధాని అభ్యర్థిగా ప్రచారం ప్రారంభించి, దేశానికి తొలి ఓబిసి ప్రధాని కాగలిగానని గుర్తు చేశారు.
 
తిరిగి ఇప్పుడు ఇదే ప్రదేశంలో ప్రజల ఆశీర్వాదంతో తెలంగాణకు తొలి బిసి ముఖ్యమంత్రిని బిజెపి చేస్తుందని భరోసా ఇచ్చారు. పదేళ్ల బిఆర్ఎస్ పాలనలో ఎస్సి, ఎస్టీ, బిసిలకు అన్యాయం జరుగుతోందని ఆయన తెలిపారు.  తెలంగాణాలో ప్రభుత్వ వ్యతిరేక తుఫాన్ వేస్తున్నదని చెబుతూ ఇక్కడ మార్పు స్పష్టంగా కనిపిస్తోందని చెప్పారు.
 
తెలంగాణలో కమలం వికసించాల్సిన అవశ్యతక ఎంతైనా ఉందని పేర్కొంటూ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన తెలంగాణలో  బీఆర్ఎస్‌ పేరుతో జరుగుతున్న జరుగుతున్న కుటుంబ పాలనకు స్వస్తి పలకాలని ప్రధాని  పిలుపునిచ్చారు. నిధులు, నీళ్లు, నియామకాలు తెలంగాణ ప్రజలకు చేరడం లేదని ధ్వజమెత్తారు. 
బీజేపీ తెలంగాణలో గెలిస్తే అన్నీ వర్గాలకు నీళ్లు, నిధులు, నియామకాలు అమలు చేస్తామని ప్రధాని హామీ ఇచ్చారు.
అధికారంలోకి వచ్చిన నాటి నుంచి తెలంగాణ ప్రజలకు ఇచ్చిన హామీల్లో ఏ ఒక్కటి అమలు చేయకుండా కేసీఆర్ కుటుంబం రాష్ట్రాన్ని దోచుకుంటోందని మోదీ ధ్వజమెత్తారు.  రాష్ట్రంలో కమలం వికసిస్తేనే తెలంగాణ ప్రజల జీవితాల్లో వికాసం కనిపిస్తుందని స్పష్టం చేశారు.తెలంగాణలో డబుల్ ఇంజిన్ సర్కారుతో అభివృద్ది సాధ్యమని ప్రధాని మోదీ చెప్పారు.
రాజ్యాధికారం అందరికి దక్కాలన్నదే బీజేపీ ఆలోచన అని చెబుతూ అబ్దుల్ కలం,  రామ్‌నాథ్‌ కోవింద్, ద్రౌపది ముర్ము వంటి వారిని రాష్త్రపతులుగా చేసింది బీజేపీ పార్టీ అని గుర్తు చేశారు.  అదే విధంగా బాలయోగిని లోక్ సభలో తొలి దళిత స్పీకర్ గా చేశామని చెప్పారు.   అందుకే అన్నీ విధాలుగా కేసీఆర్ కుటుంబ పాలనలో మోసపోయిన, నష్టపోయిన తెలంగాణ ప్రజలు బీజేపీని గెలిపించాలని  ప్రధాని పిలుపునిచ్చారు. రాష్ట్రంలో అవినీతి రహిత పాలనతో పాటు అభివృద్ది తెలంగాణను చేసి చూపిస్తామని ప్రధాని వాగ్ధానం చేశారు.

ఢిల్లీ లిక్కర్‌ స్కాంలో బీఆర్‌ఎస్‌ నేతలను విడిచిపెట్టామని కాంగ్రెస్‌ నేతలు తమపై ఆరోపణలు చేస్తున్నారని చెబుతూ అవినీతి సొమ్ము తిన్న ఏ ఒక్కరినీ వదిలేది లేదని ప్రధాని స్పష్టం చేశారు. అవినీతి చేసిన వారిని కచ్చితంగా జైలులో వేస్తామని తేల్చి చెప్పారు. కాంగ్రెస్‌ పార్టీకి సీ టీమ్‌ బీఆర్‌ఎస్‌ అని చెబుతూ బిఆర్ఎస్, కాంగ్రెస్‌ రెండు పార్టీల డిఎన్ఎ ఒక్కటే అని ప్రధాని తెలిపారు.

అవినీతి, కుటుంబ పాలన, బుజ్జగింపు రాజకీయాలు వారి లక్షణాలని అంటూ బీసీల ఆకాంక్షలను పట్టించుకునేది బీజేపీ మాత్రమే అని ప్రధాని స్పష్టం చేశారు. బీసీలకు ఎక్కువ టికెట్లు ఇచ్చింది కూడా బీజేపీ అని గుర్తు చేశారు. కేంద్రంలో 27 మంది బిసి మంత్రులు ఉన్నరని, 165 మంది బిసి ఎంపీలు ఉన్నారని, దేశంలో 365 మంది బిసి ఎమ్యెల్యేలు ఉన్నారని, 65 మంది బిసి ఎమ్యెల్సీ ఉన్నారని ప్రధాని గుర్తు చేశారు.

తెలంగాణ ఏర్పడిన తర్వాత కేసీఆర్ ప్రజలకు ఇచ్చిన వాగ్ధానాల్లో ఏ ఒక్కటి అమలు చేయకుండా మోసం చేశారని మోదీ విమర్శించారు. నిరుద్యోగ భృతి, దళితులకు మూడెకరాల భూమి వంటి వాటితో పాటు బడుగు, బలహీన వర్గాలకు ఇచ్చిన హామీలను తుంగలో తొక్కారని చెబుతూ వాటన్నింటిని బీజేపీ ప్రభుత్వం అమలు చేసి తీరుతుందని స్పష్టం చేశారు.

నవంబర్ 30న రాష్ట్రంలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో బిజెపి తరుపున ప్రచారంలో పాల్గొనేందుకు ప్రధాని మోదీ ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో హైదరాబాద్ కు చేరుకున్నారు. అక్కడి నుంచి ఎల్బీ స్టేడియంకు వాహంనంలో వచ్చిన ప్రధానికి బిజెపి నాయకులు, కార్యకర్తలు దారి పొడువునా పూలు జల్లుతో ఘన స్వాగతం పలికారు.

కాగా, బిజెపితో పొత్తులో భాగంగా జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ కూడా ఈ సభకు హాజరయ్యారు. బిజెపి అగ్ర నాయకులతోపాటు భారీ ఎత్తున ప్రజలు, కార్యకర్తలు ఈ సభకు హాజరయ్యారు. ఈ ఎన్నిక ప్రచారంలో బిజెపి బిసి ముఖ్యమంత్రి నినాదంతో ప్రజల్లోకి వెళ్తున్న విషయం తెలిసిందే.