మళ్లీ మోదీయే ప్రధాని కావాలి

భారతీయుల గుండెల్లో ధైర్యం నింపిన వ్యక్తి ప్రధాని మోదీ అంటూ 3 దశాబ్దాల ప్రగతిని ఒక్క దశాబ్దంలోనే మోదీ సాధించారని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కొనియాడారు. ఎల్బీ స్టేడియంలో ప్రధాని మోదీ పాల్గొన్న బిజెపి ఆధ్వర్యంలో జరుగుతున్న బీసీల ఆత్మగౌరవ సభలో మాట్లాడుతూ మోదీ మరోసారి ప్రధాని కావాలని, అందుకు జనసేన మద్దతు ఇస్తుందని ప్రకటించారు.
 
ప్రధాని మోదీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుంటే ఆర్టికల్ 370, మహిళా రిజర్వేషన్ బిల్లు, ట్రిపుల్ తలాక్ బిల్లు తీసుకువచ్చే వారు కాదని స్పష్టం చేశారు.  2014 వరకు దేశంలో ఎన్ని ఉగ్రదాడులు జరిగాయో అందరికీ తెలుసని పేర్కొంటూ మోదీ ప్రధాని అయ్యాక దేశంలో ఉగ్రదాడులను కట్టడి చేశారని తెలిపారు. చంద్రయాన్-2 ఫెయిల్ అయినప్పుడు శాస్త్రవేత్తలను భుజం తట్టి చంద్రయాన్-3 సక్సెస్ వైపు నడిపించారని కొనియాడారు. 
 
డిజిటల్ పేమెంట్స్ తీసుకొచ్చి దేశ ఆర్థిక వ్యవస్థను మార్చేశారని, పీఎం కిసాన్, స్వచ్ఛ భారత్ వంటి ఎన్నో పథకాలను ప్రధాని మోదీ తీసుకువచ్చారని గుర్తుచేశారు.  “మాటలు చెప్పడం సులభం, కానీ ఆచరణ చాలా కష్టం. ప్రధాని మోదీ బీసీలను సీఎం చేస్తామని ప్రకటించారు. ఆ మాటకు తప్పని సరిగా కట్టుబడి ఉంటారు. మిషన్ 2047 విజయవంతం కావాలంటే మోదీ మరోసారి ప్రధాని అవ్వాలి. అందుకు జనసేన మద్దతుగా నిలుస్తుంది” అని వెల్లడించారు. 
ప్రధాని మోదీని ఒక అన్నగా భావించి, ఆయన ప్రసంగాలు చూసిన స్పూర్తితో రాజకీయాల్లోకి వచ్చానని పవన్ కళ్యాణ్ చెప్పారు. సకల జనులు సమరం చేస్తేనే తెలంగాణ వచ్చిందని పేర్కొంటూ తెలంగాణ రాష్ట్రం వచ్చినా నీళ్లు, నిధులు, నియామకాలు అందరికీ అందని పరిస్థితి ఉందని విచారం వ్యక్తం చేశారు. తనలాంటి కోట్ల మంది కన్న కలలకు ప్రతిరూపమే ప్రధాని మోదీ అని తెలిపారు.

తెలంగాణ భాగవతం పుట్టిన నేల అని పవన్ కల్యాణ్ గుర్తు చేశారు.  ఈ నేలలో బతుకు భారం అవ్వకూడదని స్పష్టం చేస్తూ ప్రధాని మోదీ నాయకత్వంలో బీసీలు తెలంగాణలో ఎదగాలని అభిలాష వ్యక్తం చేశారు. ప్రధాని మోదీ బీసీలను సీఎం చేస్తామని హామీ ఇచ్చారని హర్షం ప్రకటించారు. అందుకు జనసేన సంపూర్ణ మద్దతు ఉంటుందని ప్రకటించారు. 

తెలంగాణ ఎన్నికల్లో బీజేపీకి అండగా ఉంటామని చెబుతూ తెలంగాణలో బీజేపీతో కలిసి పోటీ చేసేందుకు అవకాశం ఇచ్చినందుకు  పవన్ కళ్యాణ్  ధన్యవాదాలు తెలిపారు. మోదీ గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఆయన ప్రసంగాలు విని స్ఫూర్తిపొందాని, ఇలాంటి వ్యక్తి ప్రధాని అయితే దేశం బాగుంటుందని భావించానని పేర్కొన్నారు. 

ప్రధాని మోదీ అంటే తనకెంతో ఇష్టమైన నేత అని చెబుతూ తనకు ధైర్యం ఇచ్చి, రాజకీయాల్లో భుజం తట్టిన నాయకుడు మోదీ అని పవన్ గుర్తుచేసుకున్నారు. ఇలాంటి వ్యక్తి పక్కన కూర్చునే అవకాశం లభించినందుకు ధన్యవాదాలు తెలిపారు. మోదీ మూడోసారి ప్రధాని అవ్వాలని, అందుకు జనసేన మద్దతు ఉంటుందని తెలిపారు.