బీహార్ ఎస్సీ, ఎస్టీ కుటుంబాల్లో 42 శాతం మంది పేద‌లే

బీహార్‌లో కుల గ‌ణ‌న‌కు చెందిన నివేదికను నితీష్ కుమార్ ప్రభుత్వం మంగళవారం అసెంబ్లీలో ప్ర‌వేశ‌పెట్టింది. ఆ రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీ వ‌ర్గాల‌కు చెందిన ప్ర‌జ‌ల్లో 42 శాతం మంది క‌టిక పేద‌లే ఉన్న‌ట్లు నివేదికలో  వెల్ల‌డించారు. ఇక వెనుక‌బ‌డిన‌, ఈడ‌బ్ల్యూసీ కేట‌గిరీల‌కు చెందిన వారిలో 33 శాతం మంది ప్ర‌జ‌లు పేద‌లుగా ఉన్న‌ట్లు అందులో పేర్కొన్నారు. 
 
జ‌న‌ర‌ల్ క్యాట‌గిరీకి చెందిన 25.09 శాతం కుటుంబాలు పేద‌రికం జాబితాలో ఉన్న‌ట్లు ఈ నివేదిక ద్వారా వెల్ల‌డైంది. స‌ర్వే చేప‌ట్టిన డేటా ప్ర‌కారం ఎస్సీల్లో కేవ‌లం ఆరు శాతం మంది మాత్ర‌మే త‌మ స్కూల్ చ‌దువులు పూర్తి చేశారు. 11వ‌, 12వ త‌ర‌గ‌తి వ‌ర‌కు చ‌దివిన వారిలో 9 శాతం మంది ఉన్నారు. 
 
బీహార్‌లో ఉన్న జ‌నాభాలో 60 శాతం మంది ప్ర‌జ‌లు వెనుక‌బ‌డిన త‌ర‌గ‌తులు లేక ఈడ‌బ్ల్యూసీ వ‌ర్గానికి చెందిన వారే ఉన్న‌ట్లు నివేదికలో స్ప‌ష్టం చేశారు. రాష్ట్రానికి చెందిన వారు సుమారు 50 ల‌క్ష‌ల మంది బీహార్ బ‌య‌ట జీవిస్తున్న‌ట్లు నివేదికలో తెలిపారు. ఉద్యోగం, విద్య కోసం వాళ్లు ఇత‌ర రాష్ట్రాల్లో జీవిస్తున్నారు. 
 
బీహార్ రాష్ట్ర‌వ్యాప్తంగా 34.1 శాతం పేద‌లు ఉన్న‌ట్లు నివేదికలో తేల్చారు. ఆ పేద‌ల ఆదాయం నెల‌కు ఆరువేల క‌న్నా త‌క్కువ‌గా ఉంది. రాష్ట్రంలో 29 శాతం మంది ప‌ది వేల క‌న్నా త‌క్కువ ఆదాయాన్ని ఆర్జిస్తున్నారు. 10 వేల నుంచి 50 వేల మ‌ధ్య ఆదాయం ఉన్న‌వారు 28 శాతం ఉన్నారు. 50 వేల క‌న్నా ఎక్కువ సంపాదిస్తున్న వారి సంఖ్య కేవ‌లం 4 శాతం ఉన్న‌ట్లు నివేదికలో తెలిపారు.
 
ప్రభుత్వం విడుదల చేసిన డాటా ప్రకారం, బీహార్‌లో జనరల్ కేటగిరిలో ఉన్న అగ్రవర్ణాలకు చెందిన భూమిహార్లలో పేదరికం ఎక్కువగా ఉందని తేలింది. 27.58 శాతం భూమిహార్‌లు ఆర్థికంగా బలహీనంగా ఉన్నారు. భూమిహార్ సామాజికవర్గంలో 8,38,447 కుటుంబాలు ఉండగా, వీరిలో 2,31,211 మంది ఆర్థికంగా బలహీనంగా ఉన్న క్యాటగిరిలో ఉన్నారు. 
 
హిందూ అగ్రవర్ణాల్లో పేదరికం పరంగా బ్రాహ్మణ సామాజిక వర్గం రెండో స్థానంలో ఉంది. డాటా ప్రకారం 25.52 శాతం బ్రాహ్మణ కుటుంబాలు పేదరికంలో ఉన్నాయి. బీహార్‌లో 10,76,563 బ్రాహ్మణ కుటుంబాలు ఉండగా, వీరిలో 2,72,576 మంది పేదరికంలో ఉన్నారు.  కాగా, పేదరికంలో రాజ్‌పుట్‌లు మూడో స్థానంలో ఉన్నారు.
కులగణన నివేదిక ప్రకారం 24.89 శాతం రాజ్‌పుట్‌లు పేదరికంలో ఉన్నారు. రాష్ట్రంలో 9,53,447 రాజ్‌పుట్ కుటుంబాలు ఉండగా, వారిలో 2,37,412 కుటుంబాలు పేదరికంలో మగ్గుతున్నాయి. ఇదే సమయంలో, కాయస్థులు అత్యంత సంపన్న సామాజికవర్గానికి చెందిన వారుగా నిలిచారు. రాష్ట్రంలో కేవలం 13.38 శాతం కాయస్థులు మాత్రమే పేదరికంలో ఉన్నారు. బీహార్‌లో ఈ సమాజాకి వర్గానికి చెందిన వారు 1,70,985 కుటుంబాలు ఉండగా, వీరిలో 23,639 కుటుంబాలు పేదరికంలో ఉన్నాయి.

ముస్లింలలోని షేక్, పఠాన్, సైయద్‌‌ల ఫైనాన్సియల్ అకౌంట్స్‌ను కూడా ప్రభుత్వం విడుదల చేసింది. వీరిని అప్పర్ కాస్ట్‌గా పరిగణించారు. ప్రభుత్వ డాటా ప్రకారం షేక్ సామాజిక వర్గానికి చెందిన వారిలో 25.84 శాతం మంది పేదవారి కేటగిరిలో ఉన్నారు.  షేక్ సామాజిక వర్గానికి చెందిన కుటుంబాలు 10,38,880 కుటుంబాలు ఉండగా, వీరిలో 2,68,398 కుటుంబాలకు పేదరికంలో ఉన్నాయి. ఇదే సమయంలో పఠాన్ సామాజిక వర్గంలో 22.20 శాతం కుటుంబాలు పేదరికంతో బాధపడుతున్నారు. 17.61 శాతం సైయద్ కుటుంబాలు కూడా పేదరికంలో ఉన్నాయి.