భారత్ ఎప్పటికీ హిందూ రాష్ట్రమే.. ఆర్ఎస్ఎస్

* ఉత్తర – దక్షిణ విభజన కుట్రపై హెచ్చరిక
భారతదేశం “ఎప్పటికీ” ‘హిందూ రాష్ట్రం’ గానే ఉంటుందని, ఆ మేరకు అధికారికంగా  ఎటువంటి ఏర్పాటు చేయాల్సిన అవసరం లేదని  రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) సర్ కార్యవాహ దత్తాత్రేయ హోసబాలే, స్పష్టం చేశారు. గుజరాత్ లోని భుజ్ లో మూడు రోజులపాటు జరిగిన అఖిల భారతీయ కార్యకారి మండల్ సమావేశాల ముగింపు సందర్భంగా మంగళవారం మీడియాతో మాట్లాడుతూ  భారతదేశం స్వాభావికంగా “హిందూ రాష్ట్రం” అని తెలిపారు. 
 
ఈ వాదనకు మద్దతుగా ఆర్ఎస్ఎస్ వ్యవస్థాపకులు డా. హెడ్గేవార్ చేసిన చారిత్రక ప్రకటనను ఉదహరించారు. “హిందువు అని చెప్పుకునే చిట్టచివరి వ్యక్తి ఉన్నంత వరకు భారతదేశం హిందూ దేశంగా కొనసాగుతుంది” అని హెడ్గేవార్ చెప్పినట్లు ఆయన వివరించారు. రాజ్యాంగ వ్యవస్థకు, దేశ స్వభావంకు మధ్యగల తేడాను ప్రస్తావిస్తూ “బ్రిటీష్ వారు భారతదేశాన్ని పాలించినప్పుడు దీనిని బ్రిటిష్ రాజ్ అని పిలిచేవారు. కానీ, అప్పటికి- ఇప్పటికి  కూడా, భారతదేశం హిందూ దేశంగా ఉంది” అని గుర్తు చేశారు. 
 
హిందుత్వం అంటే మన దేశానికి, సమాజానికి, సంస్కృతికి, మతానికి ఏదైనా మంచి చేయాలనే భావన. ఈ హిందుత్వాన్ని నిజం చేసేందుకు సంఘ్ కృషి చేస్తోంది. ఫలితంగా హిందూ రాష్ట్రాన్ని ప్రత్యేకంగా ఏర్పాటు చేయాల్సిన అవసరం లేదని ఆయన వివరించారు.
 
కాగా, నేడు దేశం ముందున్న ప్రధాన సవాళ్లలో ఒకటి ‘ఉత్తరం – దక్షిణం’ రేఖలపై నెలకొన్న “విభజించే కుట్ర” అని హోసబాలే హెచ్చరించారు. ”దక్షిణ భారతదేశం వేరు, ఉత్తర భారతదేశం వేరని ఇప్పుడు కొందరు అంటున్నారని, తాము ద్రావిడులమని, తమ భాష కూడా వేరని చెబుతూ దక్షిణాదిని (మిగిలిన భారతదేశం నుండి) విభజించేందుకు రాజకీయ, మేధో స్థాయిలో కుట్ర జరుగుతోందని తెలిపారు.
 
ఇది దేశాన్ని నిర్వీర్యం చేసే ఎత్తుగడ అని చెబుతూ దీన్ని వ్యతిరేకించేందుకు ప్రజలు ముందుకు రావాలని, అలాంటి వ్యక్తులు విజయం సాధించకుండా చూసుకోవాలని ఆయన పిలుపిచ్చారు. ఇటువంటి విభజన భావాలు భారతదేశ ఐక్యతను దెబ్బతీశాయని హెచ్చరించారు. 
 
 “మన దేశం విడదీయరానిది; శంకరాచార్య దక్షిణాది నుండి వచ్చి ఉండవచ్చు, కానీ ఆయన మొత్తం దేశానికి చెందినవారు. అదేవిధంగా, గాంధీ మూలాలు గుజరాత్‌లో ఉన్నాయి, అయినప్పటికీ ఆయన దేశం అంతటా గౌరవం పొందుతున్నారు. వివేకానంద బెంగాల్‌కు చెందినవాడైనా ఆయన అతని ప్రభావం దేశం మొత్తం విస్తరించి ఉంది. అలాంటప్పుడు మనం ఉత్తరం- దక్షిణాల మధ్య తేడాను ఎలా గుర్తించగలం?” అని ప్రశ్నించారు. 
 

 ‘లవ్ జిహాద్’ అంశాన్ని ప్రస్తావిస్తూ ఈ సమస్యకు రెండు కోణాలు ఉన్నాయని సర్ కార్యవాహ చెప్పారు. ప్రజలకు అవగాహన కల్పించడం, చట్టపరమైన కేసులపై పోరాడడం అని పేర్కొంటూ మతాంతర వివాహాల ద్వారా హిందూ మహిళలను ఇస్లాంలోకి మార్చేందుకు కుట్ర జరుగుతోందని ఆయన హెచ్చరించారు. కాగా, అటువంటి సంబంధాల నుండి తమను తాము విడిపించుకున్న వారి కుటుంబాలు అంగీకరించని మహిళల పునరావాసంపై కూడా ఆర్‌ఎస్‌ఎస్ పనిచేస్తోందని ఆయన తెలిపారు. మరోవంక, దేశవ్యాప్తంగా ఉన్న సరిహద్దు ప్రాంతాల భద్రత దృష్ట్యా, ఈ ప్రాంతాల్లో ఆరోగ్య సౌకర్యాలు, విద్య, భద్రత, స్వావలంబన, పౌర విధికి సంబంధించి సీమ జాగరణ్ మంచ్ ద్వారా ప్రయత్నాలు జరుగుతాయని, ఈ కృషి మరింత వేగంగా ముందుకు సాగుతుందని హోసబాలే చెప్పారు.  సరిహద్దు ప్రాంతాల్లో స్థానిక పౌర, భద్రతా బలగాలతో సమన్వయం పెంచేందుకు కూడా ప్రత్యేక కృషి చేస్తున్నట్లు వెల్లడించారు.