మహదేవ్‌ యాప్ లో సీఎం బఘేల్‌ చుట్టూ బిగుస్తున్న ఉచ్చు

మహదేవ్‌ బెట్టింగ్‌ యాప్‌ ముడుపుల కేసులో ఛత్తీస్‌గఢ్‌ ముఖ్యమంత్రి, కాంగ్రెస్‌ నేత భూపేశ్‌ బఘేల్‌ చుట్టూ ఉచ్చు బిగుస్తున్నది. యాప్‌ యజమానిగా భావిస్తున్న శుభమ్‌ సోని నేరాన్ని ఒప్పుకోవడంతో బఘేల్‌ చిక్కుల్లో పడ్డారు. తనకు, బఘేల్‌కు ఉన్న సంబంధాల గురించి ఆయన వెల్లడించమే కాక, బఘేల్‌కు వందలాది కోట్ల రూపాయలను ముడుపులుగా ఇచ్చానని అంగీకరిస్తూ ఓ వీడియో విడుదల చేశారు. 

యూఏఈ వెళ్లిపొమ్మని భూపేశ్‌ బఘేలే తనకు సలహా ఇచ్చారని ఆయన ఆ వీడియోలో పేర్కొన్నట్టు విశ్వసనీయంగా తెలిసింది. మంగళవారం అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న క్రమంలో తాజా పరిణామాలు కాంగ్రెస్‌ను చిక్కుల్లో పడేశాయి. ఎన్నికల కోసం మహదేవ్‌ యాప్‌ నిర్వాహకుల నుంచి బఘేల్‌కు రూ.508 కోట్ల ముడుపులు అందినట్టు ఆరోపణలు వచ్చాయి.

మహాదేవ్‌ బెట్టింగ్‌ యాప్‌ ముడుపుల వ్యవహారం ఛత్తీ్‌సగఢ్‌ అసెంబ్లీ ఎన్నికల్లో కీలక ప్రచారాస్త్రంగా మారింది. గల్ఫ్‌లో ఉన్న ఇద్దరు నిందితులు కేంద్రంగా కొనసాగుతున్న ఈ కేసు కాంగ్రె్‌సను ఇబ్బందులకు గురిచేస్తోంది. ఛత్తీ్‌సగఢ్‌ సీఎం భూపేశ్‌ బఘేల్‌కు ముడుపులు అందాయంటూ ఈడీ ఆరోపణలు చేస్తోంది. ఇదే అంశాన్ని బీజేపీ ఎన్నికల ప్రచారానికి విస్తృతంగా వాడుకుంటోంది.
మహాదేవ్‌ బుక్‌ సహా 22 బెట్టింగ్‌ యాప్‌లు, వెబ్‌సైట్‌లపై కేంద్రం కొరడా ఝళిపించింది. అక్రమ లావాదేవీలు నిర్వహిస్తున్నందున ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) విజ్ఞప్తి మేరకు మొత్తం 22 యాప్‌లు, వెబ్‌సైట్‌లను నిషేధించినట్టు కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఈ కేసులో ప్రధాన నిందితుడైన శుభ్‌మన్‌ సోని దుబాయ్‌ నుంచి వీడియో విడుదల చేశారు. అందులో సీఎం బఘేల్‌పై తీవ్ర ఆరోపణలు చేశారు. బఘేలే తనను దుబాయ్‌ పారిపొమ్మని సలహా ఇచ్చినట్టు ఆయన పేర్కొన్నారు.
తానే మహదేవ్‌ యాప్‌కు అసలైన యజమానినని స్పష్టం చేసాడు.  ఈ యాప్‌ ద్వారా వందలాది కోట్లను ఆర్జిస్తుండటంతో, చట్టపరమైన ఇబ్బందులు ఏర్పడ్డాయని, వాటి నుంచి రక్షణకు నేతలను ఆశ్రయించామని చెప్పారు. అందులో భాగంగానే బఘేల్‌కు పెద్దమొత్తంలో ముడుపులు అందజేసినట్టు తెలిపాడు. ఇటీవల కేంద్ర దర్యాప్తు సంస్థలు తనపై నిఘా ఉంచాయని పేర్కొన్నారు. 

కాగా, ఇటీవల ఆసిమ్‌ దాస్‌ అనే కొరియర్‌ నుంచి ఈడీ 5.39 కోట్లను స్వాధీనం చేసుకుంది. సీఎం బఘేల్‌ కోసం ఆ మొత్తాన్ని తనకు దుబాయ్‌ నుంచి శుభమ్‌ సోని పంపినట్టు ఆయన ఈడీ వద్ద అంగీకరించాడు. దీంతో అతని సెల్‌ఫోన్‌, శుభ్‌మన్‌ సోని నుంచి వచ్చిన ఈ-మెయిల్స్‌ పరిశీలించగా, ఇప్పటివరకు మహదేవ్‌ యాప్‌ ప్రమోటర్ల నుంచి బఘేల్‌కు రూ.508 కోట్లు ముడుపులుగా అందినట్టు అధికార వర్గాలు తెలిపాయి.

జూలై 2022 నుండి, ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ మహాదేవ్ బుక్ ఆన్‌లైన్ బెట్టింగ్ యాప్ సిండికేట్‌పై మనీ లాండరింగ్ ఆరోపణల కింద దర్యాప్తు చేస్తోంది. మహదేవ్ యాప్ ప్రమోటర్లు సౌరభ్ చంద్రకర్, రవి ఉప్పల్ రిమోట్ ద్వారా అనేక వేల కోట్ల విలువైన అక్రమ బెట్టింగ్ కార్యకలాపాలను నిర్వహిస్తున్నారని ఈడీ ఆరోపించింది.
గత కొన్ని నెలలుగా, ఈడీ  నలుగురు నిందితులను అరెస్టు చేసింది.  రూ. 450 కోట్లకు పైగా స్వాధీనం చేసుకుంది. ఈ కేసులో విచారణ కోసం రణబీర్ కపూర్, హుమా ఖురేషి, హాస్యనటుడు కపిల్ శర్మ మొదలైన బాలీవుడ్ ప్రముఖులను ఈడీ  పిలిపించిన తర్వాత మహాదేవ్ యాప్ ముఖ్యాంశాలను పట్టుకుంది. మహాదేవ్ యాప్ స్కామ్ కేసులో తాజా పరిణామం రాజకీయ మలుపు తిరిగినప్పటికీ, ఈ వ్యవహారానికి మరింత ఆజ్యం పోసింది.