నియంత్రణలోకి వస్తున్న ద్రవ్యోల్బణం

2023-24లో జీడీపీ వృద్ధి ట్రాక్‌లో ఉన్నప్పటికీ, కొన్ని ప్రధాన ఆహారపదార్థాల ధరల పెరుగుదల కారణంగా రెండవ త్రైమాసికంలో ద్రవ్యోల్బణం తగ్గుదల ధోరణికి అవాంతరం ఏర్పడింది. అయితే, ఇటీవల ఈ పరిస్థితి కొంతమేరకు నియంత్రణలోకి వస్తున్నట్లు ఆర్థిక మంత్రిత్వశాఖ పేర్కొంది. కొన్ని ఆహార పదార్థాల ధరలలో కాలానుగుణ, వాతావరణ ఆధారిత సరఫరా పరిమితులు సానుకూలంగా ఉన్నట్లు తెలిపింది.

ఇటీవలి నివేదిక ప్రకారం, కూరగాయల ధరలు, సవరించిన ఎల్‌పిజి ధరల తగ్గింపు నేపథ్యంలో ప్రధాన ద్రవ్యోల్బణం నియంత్రణలోకి వచ్చింది. వినియోగదారుల ధరల సూచీ (సిపిఐ) రిపోర్టు ప్రకారం, సెప్టెంబర్‌ మాసంలో ప్రధాన ద్రవ్యోల్బణం 5శాతంగా ఉంది. జులై, ఆగస్టులో దీని పెరుగుదల తాత్కాలికమేనని నిరూపితమైంది.

సిపిఐ బాస్కెట్‌లోని 299 వస్తువలలో జులైలో రెండంకెల ద్రవ్యోల్బణంతో 11.4శాతం ఆహారపదార్థాల వల్ల ప్రధాన ద్రవ్యోల్బణం పెరిగింది. అయితే ఇది సెప్టెంబర్‌లో 7శాతానికి దిగొచ్చినందున ఆహార ద్రవ్యోల్బణాన్ని తగ్గించడంతోపాటు ఇంధనం భారాన్ని తేలిక చేసింది.  దేశీయ ఎల్‌పీజీ ధరలను సిలిండర్‌కు రూ.200 తగ్గించిన ఫలితంగా ఆగస్టులో 4.2శాతంగా ఉన్న ఎల్‌పిజి ద్రవ్యోల్బణం సెప్టెంబర్‌లో (-)12.7శాతానికి తగ్గింది.

మరోవైపు ఆహార, ఇంధనేతర ద్రవ్యోల్బణం ఆగస్టులో 4.9 శాతం నుంచి సెప్టెంబర్‌లో 4.5 శాతానికి తగ్గింది.  గత 42 మాసాల్లో నమోదైన కనిష్ట ప్రధాన ద్రవ్యోల్బణం ఇదే. వరుసగా ఏడవ నెల కూడా ఆర్‌బీఐ పరిమిత స్థాయి 6శాతం బ్యాండ్‌ కంటే అధిక స్థాయిల్లో కొనసాగింది. ఇటీవల ధరల ట్రెండ్‌లు ఏడాదిన్నర కాలంగా ఆర్‌బీఐ అనుసరిస్తున్న ద్రవ్యవిధాన వైఖరిని సమర్థించాయి.

మే 2022 నుంచి ద్రవ్య విధాన చర్యలు కఠిన వైఖరిలో కొనసాగాయి. అక్టోబర్‌లో జరిగిన ద్రవ్య విధాన కమిటీ సమావేశంలోనూ వృద్ధికి తోడ్పాటు అందిస్తూనే, లక్ష్యానికి అనుగుణంగా ఉండేలా ఆర్‌బీఐ దృష్టి సారించింది. ఈ క్రమంలో రెపో రేటను 6.5శాతం వద్ద స్థిరంగా ఉంచింది.