ఉచిత రేష‌న్ ప‌థ‌కం మ‌రో అయిదేళ్లు పొడిగింపు

ఉచిత రేషన్ పథకాన్ని మరో ఐదేళ్లపాటు పొడిగిస్తున్నట్లు ఛత్తీస్‌గఢ్‌లోని దుర్గ్‌లో ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించారు. దేశంలోని 80 కోట్ల మంది పేదలకు ఉచిత రేషన్ అందించే పథకాన్ని వచ్చే ఐదేళ్లపాటు బీజేపీ ప్రభుత్వం పొడిగించాలని నిర్ణయించుకున్నట్లు ఆయన తెలిపారు.  మోసం తప్ప పేదలకు కాంగ్రెస్ ఎప్పుడూ ఏమీ ఇవ్వలేదని ప్రధాని ధ్వజమెత్తారు.
కాంగ్రెస్ ఎప్పుడూ పేదలను గౌరవించ లేదని, పేదల బాధలు వారికి ఎప్పుడూ అర్థం కావని విమర్శించారు. అందుకే కాంగ్రెస్ అధికారంలో ఉన్నంత కాలం పేదల హక్కులను దోచుకుని తిని నాయకులంతా తమ ఖజానాను నింపుకున్నారంటూ మండిపడ్డారు.  2014లో ప్రభుత్వం వచ్చిన తర్వాత బీజేపీ ప్రభుత్వం సంక్షేమానికి పెద్దపీట వేసిందని చెబుతూ పేదరికాన్ని నిర్మూలించగలమని విశ్వాసం కలిగించామని ప్రధాని తెలిపారు. 
బీజేపీ అధికారంలోకి వచ్చిన ఐదేళ్లలో 13.5 కోట్ల మంది పేదరికం నుండి బయటపడ్డారని చెబుతూ పేదరికం నుంచి బయటపడిన వారే నేడు కోట్లాది దీవెనలు ఇస్తున్నారని తెలిపారు.  ప్రతి పేదవాడు తన పేదరికాన్ని అంతమొందించే అతిపెద్ద సైనికుడిగా మారి మోదీకి తోడుగా ఉండేలా కొత్త విధానాలను రూపొందించామని పేర్కొన్నారు.
బీజేపీ ప్రభుత్వం ఎంతో ఓర్పు, నిజాయితీతో పని చేసిందని చెప్పారు. మోదీ ప్రజా సేవకుడు, మీ అందరికీ సోదరుడు, అతనో పేదవాడని అభివర్ణించుకున్నారు. ‘‘మన దేశంలో అతి పెద్ద కులం పేదలు. నేను వారి సేవకుడిని’’ అని చెప్పారు.  దేశంలోని ఏ ప్రాంతానికి వెళ్లినా పేదలకు ఉచిత రేషన్ అందేలా బీజేపీ ప్రభుత్వం ఏర్పాట్లు చేసిందని ప్రధాని తెలిపారు.
అందుకే వన్ నేషన్-వన్ రేషన్ కార్డ్ సౌకర్యం కల్పించామని పేర్కొన్నారు. జాతీయ ఆహార భద్రతా చట్టం ప్రకారం దేశంలోని 80 కోట్ల మంది కరోనా సమయంలో పేద ప్రజలకు ఉపశమనం కలిగించేందుకు ఈ పథకాన్ని తీసుకొచ్చామ‌ని, 28 నెలల్లో ప్రభుత్వం పేదలకు ఉచిత రేషన్ కోసం రూ.1.80 లక్షల కోట్లు ఖర్చు చేసిందని వివరించారు.
 
‘‘ఆత్మ విశ్వాసం ఉన్న పేదలంటే కాంగ్రెస్ కు నచ్చదు. పేదలు పేదలుగానే ఉండాలని కోరుకుంటుంది. అందుకే, కేంద్ర ప్రభుత్వం పేదల కోసం చేపట్టిన ఏ పథకాన్ని కూడా రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేయలేదు. గత ఐదేళ్లుగా రాష్ట్ర ప్రజలను కాంగ్రెస్ దోచుకుంటోంది. మరో నెల రోజులు ఆగండి. మీ సమస్యలు తీరుతాయి. మీకు కాంగ్రెస్ నుంచి విముక్తి లభిస్తుంది’’ అని ప్రధాని మోదీ స్పష్టం చేశారు.
 
\రాష్ట్ర ముఖ్యమంత్రి భూపేశ్ భగేల్ కు బెట్టింగ్ యాప్ డీల్ లో ముడుపులు అందాయన్న ఆరోపణలను గుర్తు చేస్తూ, కాంగ్రెస్ పార్టీ పై నుంచి కింది వరకు అవినీతిమయమేనని ధ్వజమెత్తారు.చత్తీస్ గఢ్ లో పేదలను లూటీ చేసే ఏ అవకాశాన్ని కూడా కాంగ్రెస్ పార్టీ వదులుకోదని విమర్శించారు. ‘‘రెండు రోజుల క్రితం రాయ్ పూర్ లో సోదాల్లో కోట్లాది రూపాయలు దొరికాయి. అవి గాంబ్లర్లు, బెట్టింగ్ లకు పాల్పడే వాళ్లవని చెబుతున్నారు. ఆ డబ్బు ఎక్కడికి పోతుందో మీకు తెలుసు. అవి కాంగ్రెస్ నాయకుల ఇళ్లల్లోకి చేరుతున్నాయి’’ అని ప్రధాని ఆరోపించారు.