బీజేపీ వైపే రాజస్థాన్ ఓటర్లు మొగ్గు!

 
* ఎన్డీటీవీ- సీ ఎస్ డి ఎస్ ఒపీనియన్ పోల్
 
ఈ నెలలో ఐదు రాష్ట్రాల అసెంబ్లీలకు ఎన్నికలు జరగబోతున్నాయి. ఇందులో ఉత్తరాది రాష్ట్రం రాజస్తాన్ కూడా ఒకటి. ఐదేళ్లకోసారి అధికారం మార్చేసే సంప్రదాయం ఉన్న రాజస్తాన్ లో అధికారంలో ఉన్న కాంగ్రెస్ దీన్ని అధిగమించి మరోసారి అధికారంలోకి వస్తుందా ?, లేకపోతే విపక్షంలో ఉన్న బీజేపీకి ఓటర్లు అధికారం కట్టబెడతారా అన్న దానిపై పలు ఒపీనియన్ పోల్స్ వెలువడుతున్నాయి. ఇదే క్రమంలో జాతీయ మీడియా సంస్ధ ఎన్డీటీవీ తన అధ్యయనం ఫలితాల్ని ప్రకటించింది.
 
ఎన్డీటీవీ తాజాగా నిర్వహించిన ఒపీనియన్ పోల్స్ లో రాజస్తాన్ లో ఈసారి అధికార కాంగ్రెస్ కంటే విపక్షంలో ఉన్న బీజేపీ వైపే ఓటర్లు ఎక్కువగా మొగ్గు చూపుతున్నారని వెల్లడైంది. దీనికి ప్రధాని మోడీ ఛరిష్మా ప్రధాన కారణంగా చెబుతోంది. రాష్ట్రంలోని 200 నియోజకవర్గాల్లో 30 సీట్లలో 3 వేల మందిని ప్రశ్నిస్తే వెల్లడైన అభిప్రాయాల ఆధారంగా ఎన్డీటీవీ ఈ సర్వే ఫలితాలను నిర్ణయించింది.
 
రాజస్తాన్ లో అవినీతి, ధరల పెరుగుదల, నిరుద్యోగం వంటి విషయాల్లో కాంగ్రెస్ ప్రభుత్వ పనితీరుపై ఓటర్లు కాస్త అసంతృప్తిగా ఉన్నట్లు ఎన్డీటీవీ సర్వేలో తేలింది. సర్వేలో పాల్గొన్న వారిలో సీఎం అశోక్ గెహ్లాట్ ను చూసి ఓటేస్తామని చెప్పిన వారు 32 శాతం ఉండగా.. ప్రధాని మోడీని చూసి ఓటేస్తామని 37 శాతం మంది చెప్పారు. 
 
ఇద్దరినీ పోల్చి ఓటేస్తామని చెప్పిన వారు 20 శాతం ఉన్నారు. అలాగే సర్వేలో పాల్గొన్న వారిలో 43 శాతం మంది గెహ్లాట్ సర్కార్ పై పూర్తి సంతృప్తిగా ఉన్నామని చెప్పారు. 28 శాతం మంది కొంతవరకూ సంతృప్తిగా ఉన్నట్లు చెప్పగా.. 10 శాతం మంది కాస్త అసంతృప్తిగా, 14 శాతం పూర్తి అసంతృప్తిగా ఉన్నట్లు చెప్పారు.
 
సీఎం అభ్యర్ధిగా అశోక్ గెహ్లాట్ కు 27 శాతం మద్దతు తెలుపగా.. ఆ తర్వాత 14 శాతం బీజేపీ నేత వసుంధరా రాజేకు, సచిన్ పైలట్ కు 9 శాతం మంది మద్దతు తెలిపారు. బీజేపీ నుంచి ఎవరైనా పర్వాలేదని 15 శాతం మంది చెప్పారు.  అవినీతి నియంత్రణ, మహిళల విషయంలో రాష్ట్రం కంటే కేంద్రం పనితీరు బావుందని ఎక్కువ మంది చెప్పారు. అలాగే కాంగ్రెస్ పార్టీ కూడా తన పనితీరు మెరుగుపర్చుకుంటే ఇప్పటికీ గెలిచే అవకాశం ఉందని పలువురు చెప్పారు.