యూపీ కాంగ్రెస్ అధ్యక్షునిపై ఎబివిపి ఫిర్యాదు

ఉత్తర ప్రదేశ్ లోని బనారస్‌ హిందూ యూనివర్శిటీ (బిహెచ్‌యు)లో శతృత్వాన్ని రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారంటూ ఉత్తరప్రదేశ్‌ కాంగ్రెస్‌ అధ్యక్షుడు అజయ్ రాయ్ పై కేసు నమోదైంది. అఖిల భారతీయ విద్యార్ధి పరిషత్ (ఎబివిపి ) ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు శనివారం పోలీసు అధికారులు తెలిపారు. 

బిహెచ్‌యు క్యాంపస్‌లో గురువారం జరిగిన లైంగిక వేధింపుల ఘటనలో తమ ఎబివిపి సభ్యుల ప్రమేయం ఉందని అజయ్ రాయ్  వ్యాఖ్యానించినట్లు ఎఫ్‌ఐఆర్‌లో పేర్కొన్నారు. దీంతో అజయ్ రాయ్ పై ఐపిసి 505(2) (శతృత్వాన్ని రెచ్చగొట్టేలా వ్యాఖ్యలు చేయడం, విద్వేషాన్ని పెంచడం) శుక్రవారం రాత్రి లంకపోలీస్‌ స్టేషన్‌లో కేసు నమోదైనట్లు ఇన్‌స్పెక్టర్‌ (క్రైమ్‌) షాజానంద్‌ శ్రీవాస్తవ తెలిపారు.

ఈ కేసుపై రాయ్ తీవ్రంగా స్పందిస్తూ ఎబివిపి భయానికి చిహ్నమే ఈ కేసు అని పేర్కొన్నారు. దీంతో ఈ వేధింపులకు ఎవరు పాల్పడ్డారనే అంశం వెల్లడైందని, బిహెచ్‌యు ఎబివిపి డెన్‌లాగా మారిందని, బయటి వ్యక్తులను కూడా క్యాంపస్‌లోకి అనుమతిస్తున్నారని మండిపడ్డారు.

 
ఈ ఘటనపై విద్యార్థిని ఫిర్యాదు మేరకు వారణాసిలోని లంక పోలీస్‌ స్టేషన్‌లో ఐపిసి సెక్షన్‌ 354 తో పాటు ఐటి చట్టం కింద కేసు నమోదు చేసినట్లు పోలీసులు వెల్లడించారు. ఈ ఘటనపై   రాజ్‌పుతానా హాస్టల్‌ దగ్గర వందలాది మంది విద్యార్థులు నిరసనలు చేపట్టారు. బయటి వ్యక్తులు ఈ ఘటనకు పాల్పడినట్లు అనుమానిస్తున్నారు.  బయటి వ్యక్తులు క్యాంపస్‌లోకి రాకుండా నిషేధం విధించాలని విద్యార్థులు డిమాండ్‌ చేస్తున్నారు.    
 
బిహెచ్ యు  క్యాంపస్‌ నుంచి ఐఐటి  క్యాంపస్‌ను వేరు చేయాలని, మధ్యలో గొడ కట్టాలని విద్యార్థులు డిమాండ్‌ చేస్తున్నారు.  యూనివర్సిటీలో సెక్యూర్టీని పటిష్టం చేస్తామని, మరిన్ని సిసిటివిలను ఏర్పాటు చేయనున్నట్లు రిజిస్ట్రార్‌ తెలిపారు. రాత్రి 10 నుంచి ఉదయం 5 గంటల వరకు విద్యార్థుల కదలికలపై కూడా ఆంక్షలు విధించనున్నట్లు వెల్లడించారు.