నేపాల్‌లో భారీ భూకంపం.. 140 మంది మృతి

హిమాలయ దేశం నేపాల్‌లో భారీ భూకంపం వచ్చింది. శుక్రవారం అర్ధరాత్రివేళ 11.32 గంటలకు భూమి కంపించింది. దీని తీవ్రత 6.4గా నమోదయిందని నేషనల్‌ ఎర్త్‌క్వేక్‌ మెజర్‌మెంట్‌ సెంటర్‌ తెలిపింది. దేశ రాజధాని ఖాట్మండ్‌లో 400కి.మీల దూరంలో ఉన్న జాజర్‌కోట్‌ జిల్లాలోని లామిదండా ప్రాతంలో భూకంప కేంద్రం ఉన్నదని వెల్లడించింది.
 
భూఅంతర్భాగంలో 10 కిలోమీటర్ల లోతులో కదలికలు సంభవించాయని పేర్కొంది. నెల రోజుల వ్యవధిలో నేపాల్‌లో భూకంపం రావడం ఇది మూడోసారి. నేపాల్ రాజ‌ధానితో పాటు భార‌త్‌లోని ప‌లు ప్రాంతాల్లో తీవ్ర స్థాయిలో భూ ప్ర‌కంప‌న‌లు న‌మోదు అయ్యాయి. ఢిల్లీలో కూడా ప్ర‌కంప‌న‌లు వ‌చ్చాయి. జాజ‌ర్‌కోట్ ఆస్ప‌త్రి గాయ‌ప‌డ్డ‌వారితో నిండిపోయింది.
 
భూకంపం ధాటికి చాలా ఇండ్లు నేలమట్టమయ్యాయి. పలు ఇండ్లు ధ్వంసమయ్యాయి. ఇప్పటివరకు 140 మంది మరణించారని అధికారులు వెల్లడించారు. వంద మందికి పైగా గాయపడ్డారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని తెలిపారు. ప్రస్తుతం సహాయక చర్యలు కొనసాగుతున్నాయని తెలిపారు.విద్యుత్తు వ్యవస్థ దెబ్బతింది. సమాచార వ్యవస్థ కూడా పనిచేయడం లేదు. 
 
మృతుల్లో జాజర్‌కోట్‌ జిల్లాకు చెందినవారు 34 మంది ఉండగా, పశ్చిమ రుకుమ్‌ జిల్లాలో మరో 35 మంది ఉన్నారు. భారీగా ఇళ్లు కుప్పకూలిపోవడంతో.. ఇళ్ల కింద చిక్కుకున్న వారిని రెస్క్యూ సిబ్బంది బయటకు తీసి చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలిస్తున్నారు. అర్థరాత్రి ప్రజలు నిద్రిస్తున్న సమయంలో భూకంపం సంభవించడంతో ప్రాణనష్టం భారీగా ఉండే అవకాశం ఉంది.
 
కాగా, మృతుల కుటుంబాలకు నేపాల్‌ ప్రధాని పుష్ప కమల్‌  సంతాపం తెలిపారు. దేశంలోని మూడు భద్రతా సంస్థలు రెస్క్యూ ఆపరేషన్‌లో పాల్గొంటున్నాయని, బాధితులను రక్షించేందుకు ప్రయత్నిస్తున్నాయని చెప్పారు. దైలేఖ్‌, సల్యాన్‌, రొల్పా జిల్లాల్లో కూడా పలువురు మృతిచెందారని, ఆస్తి నష్టం సంభవించిందని చెప్పారు.
 
నేపాల్‌లో గత నెల 3న 6.3 తీవ్రతతో భారీ భూకంపం వచ్చింది. దీనివల్ల భారత్‌లోని ఢిల్లీ- రాజధాని ప్రాంతంలో కూడా కదలికలు సంభవించాయి. 800 కి.మీ దూరంలో ఉన్న ఢిల్లీలో కూడా స్వల్ప భూప్రకంపనలు చోటుచేసుకున్నాయి.  నేపాల్‌లో 2015లో 7.8 తీవ్రతతో వచ్చిన భూకంపం వల్ల 12 వేల మంది మరణించారు. పది లక్షలకుపైగా నిర్మాణాలు ధ్వంసమయ్యాయి. 
మరోవైపు, నేపాల్ లో సంభవించిన భూకంపం.. ఢిల్లీ, యూపీ, బీహార్ రాష్ట్రాలను కూడా తాకింది. ఢిల్లీలో 15 సెకన్ల పాటు భూమి కంపించడంతో ప్రజలు భయాందోళనకు గురయ్యారు. ఏం జరుగుతుందో తెలియక భయంతో ఇళ్ల నుంచి బయటికి పరుగులు పెట్టారు.
 
నేపాల్ భూకంప మృతి ప‌ట్ల భార‌త ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ విచారం వ్య‌క్తంచేశారు. నేపాల్ ప్ర‌జ‌ల‌కు సంఘీభావంగా భార‌త్ నిలుస్తుంద‌ని ఆయ‌న త‌న ఎక్స్ సోష‌ల్ మీడియా అకౌంట్‌లో తెలిపారు. అన్ని ర‌కాలుగా ఆ దేశాన్ని ఆదుకుంటామ‌న్నారు. బాధిత కుటుంబాలకు ఆయ‌న సంతాపం వ్య‌క్తం చేశారు. గాయ‌ప‌డ్డ వారు త్వ‌ర‌గా కోలుకోవాల‌ని ఆయ‌న ఆకాంక్షించారు.