కాళేశ్వరంపై  సిబిఐ లేదా న్యాయ విచారణకు ఆదేశించాలి

కాళేశ్వరం ప్రాజెక్టుపై సిబిఐ లేదా న్యాయ విచారణకు ఆదేశించాలని బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు, కేంద్రమంత్రి జి. కిషన్‌రెడ్డి కోరారు. ఎన్నికల సందర్భంగా బిజెపి మీడియా సెంటర్ ను  శుక్రవారం  హోటల్ కత్రియలో మాజీ కేంద్ర మంత్రి, తెలంగాణ బిజెపి ఎన్నికల ఇన్ ఛార్జ్ ప్రకాష్ జవదేకర్ తో కలిసి ప్రారంభించిన సందర్భంగా మాట్లాడుతూ  పిల్లర్లు కుంగిపోవడంపై కేసీఆర్ నైతిక బాధ్యత వహించాలని స్పష్టం చేశారు. 
 
రూ.1.20 లక్షల కోట్ల నిధులతో కాళేశ్వరం ప్రాజెక్టును కమీషన్ల కోసమే కట్టారా?  అని ప్రశ్నించారు. కుంగుబాటుతో కాళేశ్వరం భవిష్యత్‌ ప్రశ్నార్థకంగా మారిందని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రాజెక్ట్ కుంగిన వెంటనే కేంద్ర జలశక్తి శాఖకు ఫిర్యాదు చేశానాని చెబుతూ ప్రజల సొమ్ముతో కడుతున్న ప్రాజెక్ట్‌ నాణ్యతను పట్టించుకోకపోతే ఎలా? అని రాష్ట్ర ప్రభుత్వాన్ని నిలదీశారు. 
 
కేంద్రం నుంచి ఆరుగురు సభ్యుల బృందం వచ్చి మేడిగడ్డను పరిశీలించిందని,  రాష్ట్ర ప్రభుత్వం 11 అంశాల మీద మాత్రమే వివరాలు ఇచ్చిందని, కేంద్ర బృందం అడిగిన అన్ని అంశాలపై రాష్ట్రం వివరాలు ఇవ్వలేదని, క్వాలిటీ కంట్రోల్‌ రిపోర్ట్ అడిగితే కూడా రాష్ట్ర అధికారులు ఇవ్వలేదని ధ్వజమెత్తారు. అంతర్జాతీయ స్థాయి ప్రాజెక్ట్ కట్టామని చెప్పిన ప్రభుత్వం వివరాలు లేవనడం హాస్యాస్పదమని విమర్శించారు. 
 
సీఎం కేసీఆర్ సూపర్ ఇంజనీర్‌గా మారి ప్రాజెక్ట్ నిర్మాణం చేపట్టారని, ఇంజనీర్లను లెక్కచేయకుండా ఇష్టారాజ్యంగా ప్రాజెక్ట్ నిర్మాణం చేపట్టారని కిషన్ రెడ్డి ఎద్దేవా చేసారు. మేడిగడ్డ నుంచి ఇప్పటికే 10 టీఎంసీల నీరు వృధాగా వదిలారని చెప్పారు. శనివారం రేపు కాళేశ్వరం ప్రాజెక్టు పర్యటనకు వెళ్తున్నట్లు తెలిపారు.
 
కాళేశ్వరం ప్రాజెక్టును ప్రతిష్టాత్మకంగా కట్టినట్లు బీఆర్ఎస్ చెప్పుకుందని, డిస్కవరీ ఛానల్లో కూడా కాళేశ్వరంపై ప్రచారం చేసుకున్నారని చెబుతూ  ప్రజాధనం మొత్తం రాళ్లు, నీళ్ల పాలయిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ హయాంలో రూ. 30 వేల కోట్లతో ప్రాజెక్టును ప్రారంభించగా, కేసీఆర్ రీ డిజైన్ పేరిట రూ. 1.30 లక్షల కోట్లతో కాళేశ్వరం నిర్మించారని చెప్పారు.
 
ఇంజినీరింగ్ మార్వలెస్ అని గొప్పలు చెప్పుకున్న ప్రాజెక్టు తెలంగాణకు గుదిబండగా మారిందని, కట్టిన నాలుగేళ్లకే పిల్లర్లు కుంగిపోయాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఆ పిలర్లను తొలగించి వాటి స్థానంలో కొత్తవి నిర్మించాల్సి ఉందని నిపుణులు చెబుతున్నారని, లేదంటే ప్రాజెక్టు పూర్తిగా ధ్వంసమయ్యే అవకాశం ఉందని వారు చెబుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. 
 
దీనిపై రాష్ట్ర ప్రభుత్వం సమాధానం చెప్పలేని పరిస్థితి ఉందని, కేసీఆర్ కాళేశ్వరంపై నోరు మెదపడం లేదని తెలిపారు. కాంట్రాక్టు ఎవరికిచ్చారు? ఎంత ఖర్చయింది అనే అంశాలపై కూడా స్పష్టత ఇవ్వలేదని కిషన్‌రెడ్డి విమర్శించారు.  ప్రాజెక్టు ద్వారా రైతుకు ఎకరాకు వచ్చేది రూ. 40 వేలు అయితే, ప్రాజెక్టు నిర్వహణకు ఎకరాకు రూ. 85 వేలు ఖర్చు అవుతోందని తెలిపారు.
 
ఇంత వ్యత్యాసం ఉందంటే.. ఈ ప్రాజెక్టును కమీషన్ల కోసం కట్టినట్లా? కాంట్రాక్టర్ల కోసం కట్టినట్లా?  అని ప్రశ్నించారు. లో క్వాలిటీ సాండ్ మెటీరియల్ వాడారని నిపుణుల నివేదికలో తేలిందని తెలిపారు. ఈ ప్రాజెక్ట్ నిర్మాణంలో జరిగిన లోపాలకు బాధ్యులు ముఖ్యమంత్రి అయినా, కాంట్రాక్టర్లు అయినా వందకు వందశాతం చర్యలు తీసుకుంటామని కేంద్ర మంత్రి హెచ్చరించారు. రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చాక పూర్తిస్థాయిలో దర్యాప్తు చేపడుతామని స్పష్టం చేశారు.