విజయవాడ కేంద్రంగా రీజనల్ పాస్‌పోర్టు కార్యాలయం

విదేశాలకు వెళ్లే వారికోసం పాస్‌పోర్టుసేవలు మరింత సులభతరం చేసే క్రమంలో అతి త్వరలో మరో రీజినల్ పాస్‌పోర్టు కార్యాలయాన్ని ప్రారంభిస్తున్నట్లు విజయవాడ రీజినల్ పాస్‌పోర్టుఅధికారి శివహర్ష ప్రకటించారు. ప్రస్తుతమున్న పాస్‌పోర్టు సేవా కేంద్రానికి అదనంగా బందర్ రోడ్ లో మరో రీజినల్ పాస్‌పోర్టు కార్యాలయం ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. 
 
ప్రస్తుతం మారుతున్న సాంకేతిక పరిజ్ఞానంతో రీజనల్  పాస్‌పోర్టు సేవా కేంద్రానికి సాంకేతిక పరిజ్ఞానాన్ని జోడిస్తున్నామని చెప్పారు.  త్వరితగతిన పాస్‌పోర్టు అందించేందుకు అవసరమైన అన్ని చర్యలు పకడ్బందీగా తీసుకుంటున్నట్లు తెలిపారు. ప్రస్తుతం రోజుకు రెండు వేలకు పైగా అప్లికేషన్ల వస్తున్నట్లు చెప్పిన ఆయన అక్టోబర్ నెల ఆఖరి వరకు 3 లక్షలకు పైగా పాస్ పోర్టులను జారీ చేసినట్లు తెలిపారు.
 
పోస్టల్, పోలీస్ శాఖల భాగస్వామ్యంతో పాస్‌పోర్టును త్వరితగతిన అందించే ఏర్పాటు చేశామని పేర్కొన్నారు. ఇకనుండి విజయవాడ రీజినల్ ఆఫీస్ కేంద్రంగానే పాస్‌పోర్టు ప్రింటింగ్ ప్రారంభమవుతుందని వెల్లడించారు. విజయవాడ కేంద్రంగా మరో కార్యాలయం ప్రారంభం అవడంతో పాస్‌పోర్టు సేవలు సులభతరమై వినియోగదారులకు త్వరితగతిన పాస్‌పోర్టు అందే సౌలభ్యం కలుగుతుందని చెప్పారు. 
 
ఇప్పటి వరకు ప్రాంతీయ పాస్‌ పోర్టు కార్యాలయం లేకపోవటం వల్ల పాస్‌పోర్టుల ముద్రణ, డిస్పాచ్‌ అంతా విశాఖపట్నంలోనే జరుగుతోంది. కేంద్రం విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ తీసుకున్న నిర్ణయం మేరకు విజయవాడకు ఎట్టకేలకు ప్రాంతీయ కార్యాలయం మంజూరైంది. ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం పరిపాలనా రాజధానిని విశాఖకు తరలించే ప్రయత్నంలో ఉండగా కేంద్ర ప్రభుత్వం విజయవాడకు ప్రాంతీయ పాస్‌పోర్టు కార్యాలయాన్ని మంజూరు చేసింది. 
 
విజయవాడ ప్రాంతీయ పాస్‌పోర్టు కేంద్రం పరిధిలోని విజయవాడ, తిరుపతిలలోని ప్రాంతీయ పాస్‌పోర్టు సేవా కేంద్రాలతో పాటు 13 పోస్టాఫీసు పాస్‌పోర్టు సేవా కేంద్రాల (పీఓపీఎస్‌కే)లలో కలిపి ఇప్పటి వరకు 3 లక్షల పాస్‌పోర్టుల దరఖాస్తులను స్వీకరించటం జరిగింది. రోజుకు సగటున 2 వేల పాస్‌పోర్టు దరఖాస్తులను స్వీకరించటం జరుగుతోంది. 
 
కరోనా సమయంలో పేరుకుపోయిన అప్లికేషన్లను శరవేగంగా క్లియర్‌ చేయటం జరిగింది. పాస్‌పోర్టు దరఖాస్తులకు సంబంధించి రాష్ట్రంలోనే విజయవాడకు అత్యంత డిమాండ్‌ ఉంది. కొత్త సంవత్సరంలో విజయవాడ పాస్‌పోర్టు కార్యాలయం పనిచేయడం ప్రారంభిస్తుంది.