మార్చిలో ఏపీ ఎన్నికల నోటిఫికేషన్ వచ్చే అవకాశం

ఆంధ్రప్రదేశ్ ఓటర్ల జాబితా ముసాయిదా విడుదలైంది. శుక్రవారం సాయంత్రం రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా ఓటర్ల జాబితా డ్రాఫ్ట్ విడుదల చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఏపీ అసెంబ్లీ ఎన్నికలకు మార్చిలో నోటిఫికేషన్‌ వచ్చే అవకాశం ఉందని తెలిపారు. తాజా జాబితా ప్రకారం రాష్ట్రంలో మొత్తం 4,02,21,450 మంది ఓటర్లు ఉన్నారు.
ఇందులో మార్పుచేర్పులు అనంతరం 2024 జనవరి 5 నాటికి పూర్తి స్థాయి ఓటర్ల జాబితా రూపొందిస్తామని చెప్పారు. ఓటర్ల జాబితాలో కొత్త ఓటర్లను చేర్చడం, మరణించిన వారి ఓట్లు తొలగింపు, ఓట్లు బదిలీ వంటి చర్యలు చేపట్టామని వివరించారు.  ఓటర్ల జాబితా ముసాయిదాను ఎన్నికల సంఘం వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచామని చెప్పారు.
ఎవకైనా అభ్యంతరాలుంటే డిసెంబర్ 9 లోపు తెలియజేయవచ్చని పేర్కొన్నారు. డిసెంబర్ 26 నాటికి జాబితాలో సమస్యలు పరిష్కరించి, వచ్చే ఏడాది జనవరి 5న తుది ఓటర్ల జాబితా ప్రకటిస్తామని వెల్లడించారు. రాష్ట్రంలో సుమారు 10 లక్షల బోగస్ ఓట్లను తొలగించామని సీఈవో ముఖేష్ కుమార్ మీనా తెలిపారు. రాజకీయ పార్టీలు లేవనెత్తిన అభ్యంతరాలను పరిశీలించామని చెబుతూ మొత్తం ఆరు అంశాల ఆధారంగా అభ్యంతరాలు పరిశీలిస్తున్నామని తెలిపారు. ఫేక్ ఓట్ల తొలగింపు ప్రక్రియ నిరంతరం కొనసాగుతుందని స్పష్టం చేశారు.

తెలంగాణ, ఏపీ రెండు చోట్లు ఓటు వేస్తున్నారని తమ దృష్టికి వచ్చిందని చెప్పారు. ఓటు బదిలీ చేసుకుంటేనే వారికి అవకాశం ఇవ్వాలని ఆదేశించామని తెలిపారు. అయితే రెండు రాష్ట్రాలో ఓటు హక్కు ఉన్న విషయాన్ని గుర్తించే సాఫ్ట్‌వేర్‌ అందుబాటులో లేదని, ఏపీలో ఉన్నవాటిని గుర్తించే సాఫ్ట్‌వేర్‌ మాత్రమే అందుబాటులో ఉందని పేర్కొన్నారు. 

ఓటర్ల జాబితా సవరణలో ఎవరైనా అక్రమాలకు పాల్పడినట్లు తమ దృష్టికి వస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఆన్‌లైన్‌ లో ఫిర్యాదు చేసిన స్పందిస్తామని చెప్పారు. భెల్‌ కంపెనీ రూపొందించిన ఈవీఎంలు వచ్చాయని, వీటి పనితీరును రాజకీయ పార్టీల సమక్షంలో పరిశీలిస్తామని తెలిపారు.

డిసెంబర్ 9 వరకు కొత్త ఓటర్ల నమోదు

ఓటర్ల జాబితా డ్రాఫ్ట్ పై అభ్యంతరాలు, సవరణలకు డిసెంబరు 9వ తేదీ వరకు అవకాశం ఇచ్చామని మీనా తెలిపారు. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలోని పోలింగ్‌ బూత్‌ ల వద్ద ఇందుకు రెండు సార్లు ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించి అభ్యంతరాలు స్వీకరిస్తామని చెప్పారు. నవంబరు 4, 5, డిసెంబరు 2, 3 తేదీల్లో ప్రత్యేక కార్యక్రమం నిర్వహిస్తామని వివరించారు. 

ఈ కార్యక్రమాల్లో ఓటర్ల అభ్యంతరాలు, సవరణలకు దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు. అదే విధంగా కొత్త ఓటర్ల నమోదుకు అవకాశం కల్పిస్తున్నట్లు స్పష్టం చేశారు. ఈ ఏడాది జనవరి 1 నాటికి 18 ఏళ్ల వయసు నిండిన వారు డిసెంబరు 9 వరకు ఓటు హక్కుకు దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు. అదేవిధంగా 2024 ఏప్రిల్‌ లేదా జులై లేదా అక్టోబరు 1వ తేదీనాటికి 18 ఏళ్లు నిండిన వారైనా ఓటు హక్కు కోసం ముందస్తు దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. ఆన్ లైన్ కూడా దరఖాస్తు చేసుకోవచ్చని సూచించారు.