విజయనగరం జిల్లాలో రెండు రైళ్లు ఢీ..15 మంది మృతి

విజయనగరం జిల్లాలో ఘోర రైలు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఇప్పటి వరకు 15 మంది మరణించారు. సుమారు వంద మంది ప్రయాణీకులకు గాయాలు అయ్యాయి. విశాఖ నుంచి పలాస వెళ్తున్న ప్రత్యేక ప్యాసింజర్‌ రైలు కొత్తవలస మండలం అలమండ-కంటకాపల్లి వద్ద సిగ్నల్‌ లేకపోవడంతో పట్టాలపై ఆగి ఉంది. 
అదే సమయంలో దాని వెనకాలే వస్తున్న విశాఖ- రాయగడ రైలు ప్యాసింజర్‌ రైలును ఢీ కొట్టింది. రైలు ప్రమాదంపై రైల్వే బోర్డు గ్రూపులో డీఆర్‌ఎం సౌరబ్ ప్రసాద్‌ సమాచారం ఇచ్చారు. ఘటనా స్థలంలో ఆరుగురు మృతి చెందగా ఆస్పత్రులకు తరలించే సరికి మరికొందరు ప్రాణాలు కోల్పోయారు. కొత్తవలస మండలం కంటకాపల్లి- అలమండ మధ్య రాత్రి ఏడు గంటల సమయంలో ట్రాక్‌పై ఉన్న రైలును వెనకనుంచి మరో రైలు ఢీకొట్టింది. ఈ ఘటనలో మూడు బోగీల్లో ప్రయాణిస్తున్న 15 మంది దుర్మరణం చెందారు. 40 మందికి గాయాలయ్యాయని అధికార వర్గాలు ప్రకటించాయి.

విశాఖపట్నం నుంచి విజయనగరం వైపు బయలుదేరిన విశాఖపట్నం-పలాస (08532) రైలును వెనుక నుంచి కొద్ది నిమిషాల తేడాతో ప్రారంభమైన విశాఖపట్నం-రాయగడ ప్యాసింజర్‌ (08504) రైలు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో రాయగడ ప్యాసింజర్‌ రైల్లోని బోగీలు పూర్తిగా ధ్వంసం అయిపోయాయి. మరికొన్ని బోగిలు పట్టాలు తప్పాయి.

కంటకాపల్లి- అలమండ వద్దకు రాగానే సిగ్నల్‌ కోసం పలాస ప్యాసింజర్‌ పట్టాలపై నెమ్మదిగా వెళుతూ 848 కి.మీ.వద్ద ట్రాక్‌పై నిలిచింది. ఓవర్ హెడ్‌ ఎలక్ట్రిఫికేషన్‌ కేబుల్ సమస్య రావడంతో పలాస ప్యాసింజర్‌ నెమ్మదిగా వెళుతున్నట్లు రైల్వే వర్గాలు తెలిపాయి. అదే సమయంలో ఆ మార్గంలో వెనుక నుంచి వచ్చిన రాయగడ రైలు ఢీకొట్టినట్లు అందులోని ప్రయాణికులు చెబుతున్నారు.

ఈ ఏడాది జూన్‌లో జరిగిన ఒడిశాలోని బాలేశ్వర్‌ రైలు ప్రమాద సంఘటన తరహాలోనే విజయనగరం ప్యాసింజర్‌ రైళ్ల ప్రమాదం జరిగింది. ఒకే ట్రాక్‌పై రెండు రైళ్లు దూసుకురావడంతో ముందు ఉన్న రైలును వెనుక రైలు ఢీకొట్టింది. పలాస గార్డు బోగీని రాయగడ ఇంజిను ఢీకొట్టడంతో ఆ రెండు నుజ్జయ్యాయి. రైలు వేగానికి రాయగడ బోగీలు ఏకంగా అదే రైలు ఇంజినుపైకి దూసుకెళ్లాయి. అదే సమయంలో పక్కన గూడ్సు రైలు వెళుతోంది.

ప్రమాదం సమయంలో రాయగడ రైలుకు చెందిన కొన్ని బోగీలు గూడ్సు రైలును ఢీకొన్నాయి. రెండు ప్యాసింజర్‌, గూడ్సు రైళ్లలో కలిపి ఏడు బోగీలు పూర్తిగా ధ్వంసం అయ్యాయి. విశాఖ-రాయగడ రైలులోని దివ్యాంగుల బోగీ పట్టాలు తప్పి పొలాల్లో పడింది. దాని వెనుక ఉన్న డీ-1 బోగి వేగానికి కొంత భాగం విరిగి పైకి లేచిపోయింది.

పలాస, రాయగడ ప్యాసింజర్‌ రైళ్లలో సుమారు 1400 మంది ప్రయాణికులు ఉన్నట్లు తెలుస్తోంది. ఘటనా ప్రాంతంలో సహాయ చర్యల్లో పాల్గొన్న సిబ్బంది అంచనాల ప్రకారం ప్రయాణికులతో ఉన్న బోగీలు పూర్తిగా ధ్వంసం కావడంతోమృతుల సంఖ్య భారీగా పెరిగే అవకాశం ఉందని తెలుస్తోంది.