ఇంగ్లండ్‍ను కుప్పకూల్చిన టీమిండియా బౌలర్లు

* ప్రపంచ కప్ లో వరుసగా ఆరో గెలుపు
 
భారత బౌలర్లు అద్భుత ప్రదర్శన చేశారు. ఇంగ్లండ్ బ్యాటింగ్‍ను కుప్పకూల్చి టీమిండియాకు ఘన విజయాన్ని అందించారు. దీంతో ప్రస్తుత వన్డే ప్రపంచకప్‍లో భారత్ వరుసగా ఆరో విజయాన్ని సాధించింది. వరల్డ్ కప్‍లో భాగంగా లక్నోలో ఆదివారం జరిగిన మ్యాచ్‍లో భారత్ 100 పరుగుల తేడాతో డిఫెండింగ్ ఛాంపియన్ ఇంగ్లండ్‍పై అద్భుత విజయాన్ని సాధించింది.

230 పరుగులు మోస్తరు టార్గెట్‍ను కాపాడుతూ టీమిండియా బౌలర్లు ఇంగ్లండ్‍ను గడగడలాడించారు. భారత బౌలర్ల ధాటికి ఇంగ్లండ్ 34.5 ఓవర్లలో 129 పరుగులకే ఆలౌటైంది. దీంతో భారత్ 100 పరుగుల  తేడాతో గెలిచింది. భారత పేసర్ మహమ్మద్ షమీ నాలుగు వికెట్లతో అదరగొట్టగా, జస్‍ప్రీత్ బుమ్రా మూడు వికెట్లు పడగొట్టాడు. స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ రెండు, రవీంద్ర జడేజా ఓ వికెట్ తీశారు. 

ఇంగ్లండ్ బ్యాటర్లలో లియామ్ లివింగ్‍స్టోన్ (27) మాత్రమే కాసేపు నిలిచాడు. మిగిలిన ఇంగ్లిష్ బ్యాటర్ ఎవరూ కనీసం 20 పరుగులు కూడా చేయలేకపోయారు. అంతలా భారత బౌలర్ల ఆధిపత్యం సాగింది. అంతకు ముందు తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ 50 ఓవర్లలో 9 వికెట్లకు 229 పరుగులు చేసింది. 

రోహిత్ శర్మ (87), సూర్యకుమార్ యాదవ్ (49) రాణించారు. ఇంగ్లండ్ బౌలర్లలో డేవిడ్ విల్లే మూడు, క్రిస్ వోక్స్, ఆదిల్ రషీద్ చెరో రెండు వికెట్లు తీశారు. ఈ గెలుపుతో ఈ వన్డే ప్రపంచకప్‍లో వరుసగా ఆరో విజయాన్ని నమోదు చేసుకుంది భారత్. 12 పాయింట్లతో ప్రస్తుతం పాయింట్ల పట్టికలో టాప్ ప్లేస్‍కు చేరింది రోహిత్ సేన. 

ఇక, డిఫెండింగ్ చాంపియన్ ఇంగ్లండ్ ఐదో పరాజయంతో సెమీస్ రేసు నుంచి ఔట్ అయింది. పాయింట్ల పట్టికలో అట్టడుగున కొనసాగింది.  భారత బౌలర్ల విజృంభణతో 230 పరుగుల లక్ష్య ఛేదనలో ఇంగ్లండ్ వణికిపోయింది. బారత పేసర్లు మహమ్మద్ షమీ (4/22), జస్‍ప్రీత్ బుమ్రా (3/32) ధాటికి ఇంగ్లిష్ బ్యాటర్లు బెంబేలెత్తిపోయారు.

ఇంగ్లాండ్ ఓపెనర్ డేవిడ్ మలన్ (16), స్టార్ ప్లేయర్ జో రూట్ (0)ను వరుస బంతుల్లో ఔట్ చేసి దెబ్బ తీశాడు భారత పేసర్ జస్‍ప్రీత్ బుమ్రా. బెన్ స్టోక్స్ (0), జానీ బెయిర్ స్టో (14)ను ఔట్ చేసి ఇంగ్లిష్ జట్టును చావు దెబ్బకొట్టాడు టీమిండియా స్టార్ పేసర్ మహమ్మద్ షమీ. దీంతో 39 పరుగులకే 4 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో కూరుకుంది ఇంగ్లాండ్. 

జోస్ బట్లర్ (10)ను భారత స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ అద్భుతమైన బంతితో బౌల్డ్ చేశాడు. ఆ తర్వాత ఇంగ్లాండ్ వరుసగా వికెట్లు కోల్పోయింది. కాసేపు పోరాడిన లియామ్ లివింగ్ స్టోన్ (27)ను కూడా కుల్దీప్ ఔట్ చేశాడు. మిగిలిన ఇంగ్లండ్ బ్యాటర్లు కూడా ఎక్కువ సేపు నిలువలేకపోయారు. దీంతో 34.5 ఓవర్లలో 129 పరుగులకే ఇంగ్లాండ్ ఆలౌటైంది.

అంతకు ముందు తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ 50 ఓవర్లలో 9 వికెట్లకు 229 పరుగులు చేసింది. టీమిండియా వరుసగా వికెట్లు కోల్పోగా భారత కెప్టెన్ రోహిత్ శర్మ అద్భుత అర్ధ శకతం చేశాడు. జట్టును ఆదుకొని పోరాడే స్కోరు అందించాడు. సూర్యకుమార్ యాదవ్ (49), చివర్లో జస్‍ప్రీత్ బుమ్రా (16 నాటౌట్) రాణించారు. ఈ ప్రపంచకప్‍లో టీమిండియా తదుపరి శ్రీలంకతో గురువారం (నవంబర్ 2) తలపడనుంది.