ఉత్తర గాజాలోని పలు ప్రాంతాలపై ఇజ్రాయిల్ భూతాల యుద్ధం

ఇజ్రాయిల్ భూతాల యుద్ధం ప్రారంభించి గాజా స్ట్రిప్ వ‌ద్ద ఉన్న ఉత్త‌ర ప్రాంతంలోకి త‌మ యుద్ధ ట్యాంకులు వెళ్లిన‌ట్లు ఇస్రాయిల్ ర‌క్ష‌ణ ద‌ళాలు ఇవాళ పేర్కొన్నాయి. కొన్ని టార్గెట్ చేసిన ప్ర‌దేశాల్లోకి రాత్రి పూట ఆ ట్యాంకులు వెళ్లిన‌ట్లు ఐడీఎఫ్ వెల్ల‌డించింది.  త‌మ ఆపరేష‌న్‌లో భాగంగా అనేక మంది ఉగ్ర‌వాదుల‌ను, హ‌మాస్ మౌళిక స‌దుపాయాల్ని, యాంటీ ట్యాంక్ గైడెడ్ మిస్సైల్ లాంచింగ్ ప్ర‌దేశాల్ని టార్గెట్ చేసిన‌ట్లు ఐడీఎప్ పేర్కొన్న‌ది.
హ‌మాస్ ఉగ్ర‌వాదుల‌తో పోరుకు దిగిన ఇజ్రాయిల్ బోర్డ‌ర్ వ‌ద్ద యుద్ధ ట్యాంకుల‌తో రెయిడ్ నిర్వ‌హిస్తున్న‌ట్లు వెల్ల‌డించింది.  పూర్తి స్థాయిలో అక్క‌డ గ్రౌండ్ ఆప‌రేష‌న్ చేప‌ట్ట‌నున్న‌ట్లు తెలిపింది. రెయిడ్ చేసిన త‌ర్వాత మ‌ళ్లీ యుద్ధ ట్యాంకులు ఆ ప్ర‌దేశాన్ని వీడిన‌ట్లు ఐడీఎఫ్ పేర్కొన్న‌ది. హమాస్‌కు చెందిన మొత్తం 250 స్థావరాలపై యుద్ధ ట్యాంకులతో దాడులు చేసినట్లు ఇజ్రాయెల్ రక్షణ దళం( ఐడిఎఫ్) తెలిపింది. 
 
మౌలిక సదుపాయాలు, కమాండ్ సెంటర్లు సొరంగాలు, రాకెట్ లాంచర్లే లక్షంగా ఈ దాడులు జరిగినట్లు తెలిపింది. గాజాలో ఇంధన నిల్వలు నిండుకున్నాయని ఐక్యరాజ్య సమితి హెచ్చరించిన కొద్ది గంటలకే ఇజ్రాయెల్ ఈ దాడులు చేయడం గమనార్హం. ఇజ్రాయెల్ సైన్యాలు గాజాపై భూతల దాడులకు దిగడం ఇది రెండోసారి.
 
గాజాలోని మిలిటరీ స్థావరాలే లక్ష్యంగా ఈ దాడులు జరిగినట్లు ఇజ్రాయెల్ సైన్యం వెల్లడించింది. అత్యధిక జనసాంద్రత కలిగిన గాజాలో పౌర నివాసాలనుంచే హమాస్ ఉగ్ర కార్యకలాపాలు కొనసాగిస్తున్నట్లు ఐడిఎఫ్ ఆరోపిస్తోంది. నివాసాల మధ్యే రాకెట్ లాంచర్లు ఉన్నట్లు పేర్కొంది. అయితే ఈ దాడుల్లో ఇరువైపులా ప్రాణనష్టానికి సంబంధించి ఎలాంటి సమాచారం తెలియరాలేదు.
 
దాడి చేసిన అనంతరం తమ యుద్ధ ట్యాంకులు క్షేమంగా తిరిగి వచ్చాయని ఇజ్రాయెల్ రక్షణ దళాల ప్రతినిధి డేనియల్ హగారి చెప్పారు. తదుపరి యుద్ధ దశలకు సన్నాహకంగా ఈ దాడి జరిపినట్లు ఆయన తెలిపారు.ఈ దాడుల్లో ఇజ్రాయెల వైపు ఎవరూ చనిపోలేదని కూడా ఆయన చెప్పారు. ఇదిలా ఉండగా గాజాపై ఇజ్రాయెల్ జరుపుతున్న ప్రతి దాడుల్లో ఇప్పటివరకు 6,500 పాస్తీనియన్లు ప్రాణాలు కోల్పోయారని గాజా ఆరోగ్య శాఖ వెల్లడించింది.
 
కాగా, ఇజ్రాయెల్ జరుపుతున్న వైమానిక దాడుల్లో అమాయకులైన పౌరులు కూడా ప్రాణాలు కోల్పోతున్నారు. ఖతర్‌కు చెందిన అంతర్జాతీయ మీడియా సంస్థ ‘అల్ జజీరా’ గాజా బ్యూరో చీఫ్ వాయెల్ దాహ్‌దౌ భార్య, కుమారుడు, కుమార్తె, మనవడు వైమానిక దాడుల్లో మృతి చెందినట్లు ఆ చానెల్ వెల్లడించింది. గాజా, లెబ‌నాన్ స‌రిహ‌ద్దుల్లో ఉన్న ప్ర‌జ‌ల్ని త‌ర‌లించేందుకు డిసెంబ‌ర్ 31వ తేదీ వ‌ర‌కు అవ‌కాశం పొడిగించిన‌ట్లు తెలుస్తోంది.
హ‌మాస్‌తో జ‌రుగుతున్న యుద్ధం వ‌ల్ల సుమారు రెండు ల‌క్ష‌ల మంది ఇజ్రాయిలీలు తమ స్వ‌స్థ‌లాల్ని కోల్పోయిన‌ట్లు అంచ‌నా వేస్తున్నారు.  రాఫా వ‌ద్ద ఉన్న బోర్డ‌ర్ క్రాసింగ్‌ను ఓపెన్ చేయాల‌ని ఇజ్రాయిల్, వెస్ట్‌బ్యాంక్‌, ముస్లిం దేశాల్లో నిర‌స‌న‌లు చేప‌ట్టాల‌ని హ‌మాస్ ఉగ్ర‌వాదులు పిలుపు ఇచ్చారు. వైద్య ప‌రిక‌రాల‌తో కూడిన సుమారు 8 ట్ర‌క్కుల‌ను గాజాకు తీసుకువ‌చ్చేందుకు రెడ్‌క్రాస్ ప్ర‌య‌త్నాలు మొద‌లుపెట్టింది.