హేళన చేసినందుకే గజ్వేల్‌లో కేసీఆర్ పై పోటీ

తాను ఎమ్మెల్యేగా గెలవాలని గజ్వేల్ కు రావడం రాలేదని, హుజురాబాద్‌లో తన గెలుపు ఆపలేరని  హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ ధీమా వ్యక్తం చేశారు.  అయితే తనను హేళన చేసినందుకే గజ్వేల్‌కి వచ్చి కేసీఆర్‌పై పోటీకి దిగానని గజ్వేల్ విజయ శంఖారావం సభలో స్పష్టం చేశారు.
 
హుజురాబాద్ తో పాటు గజ్వేల్ లో కేసీఆర్ పై బీజేపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న రాజేందర్ గురువారం సరస్వతీ దేవి ఆలయంలో ప్రత్యేక పూజల అనంతరం మొదటిసారిగా ఎన్నికల సభలో మాట్లాడుతూ గజ్వేల్ ఎన్నికలు కురుక్షేత్ర యుద్ధం లాంటివని చెప్పారు. ఈ ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌కు ప్రజలే బుద్ధి చెబుతారన్నారు. ఎవరు ఎన్ని కుయుక్తులు పన్నినా గజ్వేల్‌లో బీజేపీ విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు.
 
గజ్వేల్‌కు తాను కొత్తకాదని చెబుతూ ఇక్కడ తొలి పౌల్ట్రీఫాం ఏర్పాటు చేసి తన జీవితం ప్రారంభించానని ఈటల తెలిపారు. తెలంగాణ ఉద్యమం తొలినాళ్లలో ఇక్కడే ఎక్కువగా తిరిగేవాడిని గుర్తు చేశారు. తెలంగాణ ఉద్యమంలో తన పాత్ర ఏంటో ప్రజలందరికీ తెలుసని చెబుతూ ఎమ్మెల్యేను అయ్యాక తెలంగాణతో పాటు అణగారినవర్గాల వారి కోసం కూడా పోరాడానని చెప్పారు.
 
ఇక్కడి ప్రజలతో తనకు 20 ఏళ్ల అనుబంధం ఉందని చెబుతూ పార్టీ కోసం పని చేసిన తనని మెడ పట్టి బయటకు గెంటారని కేసీఆర్ పై ధ్వజమెత్తారు.

తన నియోజకవర్గ ప్రజలు ఆశీర్వదిస్తే మళ్లీ ఎమ్మెల్యేగా గెలిచానని పేర్కొంటూ కేసీఆర్ మొఖం మీద తాను గెలవలేదని,  తన మొఖాన్ని చూసి ప్రజలు గెలిపించారని గుర్తు చేశారు. 
 
ప్రచార సమయంలో తాను ఏ ఊళ్లో నిద్రపోతే అక్కడ కరెంటు పోయేదని మండిపడ్డారు. కేసీఆర్ ప్రభుత్వంలో చిన్న చిన్న పోరగాళ్లు మద్యానికి బానిసవుతున్నారని ఈటల ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ ఊళ్లలో కుతిలేస్తే మందు బిళ్ళ దొరకకున్నా మందు సీసా మాత్రం దొరుకుతుందని ఈటల ఆరోపించారు. కెసిఆర్ తాగిపించి సంపాదించే సంపాదన వల్ల తెగిపడన పుస్తెలతాళ్ళు కనిపించడం లేదా అని ప్రశ్నించారు. రూ. 25 వేల కోట్లు ఇచ్చి రూ. 45 వేల కోట్లు తాగించి గుంజు కుంటున్నారన్నారని ఆరోపించారు.
5,800 మంది దళితుల భూములను కేసీఆర్ దోచుకున్నరన్నారని ఆరోపించారు.  తెలంగాణ ఏర్పడిన తర్వాత మున్సిపల్‌ కార్మికులు తొలిసారి ఆందోళనలు చేశారని, ఒక్క సంతకంతో మున్సిపల్‌ కార్మికులను సీఎం కేసీఆర్‌ తొలగించారని ఈటల ధ్వజమెత్తారు. ఉద్యమాలు, పోరాటాలకు పేరొందిన తెలంగాణలో అవి కనపడకుండా చేయాలని చూశారని ఈటల మండిపడ్డారు. 
 
ఉద్యమంలో కీలకపాత్ర పోషించిన ఆర్టీసీ కార్మికులను కేసీఆర్ అవమానించారని ఈటల ఆరోపించారు. ఇప్పుడు ఓట్ల కోసం ఆర్టీసీ కార్మకులను ప్రభుత్వ ఉద్వోగుల్లా గుర్తించారని విమర్శించారు ఈటల. గజ్వేల్‌లో ఏ పార్టీ అయినా సభ పెట్టుకోవచ్చునని, అయితే బీజేపీ నిర్వహించే సమావేశాలకు ప్రజలను రానీయకుండా చేసేందుకు బీఆర్‌ఎస్ నుంచి ప్రయత్నాలు జరుగుతున్నాయని ఈటల ఆరోపించారు. 
 
డబ్బులు ఇచ్చి ఆహ్వానాలు ఇవ్వకుండా ఆపుతున్నారని, హుజూరాబాద్ ఉప ఎన్నికల సమయంలోనూ ఇదే రీతిలో జరిగిందని విమర్శించారు. కానీ హుజూరాబాద్ ప్రజలు ఈ ప్రలోభానికి లొంగకుండా ఉద్యమ బిడ్డకు న్యాయం చేశారని చెబుతూ ఈసారి గజ్వేల్‌లోనూ అదే జరగనుందని స్పష్టం చేశారు. ప్రజాస్వామ్యాన్ని, ధర్మాన్ని కాపాడాలని గజ్వేల్ ప్రజలను కోరుతున్నట్లు తెలిపారు.