8 మంది భారత మాజీ నౌకాదళ అధికారులకు ఖతార్ కోర్టు మరణశిక్ష

ఇజ్రాయెల్‌కు గూఢచారులుగా పనిచేసినట్లు ఆరోపణలున్న 8 మంది భారత మాజీ నౌకాదళ అధికారులకు ఖతార్ కోర్టు మరణశిక్ష విధించింది. ఈ మేరకు గురువారం తీర్పు ఇచ్చింది. అయితే ఈ తీర్పు పట్ల చాలా దిగ్భ్రాంతికి గురైనట్లు భారత విదేశీ మంత్రిత్వ శాఖ తెలిపింది.  దీని గురించి ఖాతర్‌ ప్రభుత్వంతో మాట్లాడుతున్నామని, అవసరమైన అన్ని చట్టపరమైన చర్యలు తీసుకుంటామని పేర్కొంది. 
వారి కుటుంబ సభ్యులతోపాటు లీగల్‌ టీంతో సంప్రదింపులు జరుపుతున్నట్లు వెల్లడించింది.  ఏడాదికిపైగా వీళ్లంతా ఖతార్‌లోని జైలులో శిక్ష అనుభవిస్తున్నారు.
 
కాగా, భారత నేవీ మాజీ అధికారులైన కెప్టెన్ నవతేజ్ సింగ్ గిల్, కెప్టెన్ బీరేంద్ర కుమార్ వర్మ, కెప్టెన్ సౌరభ్ వశిష్ట్, కమాండర్ అమిత్ నాగ్‌పాల్, కమాండర్ పూర్ణేందు తివారీ, కమాండర్ సుగుణాకర్ పాకాల, కమాండర్ సంజీవ్ గుప్తా, సెయిలర్ రాగేష్‌ను 2022 ఆగస్ట్‌ 30న ఖతార్‌ ఇంటెలిజెన్స్‌ ఏజెన్సీ అధికారులు అరెస్ట్‌ చేశారు. 
 
ఖతార్‌ సాయుధ దళాలకు శిక్షణ, సేవలు అందించే ప్రైవేట్ సంస్థ దహ్రా గ్లోబల్ టెక్నాలజీస్ అండ్ కన్సల్టెన్సీ సర్వీసెస్ కోసం అక్కడ పనిచేసిన వీరంతా ఇజ్రాయెల్‌కు గూఢచారులుగా వ్యవహరించినట్లు ఖతార్‌ ఆరోపించింది. మరోవైపు 8 మంది భారత మాజీ నౌకాదళ అధికారుల తరుఫున చేసిన బెయిల్‌ అభ్యర్థనలను ఖతార్‌ కోర్టు తిరస్కరించింది. 
 
అలాగే వారి నిర్బంధాన్ని పలుసార్లు పొడిగించింది. చివరకు ఖతార్‌ ప్రధాన కోర్టు గురువారం తీర్పు వెల్లడించింది. 8 మంది భారత మాజీ నౌకాదళ అధికారులకు మరణ శిక్ష విధించింది. భారత విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ దీనిపై స్పందించింది. ఖతార్‌ కోర్టు తీర్పుపై చట్టపరంగా పోరాడేందుకు అన్ని చర్యలు చేపడతామని వెల్లడించింది.