కెనడా వాసులకు వీసాల జారీ పాక్షికంగా ప్రారంభం

కెనడా వాసులకు వీసాల జారీ సేవలను పాక్షికంగా ప్రారంభిస్తున్నట్టు భారత్ తాజాగా ప్రకటించింది. భారత్ నిర్ణయంపై కెనడా ఇమిగ్రేషన్ మంత్రి మార్క్ మిల్లర్ స్పందిస్తూ రెండు దేశాల మధ్య నెలకొన్న ఆందోళనకర పరిస్థితుల్లో భారత్‌ తీసుకున్న ఈ నిర్ణయం సానుకూల సంకేతమని తెలిపారు. భారత నిర్ణయాన్ని స్వాగతిస్తూనే అసలు ఇలాంటిది ఎన్నడూ జరగకూడదని పేర్కొన్నారు.
భారత్‌తో దౌత్యపరమైన పరిస్థితులు చాలా మందిని భయాందోళనకు . గురిచేశాయని చెబుతూ అసలు ఇలాంటి పరిస్థితులు నెలకొన్న సమయంలో సస్పెన్షన్‌ అనేది మొదటి నిర్ణయం కాకూడదని అభిప్రాయం వ్యక్తం చేశారు. కెనడా అత్యవసర సేవల మంత్రి హర్జీత్ సజ్జన్ సైతం భారత్ నిర్ణయాన్ని స్వాగతించారు. వీసా సేవలను తిరిగి ప్రారంభిస్తూ భారత్ చేసిన ప్రకటనపై ఊహాత్మక వ్యాఖ్యలు చేయబోనని పేర్కొన్నారు. 
ఖలిస్థాన్‌ వేర్పాటువాది హర్దీప్‌ సింగ్‌ నిజ్జర్‌ హత్య వెనుక భారత్‌ ప్రమేయం ఉందంటూ కెనడా ప్రధాని జస్టిన్‌ ట్రూడో తీవ్ర ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. 
ట్రూడో ఆరోపణలతో రెండు దేశాల మధ్య దౌత్యసంబంధాలు పూర్తిగా దెబ్బతిన్నాయి. ఈ ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో కెనడాలో వీసాల జారీ ప్రక్రియను నిలిపివేస్తూ భారత్‌ కీలక నిర్ణయం తీసుకుంది. అయితే, వీసా సేవలను కొన్నింటిని తిరిగి పునరుద్ధరిస్తున్నట్లు భారత్‌ బుధవారం ప్రకటించింది.
 
కెనడా ప్రభుత్వం ఇటీవల చేసిన ఏర్పాట్లు, భద్రతా చర్యలపై సమీక్షించిన అనంతరం ఇంచుమించు నెల రోజుల తర్వాత ఈ నెల 26 నుంచి ఎంట్రీ వీసా, బిజినెస్‌ వీసా, మెడికల్‌ వీసా, కాన్ఫరెన్స్‌ వీసా సర్వీసులను పునరుద్ధరిస్తున్నట్టు ఒట్టావాలోని భారత హై కమిషన్‌ కార్యాలయ ప్రతినిధి తెలిపారు.  వ్యాపార వీసాలు, వైద్యపరమైన వీసాలు, కాన్ఫరెన్స్ వీసాలు, ప్రవేశ వీసాల సేవలను భారత్ తిరిగి ప్రారంభించింది.
భారత దౌత్య సిబ్బంది భద్రత, రక్షణ విషయంలో కెనడా అధికారులు తగిన విధంగా స్పందించడం వల్లే వీసా సేవలను తిరిగి ప్రారంభించినట్టు సమాచారం. దీనిపై గడిచిన 10 రోజులుగా పలు పర్యాయాలు చర్చలు జరిగినట్టు ఈ వ్యవహారం తెలిసిన ఓ అధికారి వెల్లడించారు. ఇక్కడి నుంచి అయినా రెండు దేశాల మధ్య ఘర్షణాత్మక వైఖరి సమసిపోతుందేమో చూడాలి. కాగా, భారత దౌత్యవేత్తను కెనడా బహిష్కరించగా, భారత్ సైతం అదే విధమైన చర్య తీసుకుంది. 

అంతేకాదు, మరో అడుగు ముందుకు వేసి భారత్ లో అధిక సంఖ్యలో ఉన్న కెనడా దౌత్య సిబ్బందిని వెనక్కి తీసుకోవాలని ఆదేశించింది. దీంతో భారత్ కెనడా దౌత్య సిబ్బందిని ఉపసంహరించుకోక తప్పలేదు. దీన్ని దురదృష్టకర పరిణామంగా కెనడా పేర్కొంది. భారత్ అంతర్జాతీయ నిబంధనలు ఉల్లంఘించినట్టు ఆరోపించింది. 

కెనడాలో భారత దౌత్య సిబ్బందికి సమానంగా, కెనడా దౌత్య సిబ్బంది ఉండాలన్నదే తమ విధానంగా భారత్ పేర్కొంది. అనంతరం కెనడాలోని భారత దౌత్య సిబ్బందికి భద్రతకు హామీ లేనందున వీసా సేవలను నిలిపివేస్తున్నట్టు భారత్ ప్రకటించింది.

కెనడా సైతం భారత్ లోని అన్ని కాన్సులేట్లలో కార్యకలాపాలు, వీసాల జారీని నిలిపివేస్తూ నిర్ణయాన్ని ప్రకటించింది. చూస్తుంటే ఇది ఎంత వరకు వెళుతుందోనన్న సందేహం ఏర్పడింది. ఈ పరిస్థితి కుదుట పడే దిశగా భారత్ చొరవ తీసుకున్నట్టు కనిపిస్తోంది. కెనడా వాసులకు వీసాల జారీని తిరిగి ప్రారంభిస్తున్నట్టు ప్రకటించింది. కెనడాతో దౌత్య చర్చల అనంతరం ఈ పరిణామం జరిగినట్టు తెలుస్తోంది.