జమ్మూ కాశ్మీర్ భారత్ లో సంపూర్ణ విలీనంకు సుదీర్ఘ ప్రయాణం

* నేడు జమ్మూ కాశ్మీర్ విలీనం రోజు
 
2020 నుండి, కేంద్ర పాలిత ప్రాంతమైన జమ్మూ, కాశ్మీర్‌లోని ప్రజలకు మొదటిసారిగా అక్టోబర్ 26న ప్రభుత్వం సెలవు దినంగా ప్రకటించింది.  ఆరోజును భారత్ లో విలీనం రోజుగా పాటిస్తున్నాము. జమ్మూ కాశ్మీర్  చివరి డోగ్రా పాలకుడు మహారాజా హరి సింగ్, అప్పటి భారత గవర్నర్-జనరల్ లార్డ్ మౌంట్ బాటన్‌తో కలిసి `విలీనం పత్రం’పై సంతకం చేసిన సందర్భాన్ని ఈ రోజు సూచిస్తుంది.
 
అప్పటి వరకు పూర్వపు జమ్మూ కాశ్మీర్ రాష్ట్రంలో మహారాజ దళాలు జరిపిన కలుపులలో 22 మంది మృతి చెందిన జులై 13ను `మృతవీరుల దినం’గా, జమ్మూ కాశ్మీర్ మాజీ ప్రధాన మంత్రి, ముఖ్యమంత్రి షేక్ అబ్దుల్లా జన్మదినం డిసెంబర్ 5ను ఆవిర్భావం దినంగా పాటించే ప్రభుత్వం వరవడిని జమ్మూ కాశ్మీర్ తో పాటు లడక్ కేంద్రపాలిత ప్రాంతాలలో విరమించుకున్నారు.
 
దానితో ఇప్పటివరకు సంవత్సరానికి 28గా ఉండే ప్రభుత్వ సెలవు దినాలు 27కు మారాయి. భారత స్వాతంత్ర్య చట్టం, 1947 ప్రకారం, బ్రిటీష్ ఇండియా భారతదేశం, పాకిస్తాన్‌లుగా రెండు దేశాలుగా విభజించడంతో పాటు బ్రిటిష్ వారికి అనుబంధంగా కొనసాగిన సుమారు 580 రాచరిక రాష్ట్రాలు తమ సార్వభౌమాధికారాన్ని పునరుద్ధరించాయి.
 
ఈ రాచరిక రాష్ట్రాలకు స్వతంత్రంగా ఉండటానికి లేదా భారతదేశం లేదా పాకిస్తాన్ లలో ఏదో ఒక దేశంలో చేరడానికి అవకాశం ఇచ్చారు. చట్టంలోని సెక్షన్ 6(ఎ) ప్రకారం, భారతదేశం లేదా పాకిస్తాన్‌లో చేరడానికి ముందు, ఈ రాష్ట్రాలు ఒక `విలీన పత్రం’పై సంతకం చేయాల్సి ఉంటుంది. అందులో ఆ విధంగా విలీనం కావడానికి ఏర్పర్చుకున్న నిబంధనలను పేర్కొనాలి.
 
మహారాజా అక్టోబర్ 26, 1947న సంతకం అటువంటి పత్రం మీదననే సంతకం చేశారు. అదే, జమ్మూ కాశ్మీర్ రాష్ట్రం, భారతదేశం మధ్య కుదిరిన ఒప్పందం. మౌంట్ బాటన్ అక్టోబర్ 27, 1947న ఆ పత్రంపై ఆమోదం తెలిపారు.  ప్రారంభంలో, మహారాజా భారతదేశం లేదా పాకిస్తాన్‌తో చేరకుండా స్వతంత్రంగా ఉండాలని నిర్ణయించుకున్నాడు.  పైగా, హరి సింగ్ పాకిస్తాన్‌తో వాణిజ్యం, కమ్యూనికేషన్‌లు, ప్రయాణాలకు ఆటంకం లేకుండా ఒక యధాస్థితి ఒప్పందంపై సంతకం చేశారు. భారత్‌తో ఎలాంటి ఒప్పందం కుదరలేదు.
 
అక్టోబర్ 1947లో, పాకిస్తాన్ కు చెందిన  వాయువ్య సరిహద్దు ప్రావిన్స్ కు చెందిన పష్టున్ గిరిజనులు కాశ్మీర్‌ను బలవంతంగా ఆక్రమించు కొనేందుకు సైన్యం అండతో పాకిస్తాన్ చేసుకునేందుకు దాడి చేశారు. వారు రాజు ఉన్న శ్రీనగర్ వైపు దూసుకు పెడుతుండటంతో, రాష్ట్రంలో శాంతిభద్రతల సమస్యలు తలెత్తాయి.
ఈ ప్రక్రియలో వారు ఉత్తర కాశ్మీర్‌లోని కొన్ని భాగాలను స్వాధీనం చేసుకున్నారు.
అక్టోబరు 26న బారాముల్లాలో 11000 మందిని  ఆక్రమణదారులు చంపారు. పరిస్థితిని చక్కదిద్దడం కోసం, దండయాత్రను అణచివేయడానికి భారతదేశం నుండి సాయుధ జోక్యాన్ని హరిసింగ్ అభ్యర్థించాడు.  అదే రోజు, మహారాజా శ్రీనగర్ నుండి పారిపోయి జమ్మూ చేరుకున్నాడు. అక్కడకు  జవహర్‌లాల్ నెహ్రూ ప్రతినిధి విసి మీనన్ వచ్చి కలిసి భారత భూభాగం అయితే తప్ప భారత్‌ సైన్యాన్ని పంపదని స్పష్టం చేయడంతో అప్పుడే విలీనం పత్రం మీద సంతకం చేశారు. దానితో జమ్మూ కాశ్మీర్ చట్టబద్ధంగా భారత్ లో అంతర్భాగంగా మారింది. 
 
భారత సైన్యం అక్టోబరు 27న కాశ్మీర్‌కు తన దళాలను విమానంలో తరలించింది. రెండు వారాల్లో ఆక్రమణదారులను తిప్పికొట్టింది. నేషనల్ కాన్ఫరెన్స్ కూడా పష్టూన్లను తరిమికొట్టడంలో భారత సైన్యానికి మద్దతు ఇచ్చింది. అయినప్పటికీ, విలీన పత్రాన్ని గుర్తించడానికి పాకిస్తాన్ నిరాకరించింది. వెంటనే మొదటి కాశ్మీర్ యుద్ధం ప్రారంభమైంది.
 
పాకిస్తాన్ సేనలు, తిరుగుబాటు దళాలు జమ్మూలోకి ప్రవేశించడానికి ప్రయత్నించాయి. ఆక్రమణదారులను అన్ని విధాలుగా వెనక్కి నెట్టడానికి బదులు, లార్డ్ మౌంట్ బాటన్ సలహా మేరకు 1948లో ఈ విషయాన్ని  నెహ్రూ ప్రభుత్వం ఐక్యరాజ్యసమితికి తీసుకెళ్లింది. ఐక్యరాజ్యసమితి జోక్యంతో జనవరి 1, 1949న కాల్పుల విరమణ ప్రకటించబడింది. 
 
కాల్పుల విరమణ రేఖను నియంత్రణ రేఖ (ఎల్ ఓ సి) అని పిలవడం ప్రారంభించారు. జమ్మూ కాశ్మీర్ రాష్ట్రంలోని 2/3వ వంతు భారత ఆధీనంలో ఉండగా, గిల్గిత్, బాల్టిస్తాన్ ప్రాంతాలు పాకిస్తానీ దళాల చేతుల్లోకి వెళ్లాయి. వాటినే ఆక్రమిత కాశ్మీర్ గా పిలుస్తున్నాము.
 
కాగా, విలీనం ఒప్పందంను లాంఛనంగా ఆమోదించేందుకు ఆ సమయంలో జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీ మనుగడలో లేకపోవడంతో తాత్కాలిక ప్రాతిపదికన రాష్ట్రపతి ఉత్తరువుతో తీసుకొచ్చిన ఆర్టికల్ 370 శాశ్వతంగా కొనసాగడంతో ఈ ప్రాంతం భారత్ లో విలీనం అసంపూర్తిగా ఉంటూవచ్చింది. అయితే ఆగస్టు, 2020లో కేంద్ర ప్రభుత్వం దానిని అమలును తొలగించడంతో జమ్మూ కాశ్మీర్ చివరకు భారత్ లో సంపూర్ణంగా విలీనమైన్నట్లు అయింది.