ఎన్‌సీఈఆర్‌టీ పుస్తకాలలో `ఇండియా’ బదులుగా `భారత్’

దేశం పేరును ఇండియా నుంచి భార‌త్‌గా మార్చేందుకు ఒక వైపు ప్ర‌య‌త్నాలు జరుగుతుండగా,  ప్ర‌స్తుతం దేశ‌వ్యాప్తంగా పాఠ్య‌పుస్త‌కాల్లోనూ ఇండియా పేరును భార‌త్‌గా మార్చేందుకు ప్ర‌య‌త్నాలు జ‌రుగుతున్నాయి. పాఠశాల పుస్త‌కాల్లో భార‌త్ అని రాయాల‌ని ఎన్‌సీఈఆర్‌టీ క‌మిటీ ప్ర‌తిపాద‌న చేసింది.
నేష‌న‌ల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేష‌న్ రీస‌ర్చ్ అండ్ ట్రైనింగ్ ఆధ్వ‌ర్యంలోని ఉన్న‌త స్థాయి క‌మిటీ చేసిన సూచ‌న‌ల ప్ర‌కారం స్కూల్ క‌రిక్యుల‌మ్‌ను మార్చ‌నున్నారు.
జాతీయ స్థాయిలో పాఠ్య పుస్తకాలు, ఇతర ప్రణాళికలను ఖరారు చేసేందుకు ఒక ప్రత్యేక కమిటీ ఏర్పాటైంది.  ఈ కమిటీ ఇండియా బదులు భారత్‌ అనే పదాన్ని చేర్చాలనే ప్రతిపాదనకు ఎన్‌సీఈఆర్‌టీ ప్యానెల్‌ ఏకగ్రీవంగా అంగీకారం తెలిపినట్లు ప్యానెల్‌ ఛైర్మన్‌ ఐజాక్‌ బుధవారం వెల్లడించారు.  కొత్తగా ముద్రించే ఎన్‌సీఈఆర్‌టీ పుస్తకాల్లో ఇండియా స్థానంలో భారత్‌ ఉంటుందని ఆయన స్పష్టం చేశారు.
ఇప్పుడు ఎన్‌సిఇఆర్‌టి చేసిన ప్రతిపాదనలలో మరికొన్ని విషయాలు కూడా ఉన్నాయి. ప్రత్యేకించి చరిత్రపై దృష్టి సారించారు. హిందూ రాజ్యాల విజయాలను ఎక్కువగా ప్రచారం చేయాలని సూచించారు. ఇక ఇప్పుడు చరిత్ర పాఠ్య పుస్తకాలలో ఉన్న ప్రాచీన చరిత్ర స్థానంలో శాస్త్రీయ లేదా క్లాసికల్ హిస్టరీని రూపొందించాలని ప్రతిపాదించారు.  చరిత్రను ప్రాచీన, మధ్యయుత, ఆధునిక చరిత్రలుగా పేర్కొనడం అనుచితం అని విద్యావేత్త, సంబంధిత ప్యానెల్ ఛైర్మన్ ఐజాక్ తెలిపారు.
ఇటువంటి విధానం బ్రిటిష్ వారి హయాంలో తీసుకువచ్చారని, పూర్వం దేశం పూర్తిగా వెనుకబడి, చీకట్లో మగ్గిందని, శాస్త్రీయపురోగతి లేకుండా అజ్ఞానంలో ఉందని తెలిపే విధంగా చరిత్రలో అధ్యాయాలు నిర్ధేశించారని ఐజాక్ అభిప్రాయపడ్డారు.  అన్ని సబ్జెక్టుల్లో భారతీయ నాలెడ్జ్ సిస్టమ్ (ఐకెఎస్)ను ప్రవేశపెట్టాలని కూడా కమిటీ సిఫార్సు చేసినట్లు చెప్పారు.
 
అయితే ప్యాన‌ల్ ఇచ్చిన ప్ర‌తిపాద‌న‌ల‌పై ఇప్ప‌టి వ‌ర‌కు అధికారిక నిర్ణ‌యం తీసుకోలేద‌ని ఎన్‌సీఈఆర్‌టీ తెలిపింది. యుద్ధాల్లో హిందువులు సాధించిన విజ‌యాల‌ను హైలెట్ చేస్తూ పాఠ్య‌పుస్త‌కాల‌ను రూపొందించాల‌ని ప్ర‌తిపాదించిన‌ట్లు ఇజాక్ తెలిపారు.  చరిత్రలో ఇప్పటిదాకా హిందువుల ఓటముల గురించే ప్రస్తావనే ఉందని, కానీ మొఘలుల మీద, సుల్తానుల మీద హిందూ రాజులు సాధించిన విజయాలను ఎక్కడా ప్రస్తావించలేదని గుర్తు చేశారు.
 
జాతీయ విద్యావిధానం, 2020కు త‌గిన రీతిలో పాఠశాల పుస్తకాలను రూపొందించేందుకు  ఎన్‌సీఈఆర్‌టీ ప్రయ‌త్నాలు చేప‌ట్టింది. సిల‌బ‌స్ త‌యారీ కోసం ఇటీవ‌ల 19 మందితో కొత్త క‌మిటీని ఏర్పాటు చేశారు. ఆ క‌మిటీ ప్ర‌తిపాద‌న‌ల గురించే ప్ర‌స్తుతం చ‌ర్చ‌లు జ‌రుగుతున్నాయి.
ఇటీవల జీ20 సమావేశాలకు భారత్ ఆతిథ్యం ఇచ్చిన సమయంలో ఈ పేరు మార్పు గురించి దేశవ్యాప్తంగా తీవ్ర చర్చ జరిగింది. జీ20 దేశాధినేతలకు ఇచ్చిన విందు ఆహ్వాన పత్రికలో ‘ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా’ స్థానంలో ‘ప్రెసిడెంట్ ఆఫ్ భారత్’ అని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము కార్యాలయం పేర్కొనడం కొత్త చర్చకు దారితీసింది.  ఆ తర్వాత జరిగిన జీ20 సమావేశంలో కూడా ప్రధాని నరేంద్ర మోదీ ముందు ఇండియాకు బదులుగా ‘భారత్’ అనే నేమ్ ప్లేట్ ఉండటంతో ఆ ఊహాగానాలకు మరింత బలం చేకూరింది.