ప్రశ్నార్ధకంగా కాళేశ్వరం ప్రాజెక్ట్.. కేసీఆర్ రాజీనామాకు డిమాండ్

అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్ట్ భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారడానికి బాధ్యత వహిస్తూ సీఎం కేసీఆర్ రాజీనామా చేయాలని కేంద్ర మంత్రి, రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు జి కిషన్ రెడ్డి డిమాండ్ చేశారు. మేడిగడ్డ లక్ష్మీ బ్యారేజ్ కుంగిపోవడంతో ప్రాజెక్ట్ నాణ్యతపై అనుమానం బయటపడుతోందని చెప్పారు.  
కేసీఆర్ ఒక సూపర్ ఇంజినీర్‌గా అవతారం ఎత్తి డ్రీమ్ ప్రాజెక్ట్ అంటూ నిర్మించిన ఈ ప్రాజెక్ట్ గుదిబండగా మారిందని చెబుతూ లక్ష్మి బ్యారేజ్ మొత్తం కాళేశ్వరం ప్రాజెక్ట్ కు లైఫ్ లైన్ అని, ఇది దెబ్బతింటే మొత్తం వ్యవస్థపై దాని ప్రభావం ఉంటుందని కేంద్ర మంత్రి ఆందోళన వ్యక్తం చేశారు.
 
 పిల్లర్లు కుంగిపోవడానికి కుట్ర కారణం అంటూ కేసు పెట్టడాన్ని ప్రస్తావిస్తూ దీని మీద న్యాయ విచారణకు సీఎం సిద్ధంగా ఉన్నారా? అంటూ సవాల్ చేశారు. దీనిపై కేసు పెట్టాలంటే ముందు సీఎం కేసీఆర్ మీద పెట్టాలని స్పష్టం చేశారు.  ప్రాజెక్ట్ భద్రత, నాణ్యత, డిజైన్ అన్నింటిపై ప్రజల్లో అనుమానాలు ఉన్నాయని, ఇంజినీర్ల అభ్యంతరాలు నిజం అని తేలిందని, అందుకే సీఎం నోరు మెదపడం లేదని విమర్శించారు. ఇంజినీరింగ్ నిపుణులు చేసిన సూచనలను పట్టించుకోకుండా, అధికారుల నోర్లు మూయించి కేసీఆర్ ప్రాజెక్ట్ నిర్మాణం చేశారని ఆరోపించారు. 
 
ఇది పిచ్చి తుగ్లక్ డిజైన అంటూ ఒక పనికిరాని చెత్త ప్రాజెక్ట్ కట్టారని చెబుతూ తల మీది నీటిని నోట్లోకి తీసుకురాకుండా, కాళ్ళ దగ్గరకు తీసుకొచ్చి ఆపై నోటి దగ్గరకు తెచ్చినట్టుగా ఈ డిజైన్ ఉందని ఎద్దేవా చేశారు. ఆయన ఫాం హౌస్ కి మాత్రం నీరు అందుతోంది తప్ప రైతులకు కాదని ధ్వజమెత్తారు. 
 
డ్యాం సేఫ్టీ నిపుణులు ప్రాజెక్ట్ పరిశీలించి నివేదిక తయారు చేస్తున్నారని చెబుతూ వాళ్ళు డ్యాం డిజైన్లు అడుగుతుంటే, రాష్ట్ర ప్రభుత్వం సరైన సమాచారం ఇవ్వడం లేదని కిషన్ రెడ్డి విమర్శించారు. కుంగిపోడానికి కారణం తెలుసుకుని, దానికి పరిష్కారం కోసం ఇంజినీర్లు ప్రయత్నాలు చేస్తున్నారని చెప్పారు. అయితే, కుట్ర కోణం అంటూ తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. 
 
ప్రాజెక్ట్ నిర్మాణం కోసం కేంద్రం సాంకేతిక అనుమతులు కోరితే ఇస్తుంది తప్ప కేంద్ర ప్రభుత్వ పాత్ర ఏమీ ఉండదని స్పష్టం చేశారు. కేంద్ర సంస్థలు రాష్ట్ర ప్రభుత్వం గ్యారంటీ ఇస్తే అప్పు ఇచ్చాయని తెలిపారు.  ఇది కేసీఆర్ కుటుంబానికి ఏటీఎమ్ లా మారింది తప్ప, ‘ఎనీ టైం వాటర్’ గా మాత్రం మారలేదని విమర్శించారు. 
 
వేల కోట్ల రూపాయల మేర అప్పు చేసి నిర్మించడమే ఒక దుర్మార్గం కాగా పిల్లర్లు కుంగిపోవడం చాలా పెద్ద సమస్య అని చెప్పారు. కుంగిపోయిన తర్వాత 85 గేట్స్ ఎత్తి 10 టీఎంసీల నీటిని కిందకు వదిలేయాల్సి వచ్చిందని గుర్తు చేశారు. గత ఐదేళ్లలో ఈ ప్రాజెక్ట్ అనుకున్న లక్ష్యాలు చేరుకోలేకపోయిందని విమర్శించారు.
 
 ఏడాదికి 400 టీఎంసీల నీటిని ఎత్తి పోస్తాం అని చెప్పి ఇప్పటి వరకు మొత్తం కలిపి 154 టీఎంసీల నీటిని మాత్రమే నాలుగేళ్లలో ఎత్తి పోశారని కిషన్ రెడ్డి తెలిపారు. ఇందులో కేవలం 104 టీఎంసీల నీటిని మాత్రమే వినియోగించారని చెప్పారు.  పైగా ఆ నీటిని తీసుకొచ్చి చెరువులు, రిజర్వాయర్లు నింపి టూరిజం కోసం ఉపయోగించారు తప్ప రైతులకు ఉపయోగపడలేదని ధ్వజమెత్తారు. 18.27 లక్షల ఎకరాలకు ఈ ప్రాజెక్ట్ ద్వారా సాగు లక్ష్యం కాగా, ఈ ప్రాజెక్ట్ ద్వారా కేవలం 56 వేల ఎకరాలు మాత్రమే సాగయ్యిందని మండిపడ్డారు.