
బాపట్ల జిల్లా పర్చూరు నియోజకవర్గంలో ఓట్ల తొలగింపుపై రాష్ట్ర ఎన్నికల సంఘం కొరడా ఝుళిపించింది. అధికార పక్షం నాయకులు చెప్పినట్లు రాజకీయ ప్రత్యర్థుల ఓట్ల తొలగింపులో జోక్యం చేసుకున్న నలుగురు పోలీసులపై చర్యలు తీసుకుంది. టీడీపీ ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు ఫిర్యాదుతో విచారణ చేపట్టిన ఎన్నికల సంఘం, బాపట్ల ఎస్పీని నివేదిక కోరింది.
ఎస్పీ నివేదికతో ఓట్ల తొలగింపులో జోక్యం చేసుకున్న మార్టూరు సీఐ, ఎస్సై, పర్చూరు, యద్దనపూడి ఎస్సైలను సస్పెండ్ చేస్తూ సీఈవో ముకేశ్ కుమార్ మీనా నిర్ణయం తీసుకున్నారు. అంతే కాకుండా ఓట్ల తొలగింపుతో సంబంధం ఉన్న బీఎల్వోలు, మహిళా పోలీసులపైనా చర్యలు తీసుకోవాలని ఉన్నతాధికారులను ఆదేశించారు.
ఎన్నికల విధుల్లో పాల్గొన్న మహిళా పోలీసులపై నిబంధనలకు విరుద్ధంగా ఒత్తిడి తీసుకొచ్చి ఓట్ల తొలగింపు కోరుతూ వచ్చిన దరఖాస్తుల సమాచారాన్ని అధికార పార్టీకి చెందిన నేతలకు అందించారని ఎమ్మెల్యే ఈసీకి ఫిర్యాదు చేశారు. దీనిపై సీఈవో ముఖేష్ కుమార్ మీనా విచారణ చేయాలని బాపట్ల జిల్లా కలెక్టర్, ఎస్పీలను ఆదేశించారు.
ఈ విచారణలో బీఎల్‌వోలు పోలీసులకు సమాచారం పంపిన విషయం వెలుగుచూసింది. పోలీసుల జోక్యం ఉందని తెలిసినా అధికారులు చర్యలు తీసుకోలేదని పర్చూరు ఎమ్మెల్యే హైకోర్టును ఆశ్రయించారు. దీంతో హైకోర్టు బాధ్యులపై ఏం చర్యలు తీసుకున్నారో తెలియజేయాలని ఆదేశించింది. ఈ నేపథ్యంలో మార్టూరు సీఐ, పర్చూరు, యుద్ధనపూడి, మార్టూరుల ఎస్సైలను సస్పెండ్ చేస్తూ మంగళవారం బాపట్ల జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ ఆదేశాలు ఇచ్చారు.
పర్చూరు నియోజకవర్గంలో టీడీపీ సానుభూతిపరుల ఓట్ల తొలగింపునకు వైసీపీ నేతలు కుట్ర చేస్తున్నారని ఎమ్మెల్యే సాంబశివరావు గతంలో ఆరోపించారు. ఓట్ల తొలగింపులో ఉన్నతాధికారుల నుంచి బీఎల్వోల వరకు బాధ్యత మరచి వ్యవహరిస్తున్నారని ఆయన విమర్శించారు. రాష్ట్ర వ్యాప్తంగా 2.45 లక్షల ఫారం-7 దాఖలు చేయంగా, ఒక్క పర్చూరు నియోజకవర్గంలోనే 25 వేల మంది ఓట్లు తొలగించడానికి ప్లాన్ వేశారని ఆరోపించారు.
దీనిని అడ్డుకోవాలని రాష్ట్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసినా స్పందించడంలేదని తెలిపారు. పర్చూరు, మార్టూరు, యద్దనపూడి మండలాల ఎస్సైలతో పాటు మార్టూరు సీఐ కూడా ఫారం-7 దరఖాస్తులు పెట్టడంలో అధికారులపై ఒత్తిడి తెచ్చారని, పూర్తి సాక్ష్యాధారాలతో ఎమ్మెల్యే కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. దీంతో విచారణ జరిపిన ఎన్నికల సంఘం నలుగురి పోలీసులపై వేటు వేసింది.
ముగ్గురు ఎస్సైలు, కొందరు మహిళా పోలీసు బీఎల్‌వోలతో మార్టూరు సీఐ వాట్సప్ గ్రూప్ ఏర్పాటు చేశారని పేర్కొంటూ వారి చాటింగ్‌కి సంబంధించిన స్క్రీన్‌షాట్‌లను ఎమ్మెల్యే తన ఫిర్యాదుకు జత చేశారు. దీంతో ఈసీ విచారణకు ఆదేశించింది. శాంతిభద్రతల సమస్యలు తలెత్తుతాయన్న ఉద్దేశంతో ముందస్తు సమాచార సేకరణ కోసమే ఆ వాట్సప్ గ్రూప్‌ని ఏర్పాటు చేసినట్టు పోలీసులు విచారణలో చెప్పారు. దానిపై ఈసీ తీవ్రంగా స్పందించి, వారిపై చర్యలకు ఆదేశించారు.
More Stories
లడ్డూ కల్తీ నెయ్యి సూత్రధారుల కోసం ఇక వేట
అలనాటి నటి, నిర్మాత కృష్ణవేణి కన్నుమూత
న్యూఢిల్లీ రైల్వేస్టేషన్ తొక్కిసలాటలో 18 మంది మృతి