వందే భారత్ రైళ్లతో పడిపోతున్న విమాన టికెట్ ధరలు!

భారత ప్రభుత్వం వరుసగా ప్రవేశపెడుతున్న వందే భారత్ రైళ్లకు ప్రజాదరణ పెరుగుతూ ఉండడంతో విమాన ప్రయాణికుల సంఖ్య తగ్గుముఖం పడుతున్నది. దానితో విమాన చార్జీలను సహితం భారీగా తగ్గించుకోవాల్సి వస్తున్నది.  ఒక అంచనా ప్రకారం విమాన ట్రాఫిక్ 10 నుండి 20 శాతం తగ్గుముఖం పట్టగా, విమాన చార్జీలు 20 నుండి 30 శాతం మేరకు తగ్గాయి.

ఇప్పుడు తొలిసారిగా ఈ రైళ్లకు ఉన్న డిమాండ్ను భారతీయ రైల్వే పర్యవేక్షించడం మొదలుపెట్టింది. ప్రయాణికుల వయస్సు, లింగం వంటి డేటాను సేకరిస్తోంది. ఈ నేపథ్యంలో ఈ డేటా ద్వారా పలు ఆసక్తికర విషయాలు బయటకి వచ్చాయి.

తొలుత నాలుగు రూట్ల (ముంబై, గోవా, సోలాపూర్, షిరిడి)కు సంబంధించిన వన్డే భారత్  రైళ్ల డేటాను మానిటర్ చేస్తోంది భారతీయ రైల్వే. ఇవన్నీ ముంబై నుంచే మొదలవుతున్నాయి. ఈ రూట్లల్లో ఈ తరహా రైళ్లను అధికంగా వినియోగిస్తున్న వారి వయస్సు 31-45 మధ్యలో ఉందని, ఆ తర్వాత 15-30ఏళ్ల వయస్సు వారు ఉన్నారని డేటా సూచిస్తోంది.

మొత్తం మీద ఈ రూట్లలో సెప్టెంబర్ 15 నుంచి అక్టోబర్ 13 వరకు 85,600 మంది పరుషులు, 57,838మంది మహిళలు, 26 ట్రాన్స్జెండర్లు ప్రయాణించారు. ప్రయాణికుల్లో 1-14ఏళ్ల వయస్సు వారి వాటా 5 శాతంగా ఉంది.  అంతేకాకుండా, సెప్టెంబర్లో ఈ నాలుగు రూట్లల్లో వందే భారత్ రైళ్ల ఆక్యుపెన్సీ 77శాతం నుండి 101 శాతం మధ్యలో ఉండటం విశేషం.వందే భారత్ రైళ్లను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు, ప్రయాణికుల నెంబర్లను పెంచుకునేందుకు ఈ డేటా ఉపయోగపడుతుందని భారతీయ రైల్వే భావిస్తోంది. 

“ప్రయాణికుల ఇష్టాలను తెలుసుకునేందుకు ఈ డేటా ఉపయోగపడుతుంది. భవిష్యత్తు కార్యచరణ, సేవలు, ఫుడ్ మెన్యూతో పాటు ఇతర అంశాలను పరిశీలించేందుకు భారతీయ రైల్వేకు ఈ డేటా చక్కగా యూజ్ అవుతుంది,” అని పబ్లిక్ పాలిసీ ఎనలిస్ట్ (మొబిలిటీ అండ్ ట్రాన్స్పోర్ట్) పరేశ్ రావల్ తెలిపారు.

ఇప్పటికే దేశవ్యాప్తంగా దాదాపు అన్ని రూట్లలో వందే భారత్ రైళ్లు   దూసుకెళ్తున్నాయి. త్వరలోనే మరిన్ని ప్రాంతాలకు కూడా ఈ సేవలు విస్తరించనున్నాయి. ముఖ్యంగా  జమ్ము- శ్రీనగర్ రూట్లో ఓ వందే భారత్ రైలును త్వరలోనే ప్రారంభించినునట్టు రైల్వేశాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ ఇటీవలే వెల్లడించారు. ఇతర రైళ్లతో పోల్చుకుంటే ఈ వందే భారత్ రైళ్లతో ప్రయాణ సమయం చాలా వరకు తగ్గుతోంది. అందుకే ధరలు కాస్త ఎక్కువగా ఉన్నప్పటికీ, ప్రజలు ఈ ఆధునిక రైళ్ల వైపు మొగ్గు చూపుతున్నారు!