వాఘ్ బ‌క్రీ టీ గ్రూప్ య‌జ‌మాని ప‌రాగ్ దేశాయి క‌న్నుమూత‌

ప్రముఖ వ్యాపారవేత్త, వాఘ్ బక్రీ టీ గ్రూప్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ పరాగ్ దేశాయ్ (49) చికిత్స పొందుతూ కన్నుమూశారు. మెదడులో రక్తస్రావం కావడం వల్ల ఆదివారం ఆయన ప్రాణాలు కోల్పోయినట్లు కంపెనీ ఓ ప్రకటనలో వెల్లడించింది. ఆయనకు భార్య విదిశ, కూతురు పరిషా ఉన్నారు. 
 
మార్నింగ్ వాక్ నిమిత్తం అహ్మ‌దాబాద్‌లోని త‌న ఇంటి స‌మీపంలో ఉన్న పార్క్‌కు అక్టోబ‌ర్ 15న ప‌రాగ్ దేశాయి వెళ్లారు. వాకింగ్ చేస్తుండ‌గా, వీధి కుక్క‌లు మూకుమ్మ‌డిగా దాడి చేసేందుకు య‌త్నించాయి. దీంతో కుక్క‌ల నుంచి త‌ప్పించుకునేందుకు ప‌రాగ్ ప్ర‌య‌త్నించ‌గా, కింద ప‌డిపోయారు. దీంతో ఆయ‌న త‌ల‌కు తీవ్ర గాయ‌మైంది. 
 
చికిత్స నిమిత్తం స్థానిక ఆస్ప‌త్రికి త‌ర‌లించారు. ఆయ‌న అప‌స్మార‌క‌స్థితిలోకి వెళ్లిపోవ‌డంతో, మెరుగైన చికిత్స నిమిత్తం అహ్మ‌ద్‌బాద్‌లోని జైదాస్ ఆస్ప‌త్రికి త‌ర‌లించారు.  ఆ సమయంలోనే మెదడులో రక్తస్రావం వల్ల ఏడు రోజుల పాటు వెంటిలేటర్ పై చికిత్స తీసుకుంటూ అక్టోబర్ 22న ఆయన తుది శ్వాస విడిచినట్లు వెల్లడించారు.
 
దాడి విషయం భద్రతా సిబ్బంది నుంచి కుటుంబ సభ్యులు తెలుసుకొని ఆయన్ని ఆసుపత్రికి తరలించినట్లు పేర్కొన్నారు. పరాగ్ దేశాయ్ మృతి పట్ల కాంగ్రెస్ ఎంపీ శక్తిసిన్హా గోహిల్ విచారం వ్యక్తం చేశారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు. గుజరాత్ టీ ప్రోసెసర్స్ అండ్ ప్యాకర్స్ లిమిటెడ్ (జీటీపీపీఎల్)ను వాఘ్ బక్రీ 1980లో స్థాపించారు. ఇండియన్ మల్టీనేషనల్ ఎఫ్ఎంసీజీ కంపెనీగా రూపొందించారు. కంపెనీ ప్రధాన కార్యాలయం అహ్మదాబాద్‌లో ఉంది. వాఘ్ బక్రీ బ్రాండ్‌తో టీ ప్రాడెక్ట్ విశేష ప్రాచుర్యం పొందింది.
 
వాఘ్ బక్రీ టీ గ్రూప్ ఇద్దరు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లలో పరాగ్ దేశాయ్ ఒకరు. ఆయన తండ్రి పేరు రాసేశ్ దేశాయ్. కంపెనీని ఈ-కామర్స్‌లోకి తీసుకెళ్లడంలో కీలక పాత్ర పోషించారు. కంపెనీ సెల్స్, మార్కెటింగ్, ఎక్స్‌పోర్ట్ విభాగాల కార్యకలాపాలను పరాగ్ పర్యవేక్షించేవారు.  పరాగ్ దేశాయ్ అమెరికాలో ఎంబీఏ పూర్తి చేశారు. వాఘ్ బక్రీ గ్రూప్‌ను 1892లో నరన్‌దాస్ దేశాయ్ ప్రారంభించారు. ఈ కంపెనీ ప్రస్తుత టర్నోవర్ రూ.2000 కోట్లు. దేశవ్యాప్తంగా దాదాపు అన్ని రాష్ట్రాల్లో వాఘ్ బక్రీ టీ గ్రూప్ కంపెనీ వ్యాపార కార్యకలాపాలు నిర్వహిస్తోంది.