ఛత్తీస్‌గఢ్‌లో రైస్‌ మిల్లర్ల నుంచి రూ.175 కోట్ల ముడుపులు

కాంగ్రెస్‌ పాలిత ఛత్తీస్‌గఢ్‌లో రూ.175 కోట్ల మేర రైస్‌ మిల్లింగ్‌ కుంభకోణం జరిగిందని ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌(ఈడీ) ఆరోపించింది. రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని మార్క్‌ఫెడ్‌ మాజీ మేనేజింగ్‌ డైరెక్టర్‌, రాష్ట్ర రైస్‌ మిల్లర్స్‌ అసోసియేషన్‌ కీలక సభ్యుడొకరు రైస్‌ మిల్లర్ల నుంచి దాదాపు రూ.175 కోట్ల మేర లంచాల రూపంలో వసూలు చేశారని, వీటిని పలువురు ప్రభుత్వ పెద్దలకు చెల్లించినట్టు పేర్కొన్నది.

మార్క్‌ఫెడ్‌ మాజీ ఎండీ మనోజ్‌ సోనీ, రాష్ట్ర రైస్‌ మిల్లర్స్‌ అసోసియేషన్‌కు చెందిన కోశాధికారి రోషన్‌ చంద్రశేఖర్‌, కొంత మంది ఆఫీస్‌ బ్యారర్లు, జిల్లా మార్కెటింగ్‌ అధికారులు, పలువురు రైస్‌ మిల్లర్ల యాజమానుల ఇండ్లు, కార్యాలయాల్లో ఈ నెల 20, 21 తేదీల్లో ఈడీ అధికారులు సోదాలు చేపట్టారు.

పలు పత్రాలు, డిజిటల్‌ పరికరాలను, లెక్కలు చూపని రూ.1.06 కోట్ల నగదును స్వాధీనం చేసుకున్నట్టు ఈడీ పేర్కొన్నది. రాజకీయ నేతలు, అధికారులు పరస్పర అవగాహనతో ఈ కుంభకోణానికి పాల్పడినట్టు గుర్తించినట్లు తెలిపింది. గత కొద్ది నెలలుగా రాష్ట్రంలో బొగ్గు రవాణా పన్ను, మద్యం, అక్రమ ఆన్‌లైన్‌ బెట్టింగ్‌ యాప్‌ స్కామ్‌లను బయటపెట్టినట్టు ఈడీ పేర్కొన్నది.

రాయ్‌పూర్‌ కోర్టులో ఆదాయ పన్ను శాఖ చేసిన ఫిర్యాదు ఆధారంగా ఈడీ తాజా చర్యలు చేపట్టింది. బియ్యం మిల్లింగ్‌ కోసం రాష్ట్ర ప్రభుత్వం రైస్‌ మిల్లర్లకు చెల్లించే క్వింటాల్‌ వరికి రూ.40 చొప్పున ఇచ్చే ప్రత్యేక ప్రోత్సాహకాన్ని దుర్వినియోగం చేసేందుకు మార్క్‌ఫెడ్‌ అధికారులతో ఛత్తీస్‌గఢ్‌ రైస్‌ మిల్లర్స్‌ అసోసియేషన్‌ సభ్యులు కుమ్మక్కయ్యారని ఐటీ తన ఫిర్యాదులో పేర్కొంది. 

ప్రోత్సాహకం కింద అందించే మొత్తాన్ని రూ.40 నుంచి ఏకంగా రూ.120కు పెంచారని, దీన్ని రెండు విడతల్లో రూ.60 చొప్పున చెల్లించారని ఈడీ వెల్లడించింది. ఈ క్రమంలో రైస్‌ మిల్లర్స్‌ అసోసియేషన్‌ సభ్యులు, మార్క్‌ఫెడ్‌ అధికారి మనోజ్‌ సోనీ కలిసి రైస్‌ మిల్లర్ల నుంచి వారు మిల్లింగ్‌ చేసిన ప్రతి క్వింటాల్‌ వరికి ఒక విడత చెల్లింపునకు రూ.20 చొప్పున లంచాలు వసూలు చేశారని పేర్కొన్నది. 

లంచాలు చెల్లించిన రైస్‌ మిల్లర్ల బిల్లులనే మార్క్‌ఫెడ్‌ ఎండీ క్లియర్‌ చేసేవారని, లేకుంటే బిల్లులను నిలిపివేసినట్టు గుర్తించామని పేర్కొన్నది. ప్రత్యేక ప్రోత్సాహక పెంపుతో రూ.500 కోట్ల మేర చెల్లింపులను విడుదల చేశారని, తద్వారా లంచాల రూపంలో రైస్‌ మిల్లర్ల నుంచి రూ.175 కోట్లను రాష్ట్ర రైస్‌ మిల్లర్స్‌ అసోసియేషన్‌ ట్రెజరర్‌ రోషన్‌ చంద్రశేఖర్‌ వసూలు చేశారని, ఈ మొత్తాన్ని ‘ప్రభుత్వ పెద్దలకు’ చేరవేశారని ఆరోపించింది.