
తన కుటుంబంలో అందరికి ఉద్యోగాలు ఇచ్చుకొని తెలంగాణ యువతను వంచించిన కెసిఆర్ ప్రభుత్వంను గద్దె దింపాలని కేంద్ర మహిళా, శిశు సంక్షేమ మైనార్టీ శాఖ మంత్రి స్మృతి ఇరానీ పిలుపిచ్చారు. శుక్రవారం దుబ్బాక పట్టణంలోని తిరుమల గార్డెన్స్‌లో ఎమ్మెల్యే రఘునందన్‌రావు ఆధ్వర్యంలో నిర్వహించిన నారీ శక్తి వందన్ మహిళా సమ్మేళనం కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా పాల్గొంటూ కెసిఆర్ ప్రభుత్వం అన్ని రంగాల్లో వైఫల్యం చెందిందని విమర్శించారు.
నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు ఇస్తానని చెప్పిన కెసిఆర్ నేటి వరకు నియామక ప్రక్రియను సరిగ్గా జరపలేకపోయిండని ఆమె ధ్వజమెత్తారు. నీళ్లు నిధులు నియామకాల విషయంలో కెసిఆర్ చెప్పిందొకటి చేసింది ఒకటి అని ఆమె తీవ్రంగా విమర్శించారు. తెలంగాణ రాష్ట్రం రావాలని ఈ ప్రాంతంలో ఉన్న కోట్లాది మంది తెలంగాణ వస్తే నీళ్లు నిధులు నియామకాలు వస్తాయని కొట్లాడం జరిగిందని ఆమె గుర్తు చేశారు.
అయితే, తెలంగాణ వచ్చిన తర్వాత వారి ఆశలు ఇవి నెరవేరలేదని విమర్శించారు. తెలంగాణ రాష్ట్రంలో సిఎం కెసిఆర్ కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభించినప్పుడు కేవలం రూ. 40,000 కోట్లతో ప్రారంభించిన ప్రాజెక్టును రూ. లక్ష కోట్లకు మించినా కాని నేటికీ 60 శాతం ప్రజలకు కాళేశ్వరం నీటిని ఇంత వరకు అందించలేకపోతున్నారని ఆమె తెలిపారు.
వ్యవసాయ రంగానికి నీళ్లు అందించడంలో కెసిఆర్ ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందిందని చెబుతూ తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు అయినప్పుడు మిగులు బడ్జెట్ కలిగి ఉన్న రాష్ట్రం తెలంగాణ అని కానీ నేడు రూ. 5 లక్షల కోట్ల అప్పులు చేసి తన కుటుంబ ఖజానాకు వ్యక్తి కెసిఆర్ అంటూ స్మ్రితి ఇరానీ ఆరోపించారు.
ఈ దేశంలో కరోనా వచ్చినప్పుడు ప్రపంచమంతా భయపడుతుంటే ప్రతి ఇంటికి తిరిగి దేశ ప్రజలందరికీ డబ్బులతో సంబంధం లేకుండా వ్యాక్సిన్ ఇచ్చిన ఘనత నరేంద్ర మోదీ ప్రభుత్వం అని ఆమె పేర్కొన్నారు. దేశ ప్రజలను ఆదుకున్న చరిత్ర నరేంద్ర మోదీ ప్రభుత్వం అని ప్రజలు గుర్తుంచుకోవాలని ఆమె కోరారు.
ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద పేద ప్రజలకు డబుల్ బెడ్ రూంలు ఇచ్చిన ఘనత నరేంద్ర మోదీ సర్కార్ దని అంటూ ఆమె చెప్పుకొచ్చారు. ఇదే తెలంగాణ రాష్ట్రంలో సిఎం కెసిఆర్ ప్రభుత్వం డబుల్ బెడ్‌రూంలు నేటి వరకు సంపూర్ణంగా పేద ప్రజలకు అందివ్వలేదని ఆమె ధ్వజమెత్తారు.
స్వయంగా సిఎం కెసిఆర్ దళితబంధు విషయంలో ఎమ్మెల్యేలు 30 శాతం కమిషన్ తీసుకుంటున్నారని హెచ్చరించిన విషయాన్నీ ప్రజలు ఆలోచించాలని కేంద్ర మంత్రి కోరారు. తెలంగాణ సాధనలో జయ జయహే తెలంగాణ అనే కవితను రాసిన అందెశ్రీ పాటను నేటి వరకు తెలంగాణ రాష్ట్ర కవితగా ఎందుకు ఆవిష్కరించలేదో తెలపాలని ఆమె డిమాండ్ చేశారు.
మెగా టైల్స్ తెలంగాణకు అందించిన ఘనత బిజెపి ప్రభుత్వందే అని చెబుతూ టిఎస్‌పిఎస్‌సి పరీక్షల్లో అవినీతి అక్రమాలకు పాల్పడ్డది తెలంగాణ ప్రభుత్వం అంటూ మండిపడ్డారు. 6 లక్షల మంది చిరు వ్యాపారులకు ముద్ర లోన్ క్రింద ఆర్థిక సాయం అందించింది కేంద్ర ప్రభుత్వం అని ఆమె చెప్పారు.
సిద్దిపేటకు రైలు కూడా అందించింది బిజెపి ప్రభుత్వం అంటూ సిద్దిపేట వరంగల్ కరీంనగర్ సిటీ ను స్మాల్ సిటీలుగా గుర్తించింది కేంద్రంలో ఉన్న బిజెపి ప్రభుత్వం అని స్మ్రితి ఇరానీ తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలో అవినీతిపై కెసిఆర్ ప్రభుత్వం పై పోరాడుతున్న రఘునందన్ రావును దుబ్బాక ఎమ్మెల్యేగా మరో మారు గెలిపించి ఆశీర్వదించాలని ఆమె కోరారు.
More Stories
పాత బస్తీలో హైడ్రా కూల్చివేతలు చేయగలరా?
భారత్ లో ఓటింగ్‌ను పెంచేందుకు అమెరికా నిధులు?
కేసీఆర్ బాటలోనే నడుస్తున్న రేవంత్ రెడ్డి