హెచ్‌సీఏ అధ్యక్షుడిగా జగన్‌మోహన్ రావు

హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్  (హెచ్‌సీఏ) నూతన అధ్యక్షుడిగా జగన్‌ మోహన్ రావు గెలుపొందారు. అయితే ఆయనను హెచ్‌సీఎం అధ్యక్షుడిగా గెలిపించింది మాత్రం ఒకే ఒక్క ఓటు. దీంతో ప్రత్యర్థి ప్యానల్‌కు చెందిన అమర్‌నాథ్ మరోసారి కౌంటింగ్ చేయాలంటూ పట్టుబట్టారు. ఈ క్రమంలో కొంత గందరగోళం ఏర్పడింది.
 
మరోవైపు హెచ్‌సీఏ కౌన్సిలర్‌గా క్రికెట్ ఫస్ట్ ప్యానల్‌కి చెందిన సునీల్ అగర్వాల్ విజయం సాధించారు. కాగా, ఈ ప్యానల్‌కు అర్షద్ అయూబ్, శివలాల్ యాదవ్ తమ మద్దతు తెలిపారు. ప్యానల్ ఫర్ గుడ్ గవర్నెన్స్ ప్యానెల్‌కు చెందిన అన్సార్ అలీకి 47 ఓట్లు పడగా, సునీల్ అగర్వాల్‌కి 59 ఓట్లుపడ్డాయి. దీంతో 12 ఓట్ల తేడాతో సునీల్ అగర్వాల్ గెలుపొందారు.
 
ఇక హెచ్‌సీఏ కోశాధికారిగా  జగన్ మోహన్ రావు ప్యానెల్‌కి చెందిన సీజే శ్రీనివాస రావు విజయం సాధించారు. సీజే శ్రీనివాస రావుకు 66 ఓట్లు పడగా, ప్రత్యర్థులు సంజీవ్‌కి 33, మహేందర్‌కు 24, గెర్రాడ్‌కి 9 చొప్పున ఓట్లు పడ్డాయి. మరోవైపు, జాయింట్ సెక్రటరీగా గుడ్ గవర్నెన్స్ ప్యానెల్ నుంచి బసవరాజు గెలుపొందారు.  అయితే  బసవరాజు కేవలం 2 ఓట్ల తేడాతో విజయం సాధించారు. హెచ్‌సీఏ సెక్రటరీగా క్రికెట్ ఫస్ట్ ప్యానల్‌కు చెందిన దేవరాజు విజయం పొందారు.

మొత్తం 173 ఓట్లు ఉండగా 169 మంది సభ్యులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. మాజీ క్రికెటర్స్ వెంకటపతి రాజు, వీవీఎస్ లక్ష్మణ్, శివాలాల్ యాదవ్, మిథాలీ రాజ్, స్రవంతి నాయుడు కూడా ఓటు వేశారు. అలాగే జీహెచ్‌ఎంసీ కమిషనర్ రోనాల్డ్ రాస్ కూడా ఓటు హక్కును వినియోగించుకున్నారు.

హెచ్‌సీఏ నూతన కార్యవర్గం

ప్రెసిడెంట్: ఏ జగన్‌మోహన్ రావు;  వైస్ ప్రెసిడెంట్: దల్జిత్ సింగ్; సెక్రటరీ– ఆర్ దేవరాజ్;  జాయింట్ సెక్రటరీ– టీ బసవరాజు;  ట్రెజరర్- సీజీ శ్రీనివాస్ రావు; కౌన్సిలర్: సునీల్ కుమార్ అగర్వాల్.